Abn logo
Apr 3 2020 @ 00:36AM

ప్రళయవేళ నవజీవన ప్రభాతం

విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఆన్‌లైన్‌ కోర్సులను పూర్తి చేయటమే. ఉదాహరణకు స్వయం ఆన్‌లైన్, యూజీ పీజీ మూక్స్, ఈపీజీ పాఠశాల, ఈ కంటెంట్‌ కోర్స్‌వేర్‌ ఇన్‌ యూజీ సబ్జెక్ట్, స్వయంప్రభ వంటి వాటిలో వివిధ రకాల కోర్సులతోపాటు పోటీ పరీక్షల కోసం ఉపయోగపడే ఎన్నో పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. ‘మూక్స్‌’ ద్వారా ఇంట్లోనే కూర్చుని ప్రఖ్యాత యూనివర్సిటీ ప్రొఫెసర్ల పాఠాలు వినవచ్చు.


కరోనా కట్టడి కోసం విధించిన కర్ఫ్యూలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా స్పందించడం అభినందనీయం. కొవిడ్‌–19 వైరస్‌ బారినపడిన వారికి సేవలందిస్తున్న అధికారులకు, డాక్టర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు తగిన సమాచారం తెలియపరుస్తున్న మీడియా ప్రతినిధులకు కృతజ్ఞాభివందనాలు.


మానవాళికి ఇలా ఒక ప్రత్యేక విషమ, భయంకరమైన పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒక నిమిషం ఆలస్యమైనా ప్రపంచమే ఆగిపోతుందని భావించే వాళ్లందరికీ ఇది ఒక విపత్కర పరిస్థితి. ఇలాంటి కఠిన సమయంలోనే ఆలోచన విధానాలలో గొప్పమార్పులు వస్తాయి. సాధారణంగా అధికారంలో ఉన్నవాళ్లకు; మా దగ్గర ఎంతో డబ్బు ఉంది, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారులకు; మాకు ఎప్పటికీ ఏమీ కాదనే అమితమైన విశ్వాసం ఉన్నవాళ్లందరికీ కరోనా వైరస్‌ కఠిన సత్యాలను చూపిస్తుంది. వారు వీరు అని తేడా లేకుండా అందరికీ అదే బాధ, అదే అనిశ్చితి, అదే వైద్యం! బ్రిటిష్‌ రాజ కుటుంబం, ప్రధాని, మలేసియా రాజ కుటుంబాల వారు కూడా ఈ వైరస్‌కు అతీతులు కాలేకపోయారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్, ఆదేశ ఆరోగ్య మంత్రికి కూడా కరోన్‌ పాజిటివ్‌ అని తేలింది. దాంతో వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.


ఇటువంటి పరిస్థితిలో ప్రజలందరూ ఎవరికి వారు ఇంట్లోనే ఉంటూ ఆత్మావలోకనం చేసుకోవాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ 21 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉంటూ స్వీయ నియంత్రణను పాటించాలి.


ఇదే సమయంలో మరో విషయం నిశితంగా పరిశీలించాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వైరస్‌లు తరచుగా ఎందుకు విజృంభిస్తున్నాయి? ఇంతకంటే ప్రాణాంతకమైన వైరస్‌లు భవిష్యత్తులో రావని గ్యారంటీ ఏముంది? నిజంగా వస్తే టెక్నాలజీని, అధునాతనమైన మెడిసిన్‌ను అభివృద్ధి చేసుకున్నప్పటికీ.. మున్ముందు ఎదురయ్యే ఉపద్రవాలను మానవాళి తట్టుకోగలదా? ప్రపంచంలోనే ఎంతో బలమైన డైనోసార్స్ కనుమరుగైన విధంగానే మానవాళికి కూడా ముప్పు ఉంటుందా అనే సందేహం వస్తోంది. పరిస్థితులను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెబుతూనే ఉన్నారు. మనం ప్రతి నిమిషం, ప్రతి సందర్భంలో పర్యావరణానికి హాని కలిగిస్తూ, జీవ వైవిధ్యాన్ని అవహేళన చేస్తున్నాం. ప్రస్తుతం సమాజంలో ఒకే చోట ఎక్కువ మంది నివాసముండటం, ఒకే చోట ఎక్కువ జంతువులను పెంచటం, పరిశ్రమలను నెలకొల్పడం వంటివి అడ్డూఆపూ లేకుండా చేసేస్తున్నాం. వాటి నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో ఎంతటి కాలుష్యం వెలువడుతుందో... ఇలా విచక్షణా రహితంగా ఈ భూమి భరించలేనంతగా అపహాస్యం చేస్తే... ఏదో ఒకరోజు జీవవైవిధ్యం దెబ్బతింటుందని, మానవాళి మీద ఎప్పుడో, ఏదో రూపంలో విరుచుకు పడుతుందని వారు హెచ్చరిస్తూనే ఉన్నారు.


