ఆ అమరీందర్‌ను నేను కాదయ్యా.. వదిలేయండి ప్లీజ్!

ABN , First Publish Date - 2021-09-30T22:22:57+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో

ఆ అమరీందర్‌ను నేను కాదయ్యా.. వదిలేయండి ప్లీజ్!

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో కల్లోలం రేగింది. పంజాబ్ పీసీపీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా తన పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందో తెలియక అందరూ అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్‌లో తనకు ఎదురైన అవమానాలు చాలని, ఇక ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని తేల్చేసిన అమరీందర్.. బీజేపీలో కూడా చేరబోనని స్పష్టం చేశారు. 


అమరీందర్ రాజీనామా తర్వాత పంజాబ్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలపై మీడియా, అభిమానులు, జర్నలిస్టులు అమరీందర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఆ ట్వీట్లు కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు కాకుండా ఇండియా ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్ అమరీందర్‌ సింగ్‌కు చేరుతున్నాయి.


వెల్లువలా వచ్చి పడుతున్న ట్వీట్లపై స్పందించిన అమరీందర్.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ను తాను కాదని, తాను ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్‌నని. తనను వదిలెయ్యమని వేడుకుంటూ ట్వీట్ చేశాడు. తనను ట్యాగ్ చేయడం మానేయాలని కోరాడు.


అమరీందర్ ట్వీట్‌ను షేర్ చేసిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్.. సానుభూతి తెలిపారు. ఆటలో మరింత రాణించాలని ఆకాంక్షించారు. కాగా, కాంగ్రెస్ నేత ట్విట్టర్ ఖాతా ముందు కెప్టెన్ అని ఉంటుంది. అది లేకుండా అమరీందర్‌సింగ్ అని ట్యాగ్ చేస్తుండడంతోనే ఆ ట్వీట్లన్నీ ఫుట్‌బాల్ గోల్‌కీపర్‌కు చేరుతున్నాయి.



Updated Date - 2021-09-30T22:22:57+05:30 IST