Abn logo
Aug 2 2021 @ 00:47AM

అనుమతుల పేరిట అక్రమ దందా

బేల మండలంలో అధికారుల ఇష్టారాజ్యం

సీజ్‌ చేసిన ఇసుక డంపులను తిరిగి అప్పగింత

డబుల్‌బెడ్‌రూం నిర్మాణాలకు ఉచితంగా సరఫరా

టెండర్‌ నిర్వహించకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు

ఆందోళనకు సిద్ధమవుతున్న ఆదివాసీ సంఘాలు

ఆదిలాబాద్‌, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): జిల్లా సరిహ ద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నదిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని చె బుతున్న అధికారులే తిరిగి అనుమతుల పేరిట అక్ర మార్కులకు ఇసుక డంపులను అప్పచెప్పడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బేల మండలంలో ఇసుక మాఫియా ఆగడాలకు ఓ ఆదివాసీ యువకుడి ప్రాణాలు బలికావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మండల పరిధిలోని హేటీఎక్స్‌రోడ్డు, న్యూ తెలంగ్‌రావ్‌గూడ, కొగ్దూర్‌, సాయినగర్‌, బేల, అశోక్‌నగర్‌, కొమరంభీంకాలనీలో దాడులు చేసి భారీగా నిలువ చేసిన ఇసుక డంపులను సీజ్‌ చేశారు. ఇసుక టిప్పర్‌ ప్రమాదంలో మృతి చెంది న కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రూ.10లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్‌ చేసినా కేవలం రూ.2లక్షల 50వేలు ఇచ్చి టిప్పర్‌ యజమాని చేతులు దులుపుకున్నాడు. ఇదిలా ఉండగా సీజ్‌ చేసిన ఇసుక డంపులను బేల మండల తహసీల్దార్‌ జూలై 6,7 తేదీల్లో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే అంతలోనే ఏమైందో ఏమో కానీ గంటల వ్యవధిలోనే తహసీల్దార్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కలెక్టర్‌ ఆదేశాలు ఉన్నాయంటూ పంచాయతీరాజ్‌ అధికారుల ద్వారా కాంట్రాక్టర్లకు ఉచితంగా ఇసుక డంపులను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. 

అనుమానంగా అధికారుల తీరు..

బేల మండలంలో ఇసుక డంపులను సీజ్‌ చేయడం, వేలం వేయడం అన్ని అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయడం జిల్లాలో ఇదే మొదటి సారి అన్న అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించక పోవడంతోనే కొందరు కాంట్రాక్టర్లు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల పనులకు దూరంగా ఉంటున్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో డబుల్‌బెడ్‌రూంకు రూ.5లక్షల4 వేలు, అర్బన్‌ ప్రాంతంలో 5లక్షల 40వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. కానీ ఎక్కడా ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించలేదు. కానీ కొందరు నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న పంచాయతీరాజ్‌ అధికారులు ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయంటూ ఇసుకను ఉచితంగా సరఫరా చేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. టెండర్లు పిలిచే సమయంలోనే ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని స్పష్టంగా చెప్పి ఉంటే జిల్లాలో మరికొంత మంది కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే అవకాశం ఉండేది. అలాగే ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయేది కాదు. అయితే ఎక్కడా లేని విధంగా బేల మండలంలో డబుల్‌ బెడ్‌రూంలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయడం ఏమిటన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నేతల జోక్యం సంబంధిత కాంట్రాక్టర్లపై అట్టి ప్రేమ చూపుతూ అధికారులు అనుమతులిచ్చారన్న వాదనలు బలంగా వినిపస్తున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంపులను సీజ్‌ చేసిన తర్వాత వేలం పాట వేయాల్సి ఉంటుంది. అలాకాకుండా అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వడం వెనుక అసలు మతలబు ఏమిటో అంతుచిక్కడం లేదు. ఒకసారి వేలం పాటపై ప్రకటన చేసిన తర్వాత వెనక్కి తీసుకున్నట్లు సంబంధిత తహసీల్దార్‌ తిరిగి ప్రకటన చేయాల్సి ఉం టుంది. కానీ అలా చేయకుండా జిల్లా స్థాయి స్యాండ్‌ కమిటీ (డీఎల్‌ఎస్‌సీ) నిర్ణయంతో అనుమతులు ఇవ్వడంపై అధికారుల తప్పిదాలకు అద్దం పడుతోంది. ఇటీవల భీంపూర్‌ మండలం తాంసి(కె) గ్రామంలో సీజ్‌ చేసిన ఇసుక డంపులను వేలంపాట వేయడంతో రూ.60వేల ఆదాయం వచ్చింది. దీని మాదిరిగానే బేల మండలంలో వేలం పాట వేసి ఉంటే లక్షల రూపాయల ఆదాయం వచ్చి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బేల మండలంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్న మహారాష్ట్ర కాంట్రాక్టర్ల వద్ద ఏదో ఆశపడే అధికారులు అనుమతుల పేరిట ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రకు తరలింపు..

బేల మండలంలో సీజ్‌ చేసిన ఇసుక డంపులను డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు తరలించాలని బేల తహసీల్దార్‌ అనుమతులు ఇచ్చారు. అయితే సంబం ధిత కాంట్రాక్టర్‌, పంచాయతీరాజ్‌ అధికారులు కుమ్మకై తహసీల్దార్‌ పరోక్ష సహకారంతో యథేచ్ఛగా మహారాష్ట్రకు ఇసుకను తరలిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా అధికారులకు ఏ మాత్రం పట్టింపు లేకుండానే పోయింది. ఇసుకను తరలించేందుకు టీఎస్‌01 ఈఎల్‌- 2561, ఏపీ01ఎక్స్‌ 5806, టీఎస్‌01ఈఎల్‌ -2565, ఏపీ01టీఏ1507, టీఎస్‌01 ఈఎల్‌-2975 నెంబర్లు గల ఐదు ట్రాక్టర్లకు తహసీల్దార్‌ అనుమతులు ఇవ్వగా ఎంహెచ్‌ 29బీపీ 2818 నెంబర్‌ గల ట్రాక్టర్‌లో ఇసుకను తరలించడం ఏమిటో అధికారులకే తెలియాలి మరి. అనుమతుల పేరిట అక్రమాలు జరిగే అవకాశం ఉన్న అధికారులు అతిఉత్సాహంతో అనుమతులు ఇ చ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కలెక్టర్‌ను కొందరు అధికారులు తప్పుతోవ పట్టిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.