రోజురోజుకూ పెరుగుతోన్న టెక్నాలజీని వినియోగించుకుంటూ విర్రవీగుతున్న మానవునికి ప్రకృతి ఈ కరోనా వైరస్‌ రూపంలో ఉగ్రరూపాన్ని చూపించిందనే భావించాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు కళ్లు తెరచి పర్యావరణ సమతుల్యతను అభివృద్ధి చెందిస్తేనే ఉపద్రవాల్ని కొంతవరకైనా నివారించగలుగుతాము. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలకు విద్య, ఆరోగ్యం, రవాణా, ఇతర ప్రాథమిక సౌకర్యాలను కలుగజేసి సమూహాలుగా జీవించే విధంగా చేయడం, పాడి పరిశ్రమను అభివృద్ధిపరచడానికి వీలైనన్ని పథకాలను ప్రవేశ పెట్టడం, రైతన్నలను సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించడం, అడవులను పెంచడం, కాలుష్యం తగ్గించడం వంటివి చేస్తేనే పర్యావరణ సమతుల్యత పెరిగి, జీవవైవిధ్యం పరిరక్షణ జరిగి కొంతైనా ఈ భూమి శాంతిస్తుందని నా నమ్మకం. మన హిందూ సాంప్రదాయాలను పాటించడంతోపాటు పంచభూతాలైన భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్నిని పూజించడమే కాకుండా వాటిని గౌరవిస్తూ బతికితేనే మానవాళికి మంచి మనుగడ ఉంటుందని భావిస్తున్నాను.


పైన పేర్కొన్న అంశాలన్ని దీర్ఘకాలంలో సాధించే విషయాలైతే, ఇప్పటికిప్పడు ఈ 21 రోజుల స్వీయ నిర్బంధంలో అందరూ చేయ వలసినదేమిటంటే... కరోనా గురించి తీవ్రంగా ఆలోచిస్తూ భయపడకుండా ధైర్యంగా ఉండాలి. ఇటువంటి సమయాల్లోనే సంయమనం పాటించాలి. ఈ అననుకూల పరిస్థితుల్లో కొంచెం తెలివిగా ఆలోచించినట్లయితే ఈ కఠిన పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవచ్చు.


కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లో ఉన్న రూములు, ముఖ్యంగా వంటగది, ఫ్రిజ్‌లు లాంటివి ఎలా శుభ్రం చేయాలనే విషయాలను తల్లిదండ్రులు వారి పిల్లలకు నేర్పించాలి. బట్టలు ఉతకటం, వంట పనిలో పాల్గొంటే పిల్లలకు ఎంతో కొంత అనుభవం వస్తుంది. మనకోసం నిరంతరంగా పనిచేసే వివిధ రకాల వృత్తుల (పనిమనుషులు, బట్టలు ఉతికేవాళ్లు) వారిపైన ఎంతో కొంత గౌరవభావం కలుగుతుంది.


