Abn logo
Oct 22 2020 @ 00:16AM

అక్రమంగా ఫైనాన్స్‌ దందా

Kaakateeya

అధిక వడ్డీతో పేదలను దోచుకుంటున్న వ్యాపారులు

పోలీసులు హెచ్చరించినా మారని తీరు  


బెల్లంపల్లి, అక్టోబరు 21: జిల్లాలోని అన్ని మండలాల్లో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనాన్స్‌ దందా కొనసాగిస్తున్నారు. ఇందులో గిరిగిరి దందాతో పాటు ఫైనాన్స్‌ ప్యాపారం నిర్వహిస్తున్నారు. పేదలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులే లక్ష్యంగా ఈ దందా కొనసాగుతోంది. అప్పు ఇవ్వడానికి పట్టాదారు పుస్తకం, బంగారం, వాహనాల పత్రాలను తనఖా పెట్టుకుని అధిక వడ్డీతో డబ్బులు అందజేస్తున్నారు. అప్పు తీర్చని యెడల వాటిని జప్తు చేస్తున్నారు. పట్టణాల్లో ఫైనాన్స్‌ దందా కొనసాగుతుండగా, గ్రామాల్లో గిరి గిరి దందా సాగుతోంది. గత ఏడాది  జిల్లాలో పెట్రేగిపోతున్న ఫైనాన్స్‌, గిరిగిరి మాఫియాపై రామగుండం కమిషనర్‌ సత్యనారాయణ దృష్టి సారించి దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న వడ్డీ వ్యాపారులు మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. 


స్థిరాస్తి డాక్యుమెంట్లు తనఖా..

వడ్డీ వ్యాపారం, గిరి గిరి దందా చేసే వ్యాపారులు అప్పులు ఇస్తున్నప్పుడు డబ్బులు తీసుకున్న వారి స్థిరాస్తి డాక్యుమెంట్లు, ఇంటి పత్రాలు, వద్ద ఖాళీ చెక్కులను తనఖా పెట్టుకుంటున్నారు. కొన్ని మండలాల్లో ఏకంగా ఏటీఎం కార్డులను దగ్గర పెట్టుకుం టున్నారు. అప్పు తీసుకున్న వారు సమయానికి డబ్బులు ఇవ్వకుంటే ఏటీఎం కార్డుల ద్వారా వారే డ్రా చేసుకుంటున్నారు. స్థిరాస్తి డాక్యుమెంట్లను కుదవ పెట్టిన వారు సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే వారి పేరుమీద రిజిష్ర్టేషన్‌లు చేయించుకుంటున్న సంఘటనలు సైతం  చోటు చేసుకుంటున్నాయి. వీరు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం కొనసాగిస్తూ పేదలను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వీరిని ఎక్కువగా చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, పేద కుటుంబాలు ఆశ్రయిస్తున్నారు. రూ. 10 వేలు అప్పు కావాలంటే రూ. వెయ్యి కోత విధించి రూ. 9 వేలు ఇస్తున్నారు. వీరి నుంచి రోజుకు రూ. 500 చొప్పున 20 రోజుల్లో రూ. 10 వేలు వసూలు చేస్తున్నారు. మరికొంత మంది రూ. 100కు నెలకు రూ. 5 చొప్పున, అత్యవసరం ఉంటే రూ. 10 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. 


పోలీసుల దాడులు..

గత ఏడాది జిల్లాలో రామగుండం పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బంది ఫైనాన్స్‌ వ్యాపారుల ఇళ్లు కార్యాలయాలపై దాడులు నిర్వహించి 49 మందిని అరెస్టు చేశారు.  వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదుతో పాటు ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డులు, బాండ్‌ పేపర్లు, వాహనాల పత్రాలు, పట్టాదారు పుస్తకాలను వందల్లో స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్న వ్యాపారులు మళ్లీ వడ్డీ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.. 


అధిక వడ్డీలకు అప్పులు ఇస్తే చర్యలు..రహెమాన్‌, బెల్లంపల్లి ఏసీపీ 

ఫైనాన్స్‌ వ్యాపారులు, గిరి గిరి దందా చేసే వారు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు ఎవరినైనా అధిక వడ్డీలు వసూలు  చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నిబంధనల ప్రకారం వడ్డీ వ్యాపారం నిర్వహించుకోవాలి. అధిక వడ్డీలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. 

Advertisement
Advertisement