మీ చర్యలు దోమకాటులా కాదు పాము కాటులా ఉండాలి

ABN , First Publish Date - 2021-09-15T08:13:10+05:30 IST

అక్రమ మైనింగ్‌ విషయంలో అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీ చర్యలు దోమకాటులా కాదు పాము కాటులా ఉండాలి

కానీ, నామమాత్రంగానే శిక్షలు 

తాత్కాలిక అనుమతుల పేరిట విచక్షణారహితంగా తవ్వకాలు 

అధికారులేమో నిద్రపోతున్నారు

రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం

లంక భూముల్లో అక్రమమైనింగ్‌ ఆపాలని ఆదేశాలు


అమరావతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అక్రమ మైనింగ్‌ విషయంలో అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాత్కాలిక అనుమతులతో అక్రమార్కులు విచ్చలవిడిగా గనులు తవ్వేస్తుంటే... పర్యవేక్షించాల్సిన అధికారులు అధికారులు నిద్రపోతున్నారని అసహనం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్‌కి పాల్పడుతున్నవారిపై అధికారుల చర్యలు దోమకాటులా కాకుండా పాము కాటులా ఉండాలని వ్యాఖ్యానించింది. ఐదురెట్లు జరిమానా, క్రిమినల్‌ కేసులు పెట్టే అవకాశం ఉన్నా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లోని లంక భూముల్లో బొండు మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలను తక్షణం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గనులశాఖ ముఖ్య కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌, గనులశాఖ సహాయ సంచాలకులు, తహసీల్దార్‌ను ఆదేశించింది.


ఇకపై ఎలాంటి అక్రమ తవ్వకాలూ జరపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు మంగళవారం ఆదేశాలిచ్చారు. కేదార్లంక, బొర్రిలంక గ్రామాల్లోని లంక భూముల్లో బొండు మట్టి, ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ బి.ధనరాజ్‌, మరికొందరు వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. అక్రమ మైనింగ్‌కి పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా విధించాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

Updated Date - 2021-09-15T08:13:10+05:30 IST