అదే విధంగా, పిల్లలకు వాళ్ల పనులు వాళ్లే చేసుకోవడం నేర్పడమే కాకుండా మీరు చదివిన విషయాలు, జీవిత అనుభవాలు, మీరు చేస్తున్న వృత్తిలో ఉండే లాభ నష్టాలు, వ్యాపార అనుభవాలను పిల్లలకు పంచితే... వారికి మీ వ్యక్తిత్వం, మీరు కుటుంబం కోసం కష్టపడుతున్న వైనం అర్థమవుతాయి. వీటివలన వారికి మీపై గౌరవం ఏర్పడి కుటుంబంలో సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలకు మన బంధువుల గురించి తెలియజేయాలి. నేటితరం యువతకు బంధాల విలువ అసలు తెలియడం లేదు. కనిపించిన వారందరినీ ఆంటీ, అంకుల్‌ అంటూ పిలిచేస్తున్నారు. బంధాలతో పిలవడం అలవాటు చేయండి.


స్కూళ్లు, కాలేజీలు లేవు కాబట్టి విద్యార్థులకు చాలా విసుగ్గా ఉంటుంది. సామాజిక మాధ్యమాలకో, టీవీలకో అతుక్కుపోతూంటారు. వీళ్లంతా గమనించాల్సింది ఏమిటంటే... 21వ శతాబ్దంలో విద్యార్థులు ఉపాధ్యాయులపైనో, అధ్యాపకులపైనో ఆధారపడకూడదు. స్వయం శిక్షణ పొందేవారికే మంచి భవిష్యత్తు ఉంటుంది. నేటి డిజిటల్‌ యుగంలో క్షణ క్షణానికీ విషయం మారిపోవటం, కొత్త ఆవిష్కరణలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిదాన్నీ కళాశాలకు వెళ్లి నేర్చుకుంటామంటే కుదిరే పనికాదు. ఎప్పటికప్పుడు అంతర్జాలంలోకి వెళ్లి స్వయంగా నేర్చుకునేందుకు అలవాటుపడాలి. నిత్యం కళాశాల, పరీక్షలతో తీరిక లేకుండా ఉండే విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఆన్‌లైన్‌ కోర్సులను పూర్తి చేయటమే. ఆన్‌లైన్‌లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు స్వయం ఆన్‌లైన్, యూజీ పీజీ మూక్స్, ఈపీజీ పాఠశాల, ఈ కంటెంట్‌ కోర్స్‌వేర్‌ ఇన్‌ యూజీ సబ్జెక్ట్, స్వయం ప్రభ వంటి వాటిలో వివిధ రకాల కోర్సులతోపాటు పోటీ పరీక్షల కోసం ఉపయోగపడే ఎన్నో పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. మూక్స్‌ (మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌) ద్వారా ఇంట్లోనే కూర్చుని ప్రఖ్యాత యూనివర్సిటీ ప్రొఫెసర్ల పాఠాలు వినవచ్చు. మనకు నచ్చిన, భవిష్యత్తుకు ఉపయోగపడే స్వల్పకాలిక కోర్సులను ఉచితంగా పూర్తిచేయవచ్చు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ రోబోటిక్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బిగ్‌ డేటా, 5జీ టెక్నాలజీ, ఎథికల్‌ హ్యాకింగ్, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్, డేటా అనలిటిక్స్, బ్లాక్‌ చెయిన్, సైబర్‌ సెక్యూరిటీ, ఏఆర్, వీఆర్‌ రియాలిటీ, క్లౌడ్‌ టెక్నాలజీ, రోబోటిక్స్, డెవలపింగ్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌ ఫర్‌ మొబైల్‌ డెవలపర్స్, ఇంట్రడక్షన్‌ టు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ యూజింగ్‌ పైథాన్, ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ డేటా స్ట్రక్చర్స్, సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులపై విద్యార్థులు పట్టుసాధించగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలను తెలియజేయాలనుకుంటున్నాను. విశాఖపట్నంలోని మా స్కూలు ఉపాధ్యాయుడొకరు ఉద్యోగం చేస్తూనే సొంతంగా ప్రిపేరై ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్వ్యూకు కూడా వెళ్లివచ్చాడు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఎవరికి వారే సొంతంగా నేర్చుకోగలిగితే మనకంటూ ఒకస్థానం ఉంటుంది.


