వలస కూలీ పస్తులు

ABN , First Publish Date - 2021-05-10T05:59:31+05:30 IST

ఉన్న ఊరిలో పనులు లేక పొట్ట చేతబట్టుకుని వలస వెళ్లారు.

వలస కూలీ పస్తులు
ఆలూరు మండలం హులేబీడు గ్రామంలో పనులు లేక కూర్చున్న వలస కూలీలు

  1. కొవిడ్‌ భయంతో స్వగ్రామాలకు చేరిక
  2. అక్కడ ఉండలేక.. ఇక్కడ పనులు లేక..
  3. నెల రోజులుగా ఇంటి పట్టునే కూలీలు
  4. ఉపాధి పనులు చూపని అధికారులు
  5. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల వినతి


ఆదోని/కోసిగి, మే 9: ఉన్న ఊరిలో పనులు లేక పొట్ట చేతబట్టుకుని వలస వెళ్లారు. ఇంతలో కొవిడ్‌ ప్రబలడంతో లాక్‌డౌన్‌ విధిస్తే ఇబ్బందులు తప్పవని తిరిగి వచ్చేశారు. కొన్ని రోజులు వేచి చూద్దాం.. అని అక్కడే ఉండిపోయినవారికీ కష్టాలు తప్పలేదు. మినీ లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో పనులు దొరకలేదు. దీంతో ఉసూరుమంటూ స్వస్థలాలకు తిరిగొచ్చారు. ఇక్కడ వారికి ఏ పనీ దొరకడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం మినహా.. ఏ ఆసరా లేదు. పశ్చిమ ప్రాంతంలోని వేలాది మంది రైతులు, రైతు కూలీల దుస్థితి ఇది. ఖరీఫ్‌ సీజన్‌ ముగియగానే వీరు సుగ్గిబాట పడతారు. గుంటూరు, హైదరాబాద్‌, బెంగళూరు.. ఇలా దూర ప్రాంతాలకు వెళ్లి దొరికిన పని చేస్తారు. మళ్లీ వానలు మొదలయ్యాకగానీ సొంతూరికి తిరిగిరారు. ఇక్కడే ఉంటే పస్తులు తప్పవని, అందుకే వెళ్లక తప్పదని అంటారు. దశాబ్దాలుగా ఈ సమస్య అలాగే ఉండిపోయింది. దూరప్రాంతాలకు వెళ్లినా.. ఓ పూట తినేందుకు సరిపడా కూలిపనులైనా దొరికేవి. ఇప్పుడు కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ కారణంగా ఆ ఆసరా కూడా లేకుండా పోయిందని కంటతడి పెడుతున్నారు. గత ఏడాది అనూహ్యంగా లాక్‌డౌన్‌ విధించడంతో స్వస్థలాలకు చేరలేక, అక్కడే పస్తులు ఉండలేక కూలీలు నరకం అనుభవించారు. కొందరు సాహరించి, పిల్లా పాపలతో మూటాముల్లె మోసుకుని వందల కి.మీ. నడిచి వచ్చారు.


ఏ పనులూ లేక..
పశ్చిమ ప్రాంతంలోని గ్రామాల్లో కూలీలకు అధికారులు శాశ్వత ఉపాధి కల్పించడం లేదు. జాబ్‌ కార్డులు ఉన్నవారికి పనులు చూపించినా, రోజుకు రూ.50 నుంచి రూ.100 మాత్రమే కూలీ వస్తోందని, ఆ డబ్బులు కూడా నెలల తరబడి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం ఆదోని డివిజన్‌లోని 17 మండలాల నుంచి వేలాది మంది వలస వెళ్లారు. కానీ మినీ లాక్‌డౌన్‌ అమలులోకి రాగానే వలస నుంచి తిరిగి వచ్చారు. ఆదోని మండలంలోని గనేకల్లు, కపటి, ఆలూరు మండలంలోని హులేబీడు గ్రామాల ఉపాధి కూలీలు గోడు వెల్లబోసుకుంటున్నారు.  పనులు దొరకక పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కపటి గ్రామంలో దాదాపు 2 వేల జనాభా ఉంది. ఈ ఊరి జనంలో 500 మంది  కూలీలు వలస వెళతారు. తమతోపాటు చిన్నారులను తీసుకువెళతారు. ప్రస్తుత పరిస్థితుల దృష్టా ముందు జాగ్రత్తగా గ్రామాలకు చేరుకున్నారు.

