పేదల పేరిట పెద్దలు స్వాహా

ABN , First Publish Date - 2020-08-05T10:19:38+05:30 IST

పేదల స్థలాల అభివృద్ధికి గ్రావెల్‌ అవసరమని అనుమతులు తెచ్చుకున్నారు.

పేదల పేరిట పెద్దలు స్వాహా

బడేపురంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు 

ప్రైవేటు వెంచర్లకు అమ్ముకుంటున్న వైనం

30 అడుగుల గుంతలతో గ్రామస్థుల్లో ఆందోళన


తాడికొండ ఆగస్టు 4: పేదల స్థలాల అభివృద్ధికి గ్రావెల్‌ అవసరమని  అనుమతులు తెచ్చుకున్నారు. అయితే పేదల స్థలాల అభివృద్ధి పూర్తి అయినా  గ్రావెల్‌ తవ్వకాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. గ్రావెల్‌ను యథేచ్ఛగా తవ్వి అమ్ముకుని జేబులు నింపుకుంటున్న అధికార పార్టీ నాయకుల వ్యవహారంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం  తాడికొండ శివారు బడేపురం గ్రామంలో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటుంది.  బడేపురం గ్రామంలో ఉన్న కొండ వెనుక ప్రాంతంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రావెల్‌ను తవ్వి తరలిస్తున్నారు. పేదలకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన భూములను అభివృద్ధి చేయటానికి మాత్రమే అధికారులు గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు.


ఆయా అనుమతుల ఆధారంగా అధికార పార్టీ నాయకుడు అక్రమ తవ్వకాలకు తెరలేపారు. ఇప్పటికే ఇళ్ల స్థలాల అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. అయినా ఇంకా కొండ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. గ్రావెల్‌ను తవ్వనందుకు సీనరేజ్‌ కింద రూ.600, ట్రాక్టర్‌ అద్దె రూ.600లుగా నిర్ణయించి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. గ్రామాల్లోని ఇళ్ల నిర్మాణాలు, ప్రైవేటు వెంచర్లకు ఈ గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండ వెనుక ప్రాంతంలో దాదాపు 30 అడుగుల పైనే తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపిన ప్రాంతానికి అనుకునే వ్యవసాయ భూములు ఉన్నాయి.


వ్యవసాయ పనులకు వచ్చే అంతపెద్ద లోతును ఏర్పడిన గుంతలు చూసి   భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు నిబంధనల ప్రకారం క్వారీయింగ్‌ నిర్వహించాలంటే సంబంధిత  గ్రామ పంచాయతీ అంగీకారంతో పాటు మైనింగ్‌ అధికారుల నుంచి అనుమతులు పొందాలి. ఈ ప్రకారం చేస్తే పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది. కానీ ఇక్కడ  అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అలాంటి నిబంధనలు పాటించడంలేదు.  అక్రమ తవ్వకాలు జరుగుతున్నా సంబంధింత అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇళ్ల స్థలాల అభివృద్ధికే అనుమతి 

బడేపురంలో పేదలకు పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాల అభివృద్ధికి మాత్రమే గ్రావెల్‌ను తరలించటానికి అనుమతులు ఇచ్చాం.   అక్రమ తవ్వకాలు మా దృష్టికి రాలేదు. సిబ్బందిని పంపించి విచారణ చేపడతాం. తవ్వకాలు జరిపినట్లైతే వారిపైచర్యలు తీసుకుంటాం. - వైవీబీ కుటుంబరావు, తహసీల్దారు,  తాడికొండ 

Updated Date - 2020-08-05T10:19:38+05:30 IST