రియల్టీకి ప్రవాసుల దన్ను!

ABN , First Publish Date - 2020-09-26T07:49:31+05:30 IST

కొవిడ్‌ కష్టాల నుంచి రియల్టీ రంగం క్రమంగా కోలుకుంటోంది. ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) పెట్టుబడులూ ఇందుకు దోహదం చేస్తున్నాయి...

రియల్టీకి ప్రవాసుల దన్ను!

  • కొనుగోళ్లకు సై


కొవిడ్‌ కష్టాల నుంచి రియల్టీ రంగం క్రమంగా కోలుకుంటోంది. ప్రభుత్వ విధానాలతో పాటు వడ్డీ రేట్లు తగ్గడం ఇందుకు కలిసొస్తోంది. ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) పెట్టుబడులూ ఇందుకు దోహదం చేస్తున్నాయి. అమెరికా, యూకే, సింగపూర్‌, యూఏఈ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు నివాస గృహాలతో పాటు వాణిజ్య స్థిరాస్తి రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. కొంతమంది ఎన్‌ఆర్‌ఐలైతే గిడ్డంగుల రంగంలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. 


ఎన్‌ఆర్‌ఐలు స్వదేశంలో స్థిరాస్తులు కొనడం కొత్తేమీ కాదు. గతంలోనూ వీరి పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ఈ రంగంలోనే ఉండేవి. కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. ఉన్న దేశాల నుంచి ఎప్పుడు మూట ముల్లె సర్దుకోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో గత కొద్ది నెలల నుంచి ఎన్‌ఆర్‌ఐల్లో చాలా మంది స్వదేశంలోని రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో పెట్టుబడులు పెంచారు. ఎక్కువ మంది లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు లేదా వాణిజ్య స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకం రేటు బక్కచిక్కడం, వడ్డీ రేట్లు దిగి రావడం ఇందుకు మరింత దోహదం చేస్తోంది.


మారిన నిబంధనలతో ఊతం

రియల్టీలో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడి నిబంధనల్లో వచ్చిన మార్పులూ ఇందుకు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐలు లేదా భారత సంతతి ప్రజలు భారత్‌లో ఎన్ని స్థిరాస్తులైనా కలిగి ఉండొచ్చు. వీటిపై వచ్చే అద్దె ఆదాయాన్నీ ఎలాంటి అనుమతులు లేకుండా తాముంటు న్న దేశానికి తీసుకుపోవచ్చు. ఈ ఆస్తుల కొనుగోలు సమయంలో ఎలాంటి ఆదాయ పన్ను లేకపోవడం కూడా కలిసి వస్తోంది. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి స్వదేశంలో ఆస్తుల కొనుగోలు కోసం ఎన్‌ఆర్‌ఐల నుంచి విచారణలు రెండింతలకుపైగా పెరిగాయని బిల్డర్లు చెబుతున్నారు. దీ నికి తగ్గట్టే కొంత మంది బిల్డర్లు ఎన్‌ఆర్‌ఐలను ఆకట్టుకునేలా ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. 35-45 ఏళ్ల మధ్య వయస్కులైన ఎన్‌ఆర్‌ఐలు తమ తల్లిదండ్రుల కోసం, 55 ఏళ్ల పైబడిన ఎన్‌ఆర్‌ఐలు.. రిటైర్‌మెంట్‌ జీవితం కోసం విల్లాలు, లగ్జరీ హౌస్‌లు కొంటున్నారని వారంటున్నారు. 


దక్షిణాదిపైనే మక్కువ

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ పరిసర ప్రాంతాల్లోని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. కొవిడ్‌ తర్వాత ఎన్‌ఆర్‌ఐలకు హైదరాబాద్‌ మార్కెట్‌పై మరింత ఆసక్తి పెరిగినట్టు బిల్డర్లు చెబుతున్నారు. బెంగళూరు, చెన్నై కోచిల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నగరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగాల్లో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సదుపాయాలు, మౌలిక వసతులూ ఇందు కు దోహదం చేస్తున్నాయి. మరోవైపు బిల్డర్ల ఆఫర్లు కూడా కొనుగోలుదారుల్ని ఊరిస్తున్నాయి.  

- ఆంధ్రజ్యోతి (బిజినెస్‌ డెస్క్‌)

Updated Date - 2020-09-26T07:49:31+05:30 IST