తిరుమల నుంచి అలిగివెళ్లిపోయిన YSRCP MP..!

ABN , First Publish Date - 2022-01-13T06:49:06+05:30 IST

అటు విద్యుద్దీప వెలుగులు.. ఇటు పుష్పాలంకరణలతో తిరుమల వైకుంఠ ఏకాదశికి శోభాయమానంగా ముస్తాబైంది. శ్రీవారి ఆలయ మహద్వార గోపురం, ప్రాకారం, ధ్వజస్తంభం వద్ద, ఉత్తర ద్వారం.. ఆలయం వెలుపల పార్కులు, వాటర్‌ ఫౌంటెన్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఆల

తిరుమల నుంచి అలిగివెళ్లిపోయిన YSRCP MP..!

  • ఇల ‘వైకుంఠం’ 
  • విద్యుద్దీప వెలుగులు..
  • పుష్పాలంకరణలతో శోభాయమానంగా తిరుమల

తిరుమల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అటు విద్యుద్దీప వెలుగులు.. ఇటు పుష్పాలంకరణలతో తిరుమల వైకుంఠ ఏకాదశికి శోభాయమానంగా ముస్తాబైంది. శ్రీవారి ఆలయ మహద్వార గోపురం, ప్రాకారం, ధ్వజస్తంభం వద్ద, ఉత్తర ద్వారం.. ఆలయం వెలుపల పార్కులు, వాటర్‌ ఫౌంటెన్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఆలయం లోపల 5 టన్నులు, వెలుపల 5 టన్నుల సంప్రదాయ పుష్పాలతో ముస్తాబు చేశారు. మరో లక్ష కట్‌ ప్లవర్స్‌తో శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభాన్ని, బలిపీఠం, ఉత్తరద్వారాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దారు. ఈసారి ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేసిన చిలుకల బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహద్వారం గోపురానికి శంఖుచక్రనామల నడుమ పుష్పాలతో తయారుచేసిన మహావిష్ణువు, లక్ష్మీదేవి దేవతామూర్తుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. కాగా, గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ను రద్దు చేసిన టీటీడీ ముందు వచ్చిన వారికి ముందు ప్రాదిపదికన సీఆర్వో కౌంటర్‌లో గదులు కేటాయించారు.


వీఐపీలకు పక్కా ఏర్పాట్లు..

శ్రీవారి దర్శనార్థం వచ్చిన సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులకు, మంత్రులకు వెంకటకళ అతిథిగృహంలోని కౌంటర్‌ ద్వారా, టీటీడీ చైర్మన్‌, బోర్డు సభ్యులకు సన్నిధానంలోని కౌంటర్‌ ద్వారా దర్శన టికెట్లు కేటాయించారు. వీరు రాంభగీచా కాటేజీ మీదుగా సుపథం ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారుఫ టీటీడీ చైర్మన్‌, బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి సన్నిధానం కౌంటర్‌ ద్వారా టికెట్లు కేటాయించారు. వీరు ఏటీసీ జనరేటర్‌ నుంచి ఆలయంలోకి వెళతారుఫ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీతానిలయం, రామరాజు నిలయంలోని కౌంటర్ల ద్వారా టికెట్లు కేటాయించారు. వీరంతా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 నుంచి ఆలయంలోకి వెళతారుఫ ఆలిండియా సర్వీస్‌ ఆఫీసర్లు, కేంద్ర, రాష్ట్ర అధికారులకు గంబుల్‌ అతిథిగృహంలోని కౌంటర్ల ద్వారా టికెట్లు కేటాయించారు. వీరిని ఏటీసీ జనరేటర్‌ నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. 


వసతి కల్పనపై ఎమ్మెల్యేల అసంతృప్తి..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా బుధవారం తిరుమలకు వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు వసతి కల్పనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమలలోని కొన్ని గదులు మరమ్మతుల్లో ఉన్న క్రమంలో వసతికి ఇబ్బందిగా మారింది. దీంతో ఎమ్మెల్యేలకు నందకం, వకుళ విశ్రాంతి భవనాల్లోని గదులను కేటాయించారు. గదుల్లో ఏసీ లేదని, ఇనుప మంచాలు ఉన్నాయని, తమకు ఇలాంటి గదులు కేటాయిస్తారా అంటూ కొందరు రిసెప్షన్‌ సిబ్బందిపై ఆగ్రహించారు. వీరు వాస్తవ పరిస్థితిని వివరించడంలో ఎమ్మెల్యేలు సర్దుకుపోయారు.


తిరుమల నుంచి అలిగివెళ్లిపోయిన ఎంపీ!

తనకు సరైన గదిని కేటాయించలేదంటూ చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తిరుమల నుంచి అలిగి వెళ్లిపోయినట్టు తెలిసింది. గురువారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా బుధవారం పలువురు ప్రముఖులు తిరుమలకు వచ్చారు. తిరుమలలో యాత్రికుల బస నిమిత్తం దాదాపు 7,500 గదులు ఉండగా ప్రస్తుతం 1,300కు పైగా గదుల్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి వచ్చే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నందకం, వకుళమాత విశ్రాంతి భవనాల్లో గదులు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే తిరుమలకు వచ్చిన ఎంపీ రెడ్డెప్పకు వకుళమాత విశ్రాంతి భవనంలో మూడు గదులు కేటాయించారు. అయితే గదుల్లో బెడ్స్‌, బెడ్‌షీట్లు సక్రమంగా లేవంటూ ఎంపీ తిరుమల నుంచి తిరిగి వెళ్లిపోయినట్టు సమాచారం. 

Updated Date - 2022-01-13T06:49:06+05:30 IST