మైలవరం కృష్ణుడి ఒత్తిడితో.. అన‘కొండ’ను వదిలేశారా?

ABN , First Publish Date - 2020-12-03T06:41:39+05:30 IST

ఆ అధికార పార్టీ ప్రజాప్రతినిధికి నియోజకవర్గ ప్రజల సంక్షేమం పట్టదు.

మైలవరం కృష్ణుడి ఒత్తిడితో.. అన‘కొండ’ను వదిలేశారా?
కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ మైనింగ్‌

కొండను తొలిచేసి రూ.100 కోట్లు మింగేసిన ఎమ్మెల్యే బామ్మర్ది

నిబంధనల ప్రకారం ఐదు రెట్లు జరిమానా వసూలు చేయాలి

విచారణ పూర్తయ్యి 4 నెలలైనా అక్రమార్కులపై చర్యల్లేవు

మైలవరం కృష్ణుడి ఒత్తిడితో ఫైలును అటకెక్కించిన అధికారులు

మళ్లీ కొండపల్లి అటవీప్రాంతంలో గ్రావెల్‌ తవ్వకాలకు రంగం సిద్ధం

అభయారణ్యాన్ని కొండపోరంబోకుగా చూపించాలని ఒత్తిడి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆ అధికార పార్టీ ప్రజాప్రతినిధికి నియోజకవర్గ ప్రజల సంక్షేమం పట్టదు. ఆయన ఆలోచనలన్నీ గ్రావెల్‌, ఇసుక రీచ్‌ల చుట్టూనే తిరుగుతాయి. దృష్టి అంతా వాటి నుంచి వచ్చే అక్రమ ఆదాయంపైనే. మైలవరంపై పెత్తనం చేస్తున్న ఆ కృష్ణుడి బావమరిది కొండపల్లి రక్షిత అటవీప్రాంతంలో జరిపిన అక్రమ గ్రావెల్‌ తవ్వకాల విలువ అక్షరాలా రూ.100 కోట్లు. దీనిపై విచారణను ముందుకు సాగనివ్వకుండా అధికారులపై ఒత్తిడి తీసుకురావడంపైనే ప్రస్తుతం ఆ ప్రజాప్రతినిధి తన శక్తియుక్తులన్నింటినీ ప్రయోగిస్తున్నారు. అటవీశాఖ నిబంధనల ప్రకారం అక్రమ తవ్వకాలపై ఐదు రెట్లు జరిమానా వసూలు చేయాలి. అంటే ఎమ్మెల్యే బావమరిది చెల్లించాల్సిన జరిమానా విలువ రూ.500 కోట్లు..! దీని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతాన్నే కొండపోరంబోకుగా చూపించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 


కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతంలో గత ఏడాది ఆగస్టు నుంచి అక్రమంగా గ్రావెల్‌ తవ్వడం మొదలుపెట్టారు. ఏడాది కాలంలో సుమారు రూ.100 కోట్ల విలువైన గ్రావెల్‌ను తవ్వేశారు. ఈ తవ్వకాలపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అటవీశాఖ అధికారులు ఈ ఏడాది ఆగస్టు 4న దాడులు చేశారు. పలు వాహనాలను సీజ్‌ చేసి, తవ్వకాలను నిలిపివేశారు. రెండు రోజుల తరువాత దీనిపై ప్రాథమిక సమాచార నివేదిక (పీఐఆర్‌)ను నమోదు చేశారు. ఆ తర్వాత వివిధ సెక్షన్ల కింద అభియోగాలను నమోదు చేయాల్సి ఉన్నా, మైలవరం కృష్ణుడి ఒత్తిళ్లతో ఇంత వరకు ఆ ప్రక్రియ చేపట్టలేదు. మరోవైపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఇక్కడి అక్రమాలపై నివేదికను ఆగస్టు 14న అందజేసింది. దీనిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అక్రమాలు జరిగినట్లు నిగ్గు తేల్చిన అధికారులు తవ్వకాల లెక్కలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. సాధారణంగా అటవీప్రాంతంలో తవ్వకాలు జరిపితే, ఎంత విలువైన సంపదను తరలించుకుపోయారో గుర్తించి, అంతకు ఐదు రెట్లు జరిమానాలు వేయాల్సి ఉంది. కొండపల్లి అభయారణ్యంలో సుమారు రూ.100 కోట్ల విలువైన గ్రావెల్‌ను ఎమ్మెల్యే బావమరిది తవ్వేశారు. జరిమానా విధించాల్సి వస్తే సుమారు రూ.500 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. 


ఈ కారణంగానే అక్రమ తవ్వకాల లెక్కలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. కేసును నీరుగార్చేందుకు ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు కొండపల్లి అటవీప్రాంతాన్ని కొండపోరంబోకుగా చూపే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలా చూపడం ద్వారా జరిమానా నుంచి తప్పించుకోవడంతోపాటు మరోసారి అక్రమ తవ్వకాలకు సిద్ధం కావొచ్చునన్నది మైలవరం కృష్ణుడి వ్యూహం. 


వాహనాలను న్యాయస్థానంలో పెట్టరేం..?

సాధారణంగా ఏదైనా కేసులో వాహనాన్ని సీజ్‌ చేస్తే పోలీసులు ఆ కేసు ముగిసే వరకు వాహనాన్ని విడుదల చేయరు. విడుదల చేయాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. కానీ సుమారు రూ.100 కోట్ల అటవీ సంపదను దోచేసిన అక్రమార్కుల వాహనాలను కేవలం రూ.10వేల పూచీకత్తుతో విడుదల చేయాలని గత డీఎఫ్‌వో ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదమైంది. అటవీశాఖ అధికారులు దాడి చేసినపుడు ఏడు ఎక్స్‌కవేటర్లను, ఎనిమిది టిప్పర్లను సీజ్‌ చేశారు. వీటి విలువ సుమారు రూ.3 కోట్లకుపైగానే ఉంటుంది. కేసు నిలబడాలంటే సీజ్‌ చేసిన వాహనాలే కీలకం. అందుకే వాటిని విడుదల చేయించుకునేందుకు పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు సీజ్‌ చేసిన వాహనాలను కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. అక్రమ మార్గంలో వాటిని ఎలాగైనా విడిపించుకోవాలని ఎమ్మెల్యే బావమరిది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తవ్వకాల్లో ఎమ్మెల్యేకు సహకరించిన జిల్లా అటవీశాఖ అధికారిపై వేటుపడిందే తప్ప, అక్రమార్కులపై ఎలాంటి చర్యలు కానీ, జరిమానాలు కానీ లేవు. ఈ విషయంలో ఎమ్మెల్యేపై అటవీశాఖ ఉద్యోగులూ భగ్గుమంటున్నారు. 

Updated Date - 2020-12-03T06:41:39+05:30 IST