AP High Court పై జస్టిస్ చంద్రు మరోసారి వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2021-12-20T08:39:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుపైనా, రాజధాని అమరావతిపైనా విమర్శలు గుప్పించిన...

AP High Court పై జస్టిస్ చంద్రు మరోసారి వ్యాఖ్యలు..

  • నేను ఎవరి పక్షమూ కాదు!
  • సమన్యాయం చేయాలని మాత్రమే అన్నాను
  • వివాదాస్పద వ్యాఖ్యలపై జస్టిస్‌ చంద్రు వివరణ
  • ‘జైభీమ్‌’లో హీరో జస్టిస్‌ మిశ్రాయే అని వెల్లడి
  •  నాడు సంచలన తీర్పులు ఇచ్చింది ఆయనే


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుపైనా, రాజధాని అమరావతిపైనా విమర్శలు గుప్పించిన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘నేను ఎవరి పక్షమూ కాదు’ అని తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘విధ్వంసమవుతున్న ప్రజాస్వామ్య పునాదులు - పరిరక్షణ మార్గాలు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఇటీవల ఏపీ హైకోర్టుపై ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగా... తాను చంద్రబాబు పక్షమో, జగన్మోహన్‌రెడ్డి పక్షమో కాదని తెలిపారు. ‘రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారితోపాటు మిగతా వారందరి అభిప్రాయాలనూ విని, సమన్యాయం అందించేందుకు ప్రయత్నించాలని మాత్రమే నేను చెప్పాను’ అని తెలిపారు. ఈ విషయంపై ఇంతకుమించి మాట్లాడేందుకు జస్టిస్‌ చంద్రు ఆసక్తి చూపలేదు. ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ‘‘న్యాయవ్యవస్థ ప్రభుత్వాన్ని కార్నర్‌ చేస్తోంది. హైకోర్టు టార్గెట్‌ చేయడంతో ప్రభుత్వం భయపడుతోంది. ఆంధ్రాలో న్యాయ వ్యవస్థ మరో మార్గంలో ప్రయాణిస్తోంది’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను దూషించిన కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్నీ తప్పుపట్టారు.


కేసీఆర్‌ తీరు సరికాదు

ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యవహరించిన తీరు సరైందికాదని జస్టిస్‌ చంద్రు అన్నారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మికులను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బెదిరించడం అప్రజాస్వామికమన్నారు. అలాంటి వ్యవహార శైలి గల వ్యక్తుల అధికారం ఎక్కువ కాలం నిలవదని వ్యాఖ్యానించారు. తమిళనాడులో సమ్మె చేసిన రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను నాటి ముఖ్యమంత్రి జయలలిత సస్పెండ్‌ చేసిన ఉదంతంతో కేసీఆర్‌ చర్యను పోల్చారు. అనేక తెగలు ఇప్పటికీ రాజ్యాంగ హక్కులకు దూరంగా ఉన్నాయని, ‘జై భీం’ సినిమా ద్వారా ఈ విషయం చాలా మందికి తెలిసిందన్నారు. ఆ సినిమా తనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టడంతోపాటు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఆహ్వానాలు వస్తున్నాయని తెలిపారు. నిజానికి ‘జై భీం’ సినిమా కథకు హీరోను తాను కాదని, ఆనాటి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా సంచలనాత్మకమైన తీర్పును వెలువరించిన జస్టిస్‌ మిశ్రాయే అసలు కథానాయకుడని అన్నారు. ‘జై భీం’ సినిమాలో పోలీసుల టార్చర్‌ను కేవలం పది శాతం మాత్రమే చూపించారని పేర్కొన్నారు. దేశంలోని సినిమా సెన్సార్‌ బోర్డులన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ వందిమాగధులతో నిండాయని ఆరోపించారు. ఉన్నత న్యాయస్థానాలు సైతం కొన్నిసందర్భాల్లో ఆధిపత్య వర్గాలవైపు మొగ్గుచూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శనివారం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో, జిల్లా కోర్టు న్యాయమూర్తుల సంఘం ఆధ్వర్యంలో తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన సమావేశాలను పోలీసులు చివరి నిమిషంలో రద్దు చేశారని జస్టిస్‌ చంద్రు తెలిపారు.

Updated Date - 2021-12-20T08:39:44+05:30 IST