ఇక సీమ ఎడారే?

ABN , First Publish Date - 2021-04-12T08:41:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తీసుకురావాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంతో రాయలసీమకు

ఇక సీమ ఎడారే?

కృష్ణా బోర్డు పరిధిలోకి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు!

పాలమూరు, డిండి ఎత్తిపోతలను

కేంద్ర నోటిఫికేషన్‌లో చేర్చే అవకాశం

ఇదే జరిగితే ఆంధ్రకు తీవ్ర నష్టం

కృష్ణా జలాల్లో 120 టీఎంసీలు గోవిందా!

అప్పనంగా పొరుగు రాష్ట్రానికి ఇచ్చినట్లే!

రాష్ట్ర ప్రయోజనాలకు శాశ్వత గండి

సాగునీటి రంగ నిపుణుల హెచ్చరిక

కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌


రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను సంబంధిత బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నద్ధం కావడంపై ఆంధ్రప్రదేశ్‌లోని సాగునీటి రంగ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి కేంద్రం తీసుకురానుందని.. వీటికి ఆమోదముద్ర వేస్తే రాయలసీమ ఎడారి అవుతుందని.. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. భావి తరాలు భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర సాగు, తాగు నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తీసుకురావాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంతో రాయలసీమకు పెనుముప్పు ఏర్పడుతుందని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ.. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ జారీచేయనుందన్న సమాచారం వారికి ఆందోళన కలిగిస్తోంది.


రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. గోదావరి, కృష్ణా నదీ జలాలపై అజమాయిషీని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించారు. సంబంధిత జలవివాదాల ట్రైబ్యునళ్లు రెండు రాష్ట్రాలకూ కేటాయించిన నదీ జలాల మేరకు.. ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు, వాడకం గురించి అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సదరు ప్రాజెక్టులన్నిటినీ బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని 2014 నుంచీ ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తుం  డగా.. తెలంగాణ వ్యతిరేకిస్తోంది. పొరుగు రాష్ట్రంలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చర్యలు తీసుకోకుండా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను సమీక్షించేందుకు కేఆర్‌ఎంబీ చైర్మన్‌ పరమేశం సిద్ధం కావడంపై ఆంధ్రప్రదేశ్‌ మండిపడింది. ఆయన తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని జలశక్తి శాఖకులేఖ రాసింది. మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న పరమేశాన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించడం మాట అటుంచి.. ఏకంగా బోర్డుకే సర్వాధికారాలు కట్టబెట్టేందుకు  కేంద్రం సమాయత్తమైంది.


రెండు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు, అనుమతుల్లేని ప్రాజెక్టులపై కృష్ణా బోర్డు అనుసరిస్తున్న వైఖరిపై తెలుగు రాష్ట్రాల ఆగ్రహం తదితరాల నేపథ్యంలో ఆయా బోర్డులకు ఆధికారాలు ఉండాల్సిందేనన్న అభిప్రాయానికి జలశక్తి శాఖ వచ్చింది. విభచన చట్టం అమలు బాధ్యత కేంద్ర హోం శాఖదే. జలశక్తి శాఖ సూచన ప్రకారం రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులూ గోదావరి, కృష్ణా బోర్డుల పరిధిలోనే ఉండేలా.. నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అంగీకరించారు. జలశక్తి శాఖ పంపిన నోట్‌పై ఆయన కొద్ది రోజుల కింద సంతకం కూడా చేశారు. త్వరలోనే సదరు నోటిఫికేషన్‌ జారీకానుంది. సర్వస్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించే నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తెలుగు రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులు వెళ్లడం హర్షించదగిన పరిణామమేనని నిపుణులు అంటున్నారు. అయితే నోటిఫికేషన్‌ వెలువడేలోగా బోర్డుల పరిధిలోకి ఏయే ప్రాజెక్టులు వస్తాయి.. అనుమతుల్లేని ప్రాజెక్టులుగా వేటిని గుర్తించారనే అంశాలపై జలశక్తి శాఖ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ నోటిఫికేషన్‌ ముసాయిదాను కేంద్రం ముందుగా ప్రకటించకపోతే.. దానిని బహిర్గతం చేయాల్సిందేనని రాష్ట్రప్రభుత్వం డిమాండ్‌ చేయాలని సూచిస్తున్నారు.


శ్రీశైలం జలాశయం పరిధిలో తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి (90 టీఎంసీలు), డిండి (30 టీఎంసీలు) పథకాలు అక్రమమని విభజన చట్టంలోనే పేర్కొన్నారు. గత ఏడాది జనవరి 21వ తేదీన జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగిన రెండు రాష్ట్రాల సీఎ్‌సల సమావేశంలో కూడా.. పరిపాలనా అనుమతులు ఇచ్చినంత మాత్రాన కేంద్ర జలసంఘం ఆమోదం పొందినట్లు కాదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు కేఆర్‌ఎంబీ ద్వారా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించాల్సిందేనని తేల్చిచెప్పారు. వీటికి డీపీఆర్‌లు సమర్పించాల్సిందేనని ఆ తర్వాత జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఆదేశించింది. అయితే కృష్ణా బోర్డు పరిధిలోకి కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను తీసుకొస్తూ జారీ చేయనున్న నోటిఫికేషన్‌లో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలనూ తీసుకురానున్నారని రాష్ట్ర నిపుణులు అంటున్నారు. ఇదే జరిగితే.. ఈ రెండు అక్రమ పథకాల ద్వారా తెలంగాణకు అధికారికంగా 120 టీఎంసీలు కట్టబెట్టినట్లేనని హెచ్చరిస్తున్నారు.


కేటాయింపులకు సరిపడా..

కృష్ణా ట్రైబ్యునల్‌ తెలుగు రాష్ట్రాలకు 811 టీఎంసీలు కేటాయించింది. ఇందులో మన రాష్ట్రానికి 512, తెలంగాణకు 289 టీఎంసీలు ఉన్నాయి. ఈ కేటాయింపులకు సరిపడా తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించేసింది. ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలకు లోబడి ప్రాజెక్టుల నిర్మాణం చేస్తోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణకు అదనంగా 120 టీఎంసీల జలాలు దక్కేలా పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తే ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులు మాత్రమే బోర్డు పరిధిలోకి వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్‌ ప్రభుత్వానికి సూచిస్తున్నారు.


అలా కాకుండా.. తెలంగాణ సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను కూడా చేర్చితే.. రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు అధికారికంగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఎదురవుతుందని.. ఇదే జరిగితే ఆ ప్రాంతానికి సాగు, తాగు నీటి కటకట తప్పదని.. మున్ముందు రాయలసీమ ఎడారి అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2021-04-12T08:41:20+05:30 IST