అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై కొరడా

ABN , First Publish Date - 2020-08-11T11:19:33+05:30 IST

జిల్లాను ఆనుకుని ఉన్న హైదరాబాద్‌ నగర శివారుల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై కలెక్టర్‌

అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై కొరడా

కలెక్టర్‌ ఆదేశాలతో కూల్చివేతలు 

రుద్రారంలో అక్రమ లేఅవుట్‌ తొలగింపు

కంది మండలంలో నాలుగు వెంచర్ల ధ్వంసం

రుద్రారం, కంది పంచాయతీ కార్యదర్శులపై వేటు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఆగస్టు 10 : జిల్లాను ఆనుకుని ఉన్న హైదరాబాద్‌ నగర శివారుల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుండానే పంచాయతీ అధికారులతో కుమ్మక్కై నిర్మిస్తున్న వెంచర్లు, కట్టడాలు, అంతస్తులను కూలుస్తున్నారు. తొలుత పటాన్‌చెరు మండలం రుద్రారం, ఇంద్రేశంలో కొరడా ఝుళిపించారు. వారం రోజులుగా కంది మండలం ఆరుట్ల, చిద్రుప్ప, కవలంపేటలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ రియల్టర్ల ఆగడాలకు చెక్‌ పెడుతున్నారు. అక్రమార్కులకు సహకరిస్తున్న పంచాయతీ అధికారులపై కూడా వేటు వేస్తున్నారు. 


హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో స్థానిక పంచాయతీలకు ఎలాంటి అనుమతులు ఇచ్చే అఽధికారం లేదు. హెచ్‌ఎండీఏ అనుమతితో వేసిన లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ జరిగిన స్థలాలకు మాత్రం జీ ప్లస్‌ 2 అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు జారీ చేసే అధికారం ఉంది. దీన్ని అడ్డుపెట్టుకుని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. అడ్డుకోవాల్సిన ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు సైతం రియల్టర్లతో చేతులు కలుపుతున్నారు. పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం, ముత్తంగి, రుద్రారం, చిట్కుల్‌, ఇస్నాపూర్‌, పాషమైలారం, భానూర్‌, కిష్టారెడ్డిపేట, గుమ్మడిదల మండల పరిధిలోని పలు గ్రామాలతో పాటు మండల కేంద్రమైన కందిలో పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వేసిన పంచాయతీ లేఅవుట్లలో సైతం అమ్మకాలు సాగిస్తున్నారు. అడపాదడపా హెచ్‌ఎండీఏ అధికారులు గతంలో కూల్చివేతలకు పాల్పడినా తరువాత అక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. 


రుద్రారం లేఅవుట్‌పై చర్యలు

కొందరు ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో సర్పంచ్‌ల అండదండలతో కొనసాగుతున్న అక్రమాలపై కలెక్టర్‌ హన్మంతరావు దృష్టి కేంద్రీకరించారు. అవినీతిలో కూరుకుపోయిన పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ప్రారంభ దశలో రుద్రారంలో వేసిన అక్రమ వెంచర్‌ నామరూపాల్లేకుండా కనుమరుగైంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని పటాన్‌చెరు మండలం రుద్రారంలో ఇటీవల ఓ భారీ అక్రమ వెంచర్‌కు కొందరు తెరలేపారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి పంచాయతీ సిబ్బందితో కుమ్మక్కై సర్వే నెంబర్‌ 702 నుంచి 710వరకు ఉన్న భూముల్లో లేఅవుట్‌ వేసి ప్లాట్లను విక్రయించారు. అది అక్రమ లేఅవుట్‌ అని తెలియని అమాయకులు ఎందరో డబ్బు వెచ్చించి కొనుగోలు చేశారు. సుమారు 50 ఇళ్లను ఆగమేఘాలపై నిర్మించేందుకు పిల్లర్లు వేశారు. కొందరు గ్రామస్థులు, రైతులు పంచాయతీ పాలకమండలి, పంచాయతీ ఈవో, మండల పంచాయతీ అధికారికి ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో నేరుగా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన చర్యలకు ఉపక్రమించారు. జిల్లా యంత్రాంగం కదిలివచ్చి మొత్తం లేఅవుట్‌నే పునాదులతో సహా పెకిలించి వేశారు. మండల కేంద్రమైన కంది పరిధిలోని తున్కిలతండా, మండలంలోని కవలంపేట, చిద్రుప్ప, ఆరుట్లలో నాలుగు అక్రమ వెంచర్లను అధికారులు కూల్చివేశారు. 


