ఆ 300 వాహనాల సంగతేమిటి?

ABN , First Publish Date - 2022-01-24T06:33:46+05:30 IST

వాహనాలు లేకుండా అక్రమ రిజిస్ర్టేషన్లు జరిపిన వ్యవహారంలో రవాణా శాఖ తన తప్పును కప్పి పుచ్చుకుంటోందన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి.

ఆ 300 వాహనాల సంగతేమిటి?

ఇతర రాష్ట్రాల్లోనూ అక్రమ రిజిస్ర్టేషన్లు 

వాహన్‌ సైట్‌లోకి మన రాష్ట్రంలోనే అప్‌లోడింగ్‌ 

ఎన్వోసీలు కూడా ఇక్కడి నుంచే జారీ 

వీటిని ఎందుకు దాచి పెడుతున్నారు? 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వాహనాలు లేకుండా అక్రమ రిజిస్ర్టేషన్లు జరిపిన వ్యవహారంలో రవాణా శాఖ తన తప్పును కప్పి పుచ్చుకుంటోందన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. జిల్లాకు  చెందిన మాఫియా జరిపిన అక్రమ రిజిస్ర్టేషన్ల స్కామ్‌లో తమ పరిధిలో చోటు చేసుకున్న అంశాలను దాస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపురి రాష్ట్రాల నుంచి సృష్టించిన వాహనాల అక్రమ రిజిస్ర్టేషన్ల లెక్కనే తేల్చారు. మొత్తం 109 అక్రమ రిజిస్ర్టేషన్లు జరిగినట్టు గుర్తించారు. ఇంకా 300 వాహనాల వరకు అక్రమ రిజిస్ర్టేషన్లు జరిగాయనే ఆరోపణలపై మాత్రం పెదవి విప్పటం లేదు. 


ఏపీలో సృష్టించిన 150కు పైగా వాహనాలకు తెలంగాణలోని సూర్యాపేటలో ఇదే ముఠా అక్రమ రిజిస్ర్టేషన్లు చేసినట్టు తెలుస్తోంది. వీటిపై రవాణా శాఖ విచారణ బృందాలు కానీ, ముఠాను అరెస్టు చేసిన బృందాలు కానీ ఇప్పటి వరకు దృష్టి సారించకపోవటం గమనార్హం. అలాగే విశాఖపట్నం పరిధిలో సృష్టించిన వాహనాలకు ఒడిశాలో అక్రమ రిజిస్ర్టేషన్‌ చేయించినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే మన రాష్ట్ర  వాహనాల జాబితా కూడా ‘వాహన్‌’ సైట్‌లోకి అరుణాచల్‌ప్రదేశ్‌ మాదిరిగానే అప్‌లోడ్‌ అయినట్టు సమాచారం. వాహన్‌ వెబ్‌సైట్‌లోకి లేని అప్‌లోడ్‌ చేయటంతో పాటు ఆ వాహనాలకు సంబంధించి ఎన్వోసీలు కూడా ఇక్కడి నుంచే జారీ చేసినట్టు, వీటి ఆధారంగా తెలంగాణ, ఒడిశాల్లో అక్రమ రిజిస్ర్టేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ పరిధిలో జరిగిన వాటిని వెలికి తీయకుండా, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన వాటినే పరిగణనలోకి తీసుకోవటం విమర్శలకు తావిస్తోంది. ఏపీలో అక్రమాలపై దృష్టి సారిస్తే రవాణాశాఖలో అనేక మంది అధికారుల పేర్లు బయటకు వస్తాయనే భయంతోనే బహిర్గతపరచటం లేదని తెలుస్తోంది. ఏలూరు డీటీసీ సిరి ఆనంద్‌తో ప్రాథమిక విచారణ చేయించామంటున్నారు. సమగ్ర విచారణ నడుస్తోందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ 300 అక్రమ రిజిస్ర్టేషన్లపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2022-01-24T06:33:46+05:30 IST