2021లో భారత వృద్ధి 11.5%

ABN , First Publish Date - 2021-01-27T07:44:04+05:30 IST

ఈ ఏడాది (2021) భారత ఆర్థిక వ్యవస్థ ఆకట్టుకోగల స్థాయిలో 11.5 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని, కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో ప్రపంచంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసే

2021లో భారత వృద్ధి 11.5%

ఐఎంఎఫ్‌ అంచనా


వాషింగ్టన్‌: ఈ ఏడాది (2021) భారత ఆర్థిక వ్యవస్థ ఆకట్టుకోగల స్థాయిలో 11.5 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని, కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో ప్రపంచంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 2022 సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.8 శాతం ఉండవచ్చని కూడా ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక స్థితిపై తాజా అంచనాలతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తెలుపుతూ 2020లో 8 శాతం ప్రతికూల వృద్ధి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పునరుజ్జీవం సాధిస్తుందని వివరించింది. చైనా (8.1 శాతం), స్పెయిన్‌ (5.9 శాతం), ఫ్రాన్స్‌ 5.5 శాతం) వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలుస్తాయని పేర్కొంది. ఈ అంచనాలను బట్టి ప్రపంచంలో వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న ప్రధాన వర్థమాన ఆర్థిక వ్యవస్థ గుర్తింపును కూడా భారత్‌ దక్కించుకోగలుగుతుందని ఆ నివేదికలో తెలిపారు. 


ఐరాస అంచనా -9.6 శాతం: ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ మైనస్‌ 9.6 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసి వచ్చే ఏడాది 7.3 శాతం సానుకూల వృద్ధి సాధిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2022 లో వృద్ధి రేటు మందగించి 5.6 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది. అలాగే 2022లో దక్షిణాసియా ప్రాంతీయ వృద్ధి రేటు 5.3 శాతానికి చేరవచ్చని కూడా అంచనా వేసింది. కరోనా మహమ్మారి కారణంగా అవ్యవస్థీకృత భారీగా ఉపాధి నష్టం కలిగే దేశాల్లో బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్తాన్‌ ఉంటాయని కూడా తెలిపింది.


వృద్ధి రేటు -8 శాతం : ఫిక్కీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు మైనస్‌ 8 శాతం ఉండవచ్చని ఫిక్కీ తాజా నివేదికలో అంచనా వేసింది. జనవరిలో పలువురు ఆర్థికవేత్తలతో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి రేటు 3.5 శాతం ఉండవచ్చని కూడా ఆర్థికవేత్తలు అంచనాలు ప్రకటించారు. వ్యవసాయ రంగం కొవిడ్‌-19 ప్రతికూలతలను తట్టుకుని నిలవగలిగిందని, రబీలో అధిక విస్తీర్ణంలో పంటల పెంపు, చక్కని రుతుపవనాలు, రిజర్వాయర్లలో అధికంగా నీటి నిల్వ ఈ రంగానికి కలిసివచ్చినట్టు తెలిపింది. కాగా కరోనా కారణం గా భారీగా దెబ్బతిన్న పారిశ్రామిక రంగం మైనస్‌ 10 శాతం, సేవల రం గం మైనస్‌ 9.2 శాతం ప్రతికూల వృద్ధిని సాధిస్తాయని అంచనా వేసింది. 

Updated Date - 2021-01-27T07:44:04+05:30 IST