టీకాలపై దిగుమతి సుంకం రద్దు!

ABN , First Publish Date - 2021-04-21T09:32:11+05:30 IST

టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్న కేంద్రం.. దిగుమతి చేసుకునే టీకాలపై 10% కస్టమ్స్‌ సుంకాన్ని రద్దు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

టీకాలపై దిగుమతి సుంకం రద్దు!

  • ప్రతిపాదనను పరిశీలిస్తున్న కేంద్రం

టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్న కేంద్రం.. దిగుమతి చేసుకునే టీకాలపై 10% కస్టమ్స్‌ సుంకాన్ని రద్దు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. విదేశీ వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు భారత్‌కు టీకా దిగుమతి కోసం ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు సుంకం రద్దు చేస్తారని ఆ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం మన దేశంలోకి దిగుమతి అయ్యే టీకాలపై 10 శాతం కస్టమ్స్‌ సుంకం, 16.5 శాతం ఐజీఎస్టీ, సోషల్‌ వెల్ఫేర్‌ సర్‌చార్జ్‌ విధిస్తున్నారు. అయితే, కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిమిత్తం స్పుత్నిక్‌ వి టీకాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి కంపెనీలు కూడా మనదేశంలో అత్యవసర వినియోగ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటికీ అనుమతులు వస్తే ఆయా టీకాలను దిగుమతి  చేసుకోవాల్సి ఉంటుంది. వాటిపై సుంకాల భారం మోపితే ధరలు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం కస్టమ్స్‌ సుంకం రద్దు దిశగా యోచిస్తోంది. 

Updated Date - 2021-04-21T09:32:11+05:30 IST