ప్రభుత్వ ఆదాయానికి గండి

అక్రమ వెంచర్లు, నిర్మాణాలకు అనుమతుల ద్వారా హెచ్‌ఎండీఏకు భారీగా గండిపడుతోంది. రుద్రారంలో వేసిన భారీ వెంచర్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి జమ చేయకుండానే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం సాగించారు. దీనికి స్థానిక పంచాయతీ పెద్దలే అండదండలు అందించడం గమనార్హం. ఆయా పంచాయతీలలో ప్లాట్ల క్రమబద్ధీకరణ జరగకుండానే అనుమతులు ఇవ్వడం ద్వారా హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. పంచాయతీల్లో జీ ప్లస్‌ 2 అంతస్తులకు పెద్ద ఎత్తున వసూళ్లు చేసి పంచాయతీ సెక్రెటరీలు అనుమతులు ఇచ్చేస్తున్నారు. పైన మరో రెండు అక్రమ అంతస్తులు వేసుకునేందుకు పంచాయతీల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీలు గంపగుత్తగా మాట్లాడుకుని వాటాలు పంచుకుంటున్నారు. ఇటీవల కలెక్టర్‌ ఆదేశాల మేరకు కూల్చివేసేందుకు ఆయా పంచాయతీల సిబ్బంది వెళ్లగా డబ్బు తీసుకుని కూల్చివేసేందుకు వస్తారా అని వారిని నిలదీసిన సంఘటనలు సైతం ఉండటం గమనార్హం. 


పంచాయతీ సిబ్బందిపై చర్యలతో అక్రమాలకు చెక్‌

శివారు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పంచాయతీ అధికారులు రియల్టర్లతో కుమ్మక్కై అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. సర్పంచ్‌లు, పాలకమండలి సభ్యులకు అక్రమ బిల్డర్లకు సంఽధాన కర్తలుగా ఉంటూ పంచాయతీ కార్యదర్శులు వసూళ్లకు పాల్పడుతున్నారు. వారి అక్రమాలకు చెక్‌పెట్టేందుకు జిల్లా అధికారులు చర్యలకు దిగారు. సంచలనం రేపిన రుద్రారం సంఘటనలో పంచాయతీ కార్యదర్శి వీరేశంను సస్పెండ్‌ చేశారు. పంచాయతీ సర్పంచ్‌, పాలకమండళ్లపై చర్యలకు రెండు మార్లు నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలపై సంజాయిషీ కోరుతూ ఇంద్రేశం ఈవో మహే్‌షకు నోటీసు జారీ అయింది. అక్రమ వెంచర్‌లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చారని కంది పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన రహీంను సైతం సస్పెండ్‌ చేశారు. అక్రమ వెంచర్లు, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈవోలతో పాటు పంచాయతీ పాలకమండళ్లకు సైతం నోటీసులు జారీ చేశామని డీఎల్‌పీవో సతీ్‌ష్‌రెడ్డి తెలిపారు. హెచ్‌ఎండీఏ, జిల్లా పంచాయతీ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే రియల్టర్లు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు ఆదిలోనే అడ్డుకోకపోవడంతో ప్లాట్లు కొని అమాయకులు మోసపోతున్నారు. పెద్దఎత్తున విక్రయాలు జరిగిన తరువాత చర్యలకు దిగడంతో అమాయకులు బలవుతున్నారు.

Updated Date - 2020-08-11T11:19:33+05:30 IST