రోబోటిక్స్‌ రంగంలో 2022 సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 23 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. భారతదేశంలోనే దాదాపు 3 లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి. బ్లాక్‌ చైన్, డిజిటల్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు వచ్చే మూడేళ్లలో 5 లక్షల మందికి, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటాలో 2లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. కనిష్ఠంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వార్షిక వేతనం లభించగలదు.


అందుకని, వైరస్‌ను ప్రళయం లాగా భావించి భయపడుతూ కూచోవడం కంటే ఏదైనా ఒక పనిని చేసుకోవటం వలన మంచి జరుగుతుంది. ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఎందుకంటున్నానంటే గడిచిన ఐదారు రోజుల నుంచి మనదేశంలో వైరస్‌ వ్యాప్తి పెద్దగా పెరగటం లేదు. దానికి కారణం ప్రజలందరూ పాటిస్తున్న నియమ నిబంధనలు ఒకవైపు; మనదేశం ఎండ తీవ్రంగా ఉండే ప్రాంతం కావడమూ, భారతీయ జీవన విధానం వల్ల ఇతర దేశాల్లోలాగా మనకు విస్తృతంగా రాదని భావిస్తున్నాను.


ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన మరో అంశం ఏమిటంటే మొత్తం కర్ఫ్యూవిధించడం వలన సరకుల సరఫరా ఆగిపోతే సామాన్య ప్రజలు ఇబ్బందిపడతారు. ఇదే విధంగా సుమారు నెల రోజుల పాటు కొనసాగితే సమీప భవిష్యత్తులో కొంతమందైనా పేదవాళ్లు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. పండించే రైతులూ, వినియోగించే ప్రజలూ ఇబ్బందులు పడవచ్చు. కర్ఫ్యూ వల్ల జీవన ప్రక్రియ ఆగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. విధి ఆడుతున్న ఈ వింత నాటకంలో ప్రపంచంలోని మొత్తం జనాభాలో దాదాపు 60 శాతం మంది లాక్‌డౌన్‌ (విమానయాన సర్వీసులు, రైళ్లు, బస్సుల రద్దు, పరిశ్రమల మూసివేత) కావడంతో కాలుష్యం బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మనం గ్రహించాల్సిన వాస్తవం ఒకటి వున్నది. పర్యావరణానికి హాని కలుగజేస్తే వచ్చే ఉపద్రవాలను ఎదుర్కోలేమన్నదే ఆ వాస్తవం. ఇది ప్రకృతి హెచ్చరిక కావున మన ఆలోచనా విధానం, జీవన శైలిలో మార్పులు చేసుకుని పర్యావరణ హితంగా అడుగులు వేయడం చాలా మంచిది.


స్వీయ నిర్బంధంలో ఉంటున్న చాలా మంది ఆలోచనలలో చాలా మార్పు వచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా ఇతరులతో నిర్మొహమాటంగా తమ మనసులోని మాటను పంచుకుంటున్నారు. జీవితంలో పది మందికి సహాయం చేయాలని, డబ్బు కోసం, అధికారం కోసం కాక పదిమంది కోసం బతకాలని నిర్ణయించుకుంటున్నారు. వీటితోపాటు మానవీయ విలువలు, కుటుంబ సంబంధాల తీయదనం వంటివి.. ఎంతోమందిలో వస్తున్న అనుకోని అద్భుతమైన మార్పులు. లాక్‌డౌన్ వల్ల కలుగుతున్న ఈ సామాజిక మార్పు విస్మరించలేనిది. ఇవి ఆచరణలోకొస్తే భవిష్యత్తులో మనం కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఉండే సమాజాన్ని చూడొచ్చు. కరోనా కట్టడికి సంకల్పమే ఆయుధంగా, అప్రమత్తతే నివారణగా ముందడుగు వేయాలి. సోషల్‌ ఐసోలేషన్‌ పాటిస్తూ, ఎవరిని వారు కాపాడుకోవడంతో పాటు సమాజాన్నీ కాపాడాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత.

డాక్టర్‌ లావు రత్తయ్య (విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్)

Advertisement
Advertisement
Advertisement