ఇల్లు లేదు.. రేషన్‌ కార్డు లేదు

మాకు 30 ఏళ్లుగా ఉండడానికి ఇల్లు లేదు. రేషన్‌ కార్డు కూడా మంజూరు కాలేదు. కూలి పనులకు వెళితేనే కుటుంబం గడుస్తుంది. చాలా ఏళ్ల నుంచి బెంగళూరులో గౌండా పనికి  వెళ్లి ఉపాధి పొందుతున్నాం. కరోనాతో అక్కడ పరిస్థితులు మారిపోయాయి. లాక్‌డౌన్‌ విధించడంతో చేసేదిలేక తిరిగి వచ్చాము. ఇక్కడ కూడా పనులు లేవు. సొంత పొలం లేదు. కూలి పనులు దొరకడం లేదు. ముగ్గురు పిల్లలతో ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి. మా గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
- వెంకటేశ్‌, పద్మ దంపతులు, గణేకల్లు


ఎలాంటి సాయం లేదు..
ప్రతి సంవత్సరం బతకడానికి ముంబయికి వెళ్లేవాళ్లం. కరోనా అధికంగా ఉందని ఈ దఫా వెళ్లలేదు. పూట గడవకపోవడంతో గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామానికి వెళ్లాం. అక్కడ కూడా పనులు దొరకడం లేదు. చేసేది లేక తిరిగివచ్చాం. జాబ్‌కార్డు కావాలని  అధికారులకు విన్నవించాం. ఇంత వరకు ఇవ్వలేదు. మాకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తే తప్ప బతకలేం.
- లక్ష్మి, ఎల్లమ్మ, కుటుంబ సభ్యులు, గణేకల్లు

పనులున్నా వచ్చేశాం..

ఉపాధి పనులకు వెళితే గిట్టుబాటు కూలి పడడం లేదు. అందుకే భార్య, ఇద్దరు బిడ్డలతో కలిసి ఒంగోలు జిల్లా ఇంకోలు మండలం ఇడుపులపాడు గ్రామానికి మిరప కోత పనులకు వలస వెళ్లాం. రోజుకు రూ.600 కూలీ పడేది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ఉంటుందని  సొంత ఊరికి వచ్చాం. గతంలో చేసిన అప్పులకు రూ.35 వేలు జమ చేశాము. మిగతాది సంసార ఖర్చులకు ఉంచుకున్నాం. ఉన్న చోట ఉపాధి పనులు లేవు. కరోనా తగ్గితే మళ్లీ వలస వెళతాం. బతకాలంటే తప్పదు.
- ఉరుకుందు, వలస కూలీ, కపటి

ఉపాధి పనులు పెట్టాలి..

ఉన్న చోటే ఉపాధి పనులు కల్పిస్తే ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒంగోలు జిల్లా సంతనూతలపాడు గ్రామానికి మిరపకోత పనులకు కుటుంబ సభ్యులతో వెళ్లాం. కరోనా కారణంగా అక్కడి రైతులు మమ్మల్ని సొంత ఊరికి వెళ్లిపోమని చెప్పారు. దీంతో తిరిగి వచ్చేశాము. ఇక్కడ ఉపాధి పనులు లేవు. పనులు కల్పిస్తే కడుపు నింపుకుంటాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
- జయరాముడు, వలస కూలీ, కపటి

ఇబ్బందిగా ఉంది
బతుకుదెరువు కోసం గుంటూరుకు వెళ్లాం. లాక్‌డౌన్‌ విధిస్తారేమోనని భయపడి సొంతూరికి వచ్చేశాం. ఉన్న డబ్బంతా అయిపోయింది. పూట గడవడం కష్టంగా మారింది. చేసుకునేందుకు పనులు లేవు. కరోనా రాకుంటే గుంటూరులో పని చేసుకునేటోళ్లం.
- తిక్కన్న, హులేబీడు


రేషన్‌ బియ్యంతో కడుపు నిండుతుందా..?
కోసిగి పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన పెండేకల్లు గోవిందు, ఈరమ్మ, శివమ్మ కూలీలు. పిల్లలతో కలిసి గుంటూరుకు మిర్చి కోతకు ఏటా వలస వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా మూడు నెలల పాటు వెళ్లారు. అక్కడ రోజుకు రూ.400 సంపాదించేవారు. ఆ మొత్తంతో కుటుంబం గడిచేది. కరోనా సెకండ్‌ వేవ్‌తో లాక్‌డౌన్‌ విధిస్తారని భావించి నెల రోజుల క్రితమే సొంతూరికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఏ పనులూ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ‘ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యంతో కడుపు నిండదు కదా..? రేషన్‌ షాపుల్లో గతంలో మాదిరి 9 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా ఇస్తే.. మాలాంటి వలస కూలీలకు పూట గడుస్తుంది. లేదంటే కూలి పనులైనా చూపించి ఉపాధి కల్పించాలి’ అని ముగ్గురు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

 



Updated Date - 2021-05-10T05:59:31+05:30 IST