‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఐకియా కప్పుల రీకాల్‌

ABN , First Publish Date - 2020-02-22T06:54:28+05:30 IST

ప్రపంచ ఫర్నీచర్‌ రిటైలింగ్‌ దిగ్గజం ఐకియా గతనెల 15న మేడ్‌ ఇన్‌ ఇండియా కప్పులను రీకాల్‌ (వెనక్కి రప్పించడం) చేసింది. వీటి తయారీలో

‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఐకియా కప్పుల రీకాల్‌

  • భారత మార్కెట్లో కంపెనీ వ్యాపార ప్రణాళికలపై ప్రభావం

ప్రపంచ ఫర్నీచర్‌ రిటైలింగ్‌ దిగ్గజం ఐకియా గతనెల 15న మేడ్‌ ఇన్‌ ఇండియా కప్పులను రీకాల్‌ (వెనక్కి రప్పించడం) చేసింది. వీటి తయారీలో ఉపయోగించిన రసాయనాలు నిర్దేశిత  మోతాదు కంటే అధికంగా ఉండటం వల్లే వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భారత్‌లో తయారైన ట్రోలిగ్టివిస్‌ ట్రావెల్‌ మగ్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా తమకున్న 400 స్టోర్లలో ఎక్కడైనా అప్పగించి సొమ్ము పూర్తి రిఫండ్‌ పొందవచ్చని ఐకియా తన ప్రకటనలో పేర్కొంది. ఇవే కప్పులు ఇటలీలో తయారైనవి మాత్రం వినియోగానికి పూర్తి సురక్షితమని స్పష్టం చేసింది. ఈ మేడ్‌ ఇన్‌ ఇండియా కప్పులను గత ఏడాది ఆగస్టు నుంచి భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తూ వచ్చింది సంస్థ. ఈ కప్పుల వినియోగంతో కస్టమర్ల ఆరోగ్యంపై తక్షణ ప్రభావమేమీ లేనప్పటికీ, ఎలాంటి ఫిర్యాదులు అందిన దాఖలాలు లేనప్పటికీ ముందుజాగ్రత్త చర్యగానే రీకాల్‌ చేసినట్లు ఐకియా వెల్లడించింది. 


భారత్‌ మార్కెట్లో 150 కోట్ల డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన ఐకియా.. దేశంలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పా టు చేసింది. ముంబైలోనూ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది. మున్ముం దు ఢిల్లీ, బెంగళూరులోనూ ఏర్పాటు చేయబోతున్నది. అంతేకాదు, ముంబై, పుణెలో ఆన్‌లైన్‌ స్టోర్లను సైతం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ, నిబంధనల మేర కు స్థానికంగా వస్తు సేకరణ జరపలేకపోతోంది. స్థానికంగా సంస్థ వస్తు సేకరణ ప్రణాళికలపై కప్పుల రీకాల్‌ ప్రభావం చూపవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.

 సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ రంగ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) నిబంధనల ప్రకారం.. భారత్‌లో పెట్టుబడులు పెట్టిన ఈ రంగ కంపెనీలు తాము విక్రయించే వస్తువుల్లో 30 శాతం స్థానికంగానే సేకరించాల్సి ఉంటుంది. వస్తు సేకరణ విషయంలో తమకు భారత్‌ ముఖ్యమైన మార్కెట్లలో ఒకటని ఐకియా అంటోంది. ప్రభుత్వ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఎజెండాకు పూర్తి మద్దతిస్తామని, ఇక్కడి మార్కెట్లో రిటైల్‌ విక్రయ కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలో స్థానికంగా వస్తు సేకరణ స్థాయి 25 శాతానికి చేరుకుందని కంపెనీ తెలిపింది. 2020 నాటికి స్థానికంగా వస్తు సేకరణను 60 కోట్ల యూరోల స్థాయికి పెంచాలనుకుంటున్నట్లు చెప్పింది. 


భారత బ్రాండ్‌ ఇమేజ్‌కు దెబ్బ!

ఐకియా తన కప్పులను రీకాల్‌ చేసిన విధానం భారత బ్రాండ్‌ ఇమేజీకి గండికొట్టేలా ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేవలం మేడ్‌ ఇన్‌ ఇండియా కప్పులను మాత్రమే కొనుగోలు చేయవద్దని కంపెనీ కోరిందంటే, ఈ సమస్యను ఆ వస్తువుకు లేదా తన కంపెనీకి గాకుండా వస్తువు తయారైన దేశానికి ఆపాదించిన భావన కలుగుతోందని ట్రస్ట్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ సీఈఓ ఎన్‌ చంద్రమౌళి అభిప్రాయపడ్డారు. ఇది వాస్తవ సమస్య నుంచి కస్టమర్ల దృష్టి మరల్చే ప్రయత్నం లాగే కన్పిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే, ఇతరుల నుంచి సేకరించే వస్తువు నాణ్యత తమ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉందా..? లేదా..? అని సరి చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆ వస్తువును సేకరించిన కంపెనీదే. కానీ, ఈ విషయంలో ఐకియా తన అజాగ్రత్తను, అలక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించినట్లుగా అన్పిస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


Updated Date - 2020-02-22T06:54:28+05:30 IST