సచార్ సిఫార్సులను అమలు చేయండి

ABN , First Publish Date - 2020-11-06T05:38:58+05:30 IST

ఏడుదశాబ్దాలకు పైగా దేశంలోని ఒక పెద్ద మైనారిటీ వర్గం అన్యాయానికి, వివక్షకు, అవకాశాల లేమికి గురవుతూ ఉంది...

సచార్ సిఫార్సులను అమలు చేయండి

ఏడుదశాబ్దాలకు పైగా దేశంలోని ఒక పెద్ద మైనారిటీ వర్గం అన్యాయానికి, వివక్షకు, అవకాశాల లేమికి గురవుతూ ఉంది. ఈ కాలంలో దేశం చాలా రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించింది. కాని, ముస్లిం సముదాయానికి మాత్రం స్వాతంత్ర్య ఫలాలు అందని ద్రాక్షలే. ముస్లిం జనాభాలో అరవై శాతం ఇంకా దారిద్ర్య రేఖ దిగువనే జీవనం గడుపుతున్నారు. జస్టిస్ గోపాలసింగ్ కమిషన్, జస్టిస్ రంగనాధ్ మిశ్రా కమిషన్, జస్టిస్ రాజిందర్ సచార్ కమిషన్ - ఇవన్నీ ముస్లింల సంక్షేమం కోసం నియమించినవే. కాని ఇవి సమర్పించిన ఏ ఒక్క నివేదికా, ఏ ఒక్క సిఫారసూ నేటివరకూ ఆచరణకు నోచుకోలేదు. 2005 మార్చిలో జస్టిస్ సచార్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నతస్థాయి కమీషన్ ఇరవై నెలల పాటు అనేక వ్యయప్రయాసలకోర్చి, లోతుగా అధ్యయనంచేసి, గత అరవై ఏళ్ళుగా ముస్లిం సముదాయం ఎదుర్కొంటున్న సమస్యలు, నిరంతరాయంగా వారిపట్ల కొనసాగుతున్న వివక్ష, జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కట్టింది. సామాజిక, ఆర్ధిక, విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ తదితర రంగాలన్నిటిలో ముస్లింల వెనుకబాటును స్పష్టంగా చిత్రీకరించింది. వారి సంక్షేమానికి చేపట్టవలసిన చర్యలనూ సిఫారసు చేసింది. 404 పేజీలతో సమగ్రమైన నివేదిక సమర్పించి కూడా పదిహేను సంవత్సరాలు కావస్తున్నాయి. గత నివేదికల లాగానే ఇది కూడా బుట్టదాఖలా అయింది. జనాభా ప్రాతిపదికన రాజకీయ, ఆర్ధిక, సామాజిక, పబ్లిక్, ప్రైవేట్ రంగాలన్నిటిలో ముస్లిముల ప్రాతినిధ్యానికి అవకాశాలు కల్పించాలి. ముస్లిం మైనారిటీలకు వారి వ్యక్తిగత చట్టాల పరిరక్షణ, మాతృభాషలో విద్యాబోధన, ఉర్దూభాష విస్తరణ, ప్రభుత్వకంపెనీలు, వివిధ బోర్డులు, యూనివర్శిటీల్లో సముచిత ప్రాతినిధ్యం దక్కాలి. మైనారిటీ సంస్థలకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించాలి. పంచాయితీ మొదలు పార్లమెంటు వరకు దామాషా పద్ధతిలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. జస్టిస్ సచార్ నివేదిక అమలుకు ప్రభుత్వాలతో పోరాటానికి ముస్లింలు కార్యోన్ముఖులు కావాలి. పాలక వర్గాలు స్పందించే విధంగా దేశంలోని ఇతర బలహీన వర్గాలతో పాటు, ప్రజాస్వామ్య ప్రియులు, హక్కుల నేతలు, లౌకిక వాదులు, భావ సారూప్యత కలిగిన వర్గాలు, పార్టీలు, పౌర సమాజం సహకారంతో ముస్లింలు ఉద్యమాలకు పూనుకోవాలి. అప్పుడు మాత్రమే తమ రాజ్యాంగబద్ధ హక్కుల్ని సాధించుకోగలుగుతారు. 

యండి. ఉస్మాన్ ఖాన్

Updated Date - 2020-11-06T05:38:58+05:30 IST