Abn logo
May 17 2020 @ 05:07AM

పనులకు బ్రేక్‌

సొంత ఊళ్లకు వెళ్తున్న వలస కార్మికులు  

జిల్లాలో పలు రంగాలపై ప్రభావం

ధాన్యం కొనుగోళ్లు, రైసుమిల్లుల్లో ఇబ్బందులు

జిల్లాలో 7వేల మంది వలస కార్మికుల గుర్తింపు

స్వస్థలాలకు వెళ్లేందుకు 2,500 మంది పేర్ల నమోదు


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): లాక్‌డౌన్‌ సడలింపులతో కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వలస కార్మికులు ఇంటిబాట పడుతున్నారు. దీంతో జిల్లాలో వివిధ రంగాల అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో వలస కార్మికులు పనులు చేస్తున్నారు. ప్రధానంగా భవన నిర్మాణ రంగంతోపాటు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని వివిధ ప్యాకేజీ పనుల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇటుకబట్టీలు, రైసుమిల్లులు పనిచేస్తున్న కార్మికులు వెళ్లిపోతుండడంతో పనులు నిలిచిపోతున్నాయి.


జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల  సమయంలో బిహార్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల నుంచి హమాలీలు వస్తారు. ఈ సారి కార్మికులు రాకపోవడంతో కొనుగోళ్ల వద్ద లోడింగ్‌, అన్‌లోడింగ్‌తో పాటు రైసుమిల్లుల వద్ద  ధాన్యం దిగుమతిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఎక్కువ శాతం చిన్నతరహా పరిశ్రమలు వలసకార్మికులపై ఆధారపడి పని చేస్తున్నాయి.  లాక్‌డౌన్‌ పరిశ్రమలు నిలిచిపోవడం, సడలింపులుతో వలస కార్మికులు తరలివెళ్లడం వంటి పరిణామాలతో పరిశ్రమల మనుగడ ఇబ్బంది కరంగా మారింది. 


సొంతూళ్లకు ‘వలస’ బాట

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు 7వేల మంది వలస కార్మికులను గుర్తించారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన కొంతమంది కార్మికులు సొంత ఊర్లలో ఏదో విధంగా బతకవచ్చని కాలినడకన బయల్దేరారు. మరికొంత మంది అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 2,500 మంది ఇంతకుముందే స్వస్థలాలకు వెళ్లడానికి అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. ఆంరఽధా కార్మికులు 343 మంది, కర్ణాటక 10, బిహార్‌ 176, ఛత్తీస్‌గఢ్‌ 112, గుజరాత్‌ 12, జార్ఖండ్‌ 88, కేరళ 9, మధ్యప్రదేశ్‌ 156, మహారాష్ట్ర 285, ఒడిశా 272, రాజస్థాన్‌ 168, తమిళనాడు 48, ఉత్తరప్రదేశ్‌ 529, వెస్ట్‌బెంగాళ్‌ 87 మందితోపాటు అస్సాం, పంజాబ్‌ ప్రాంతాల కార్మికులు ఉన్నారు.  


వలస కార్మికుల ఫోన్‌.. స్పందించిన కేటీఆర్‌ 

వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు మంత్రి కేటీఆర్‌ వాహనాలు ఏర్పాటు చేశారు. ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌లోని ఇటుక బట్టీలో పని చేస్తున్న ఒడిశా కూలీలు  లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లడానికి కాలినడకన బయల్దేరారు. ముస్తాబాద్‌ నుంచి సిరిసిల్ల శివారులోని పెద్దూర్‌కు చేరుకున్నారు. స్థానిక నాయకులు  వారికి రెండు రోజులు భోజనం సౌకర్యం కల్పించారు.  స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతులు లేకపోవడం, పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఉండిపోయారు. శుక్రవారం రాత్రి ఏఐసీసీ కార్యదర్శి హన్మంతరావు వలస కార్మికులను తరలించడానికి బస్సులతో వచ్చారు. పోలీసులు అడ్డుకొని హన్మంతరావును అదుపులోకి తీసుకున్నారు.  అదే రాత్రి వలస కూలీలు మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌ చేశారు. స్పందిచిన కేటీఆర్‌ వారిని స్వస్థలాలకు పంపించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అధికారులు హుటాహుటిన ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించారు.   

Advertisement
Advertisement