యడియూరప్ప బాటలోనే సాగుతాం: బొమ్మై

ABN , First Publish Date - 2021-07-28T21:34:02+05:30 IST

ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రజలతో చక్కటి మైత్రీసంబంధాలు నెరుపుతూ, ప్రజానుకూల..

యడియూరప్ప బాటలోనే సాగుతాం: బొమ్మై

బెంగళూరు: ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రజలతో చక్కటి మైత్రీసంబంధాలు నెరుపుతూ, ప్రజానుకూల కార్యక్రమాలు చేపట్టిన బీఎస్ యడియూరప్ప బాటలోనే ముందుకు సాగుతామని, ఆయన ఏర్పరచిన మార్గదర్శకాలను అనుగుణంగా ముందుకు వెళ్తామని కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని, ప్రధానిని కలుసుకునేందుకు సమయం అడిగానని, ఆయన నుంచి పిలుపురాగానే వెళ్లి కలుస్తానని చెప్పారు.


పదవీ బాధ్యతలు చేపట్టగానే కేబినెట్‌, అధికారులతో సమావేశమైనట్టు బొమ్మై చెప్పారు. ఈ అధికారిక సమావేశంలో ప్రభుత్వ ఎజెండా ఏమిటో కూడా చెప్పినట్టు తెలిపారు. వరదలు, కోవిడ్ మేనేజిమెంట్‌కు ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. రైతుల పిల్లల కోసం రూ.1000 కోట్లతో స్కాలర్‌షిప్ స్కీమ్ తేనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. సంధ్యా సురక్ష పథకం కింద వృద్ధాప్య పెన్షన్లను రూ.1000 నుంచి రూ.1200కు పెంచనున్నామని, ఇందువల్ల ఖజానాపై రూ.863.52 కోట్ల అదనపు భారం పడుతుందని, 35.98 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కోవిడ్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వనరుల సక్రమ వినియోగం, ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ పాటించడంపై దృష్టి సారించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

Updated Date - 2021-07-28T21:34:02+05:30 IST