Advertisement
Advertisement
Abn logo
Advertisement

90 పైసలకు కొని రూ.2 లక్షలకు అమ్మేశాడు.. అతడు ఊహించిందే నిజమైంది!

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌లో జరిగిందీ ఘటన. ఎవరో తమదగ్గరున్న పాత సామాన్లు అమ్మేస్తుంటే..కుతూహలం కొద్దీ అతడు అక్కడికెళ్లాడు. ఓ పాత చెంచా కనిపించింది. చూడటానికి కొంచెం వింతగా ఉంది. ఆ చెంచా హాండిల్ చాలా సన్నగా మునుపెన్నడూ చూడని స్టైల్‌లో ఉంది. ఈ కాలపు మోడల్ కాదేమోనని అతడికి అనిపించింది. ధర ఎంత..? అని అక్కడివారిని అడిగాడు. 90 పైసలే(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే) అని అవతలి వారు సమాధానమిచ్చారు. కానీ..తాను కొనబోయే పాత చెంచా విలువ అంతకంటే ఎక్కువే ఉంటుందని అతడికి అనుమానం కలిగింది. దీంతో.. ‘‘కొంటే పోయేదేముంది.. 90 పైసలేకదా..’’ అని అనుకుంటూ ఆ చెంచాను కొనేశాడు. ఆ తరువాత తన అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు రంగంలోకి దిగాడు.

 ముందుగా.. ఓ ఆక్షన్ హౌస్ వారిని సంప్రదించాడు. ‘‘నా దగ్గర పురాతన కాలం నాటి చెంచా ఒకటుంది. దాని విలువ ఎంతో చెప్పి వీలైతే కాస్త వేలం వేసి పెట్టండి’’ అని వారిని కోరాడు. చెంచాను వారికి చూపించి..వారి సమాధానం కోసం ఉత్కంఠగా ఎదురుచూడసాగాడు. ఓ రెండు రోజుల తరువాత అతడి ఉత్కంఠకు తెరదించుతూ వారు జవాబిచ్చారు. ఆ చెంచా ఖరీదు దాదాపు 500 పౌండ్లు ఉండొచ్చని చెప్పేసరికి అతడి ఆనందం ఆకాశాన్నంటింది. 13వ శతాబ్దం నాటి ఈ చెంచా చాలా విలువైనదని వారు చెప్పారు. 

అనంతరం.. చెంచాను వేలం వేయగా ఏకంగా 2,375 పౌండ్లకు(మన కరెన్సీలో అయితే దాదాపు రూ.2లక్షలు) అమ్ముడు పోయింది. అతడు ఊహించిన దాని కంటే కొన్ని వేల రెట్లు రావడంతో అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇంగ్లండ్‌లోని సోమర్‌సెట్‌లోగల లారెన్సెస్ ఆక్షనీర్స్ వారు ఇటీవల ఈ చెంచాను వేలం వేశారు. అన్నట్టు..ఈ వేలంలో వచ్చిన సొమ్ముతో సదరు వ్యక్తి మాంచి హాలీడే ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడట. పాత సామాన్లు కొనే తన హాబీ కారణంగా ఇంత లాభం వచ్చిపడుతుందని తానెప్పుడూ అనుకోలేదని అతడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అయితే.. ఈ లక్కీ ఫెలో పేరు, ఇతర వివరాలను మాత్రం ఆక్షన్ హౌస్ వారు గోప్యంగానే ఉంచారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement