కరోనా వైరస్‌తో యాంటీ బాడీస్ ఎలా ఫైట్ చేస్తున్నాయి?

ABN , First Publish Date - 2021-05-07T22:14:03+05:30 IST

ఎవరైనా `సార్స్-కోవ్-2` వైరస్ బారిన పడితే వెంటనే వారి రోగనిరోధక శక్తి ప్రతిస్పందించి యాంటీ బాడీస్‌ను విడుదల చేస్తుంది

కరోనా వైరస్‌తో యాంటీ బాడీస్ ఎలా ఫైట్ చేస్తున్నాయి?

ఎవరైనా `సార్స్-కోవ్-2` వైరస్ బారిన పడితే వెంటనే వారి రోగనిరోధక శక్తి ప్రతిస్పందించి యాంటీ బాడీస్‌ను విడుదల చేస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌ను యాంటీ బాడీస్ ఎలా తటస్థీకరిస్తాయనే (న్యూట్రలైజ్) విషయాన్ని వివరిస్తూ ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు ఓ ఫొటోను తాజాగా విడుదల చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న నలుగురు వ్యక్తుల ప్లాస్మా శాంపిల్స్‌ను పరిశీలించి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. 


కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ అయిన రెసిప్టార్-బైండింగ్ డొమైన్ (ఆర్‌బీడీ)ని లక్ష్యంగా చేసుకుని యాంటీ బాడీస్ దాడి చేస్తాయని గత పరిశోధనలు తేల్చాయి. శరీరంలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత ఈ స్పైక్ ప్రోటీన్ మానవ కణాలకు నేరుగా అతుక్కుని ఇన్ఫెక్షన్ కలగచేస్తుంది. మానవ శరీరంలోని యాంటీ బాడీలు ఈ ఆర్‌బీడీలనే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తాయని మొదటి దశ ప్రయోగాలు నిరూపించాయి. అయితే తాజా పరిశోధన మరో విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.


రక్తంలోని ప్లాస్మాలో ఉండే 84 శాతం యాంటీ బాడీస్ ఆర్‌బీడీ వెలుపల ఉండే వైరల్ స్పైక్ ప్రోటీన్‌ను టార్గెట్ చేస్తున్నాయని తేలింది. `ఆర్‌బీడీలను మాత్రమే కాకుండా మొత్తం స్పైక్‌ను యాంటీ బాడీస్ టార్గెట్ చేసి దానిని న్యూట్రలైజ్ చేస్తున్నాయని మేం కొనుగొన్నాం. వైరల్ స్పైక్ ప్రోటీన్‌లో ఉండే ఎన్-టెర్మినల్ డొమైన్ (ఎన్‌టీడీ)ను కూడా యాంటీ బాడీస్ టార్గెట్ చేస్తున్నాయి. వైరస్‌లో మ్యుటేషన్‌కు ఈ ఎన్‌టీడీ కూడా ఓ కారణమ`ని పరిశోధకుడు గ్రెగ్ ఇప్పోలిటో తెలిపారు. 

Updated Date - 2021-05-07T22:14:03+05:30 IST