అభివృద్ధిలో ఆమడదూరం

ABN , First Publish Date - 2021-06-18T04:57:22+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అనేక మండలాలు, గ్రామాలు

అభివృద్ధిలో ఆమడదూరం
బషీరాబాద్‌లో బేస్‌మెంట్‌ స్థాయిలోనే నిలిచిన శ్మశానవాటిక నిర్మాణం

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధిలో వెనుకబడిన మండలాలు, గ్రామాలు
  • నిధుల కొరతో ముందుకు సాగని పనులు
  • ప్రభుత్వ భూమి లేక ఆగిన నిర్మాణాలు
  • పాలకులు, అధికారుల అలసత్వమూ కారణమే..


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అనేక మండలాలు, గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సర్వేచేసి కొన్ని మండలాలు, గ్రామాలను చెత్త గ్రామాలుగా వెల్లడించింది. అయితే, గ్రామాలు, మండలాల వెనుకబాటుకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్నిచోట్ల నిధులు లేక అవాంతరాలు ఏర్పడితే.. మరికొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిలిచింది. వెనుకబడిన ప్రాంతాల్లో పరిస్థితిపై ’ఆంధ్రజ్యోతి‘ ప్రత్యేక కథనం...

--------------------------------------------------------------

బిల్లులు రాకపోవడమే ప్రధాన కారణం

బషీరాబాద్‌: పల్లెప్రగతి అమలులో వెనుకబడిన మండలాల్లో బషీరాబాద్‌ ఒకటి. జిల్లాలో అభివృద్ధి విషయంలో వెనుకబడిన మండలంగా అధికారులు దీనిని ప్రకటించారు. అయితే, మం డలం అభివృద్ధికి వెనకబడడానికి అనేక కారణాలు ఉన్నాయని స్థానికులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. 

వెనుకబాటుకు కారణాలు

- ఈ మండలం జిల్లాలోనే మారుమూల ప్రాంతం

- ఇక్కడ ప్రజా చైతన్యం అంతంతమాత్రమే 

- అప్పులు చేసి పనులు చేపట్టిన ప్రజాప్రతినిధులు

- చేపట్టిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం

------------------------------------------------------------

చొరవ కరువు

బొంరాస్‌పేట్‌: ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి లేక బొంరాస్‌పేట్‌ మండలం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందని మండలవాసులు ఆరోపిస్తున్నారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంతో చాలా వరకు గ్రామాలు అభివృద్ధికి దూరంగా నిలిచాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వెనుకబాటుకు కారణాలివే..

- ఓడీఎఫ్‌ మండలంగా పేరు తెచ్చుకున్నా పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణంలో జాప్యం.

- కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, పారిశుధ్యం, అభివృద్ధి పనులపై శ్రద్ధ పెట్టకపోవడం.

- ఉపాధిహామీలో పనులు కల్పించకపోవడం.

- మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు సమావేశాలు నిర్వహించి అభివృద్ధిపై సమీక్షించకపోవడం.

- నిధులు విడుదల చేయడంలో జాప్యం.

-------------------------------------------------------------

పనులన్నీ నత్తనడకే..

కొడంగల్‌రూరల్‌: కొడంగల్‌ మండలం ప్యాలమద్దిని అధికారులు అభివృద్ధిలో వెనకబడిన గ్రామంగా నిర్ధారించారు. అనుకున్న స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగలేదని వారు తమ నివేదికలో వెల్లడించారు. 

వెనుకబాటుకు కారణాలు

- గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా పనుల్లో జాప్యం వహించడం.

- భూ కేటాయింపునకు కొందరు అడ్డుతగలడంతో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతివనం పనులు కొనసాగలేదు. 

----------------------------------------------------------------

నిధులు లేక నీరసం

దౌల్తాబాద్‌: దౌల్తాబాద్‌ మండలం సంగాయిపల్లిలో నిధుల 

లేమితో అభివృద్ధి కుంటుపడింది. కనీసం గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా లేదు.

వెనుకబాటుకు కారణాలు

- చిన్న గ్రామ పంచాయతీ కావడంతో నిధుల లేమి పట్టిపీడిస్తుంది. 

- శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు చేయించినా నిధులు రాలేదు.

- ఇప్పటికే అప్పుల పాలయిన సర్పంచ్‌. దీంతో నిలిచిపోయిన అభివృద్ధి పనులు.

----------------------------------------------------------------------

పరిష్కారం కాని భూ సమస్యలు

మేడ్చల్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో మేడ్చల్‌ మండలం అభివృద్ధిలో వెనుకబడింది.

వెనుకబాటుకు కారణాలు

- కొన్ని గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించకపోవడం.

- సైదోనిగడ్డ తండాలో డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మించకపోవడం.

- పలు గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాలకు కేటాయించిన స్థలాలు వివాదంలో ఉండటం.

-------------------------------------------------------------------------

కొత్త తండాకు కోటి కష్టాలు

బషీరాబాద్‌ : మంతన్‌గౌడ్‌ తండా అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. తండా అభివృద్ధిలో వెనుకబడడానికి అనేక కారణాలున్నాయని ఆ గ్రామ సర్పంచ్‌ గాయత్రితోపాటు స్థానిక తండావాసులు చెబుతున్నారు.

వెనుకబాటుకు కారణాలు

- ఈ తండా ఇటీవలే కొత్త పంచాయతీగా ఏర్పాటైంది.

- తండాకు పెద్దగా ఆదాయ వనరులు లేవు.

- ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర నిధులే దిక్కు.

- శ్మశానవాటిక పనులు జరుగుతున్నా బిల్లులు రాలేదు.

-------------------------------------------------------------------------------

అధ్వాన మండలంగా కీసర

కీసర: అధికారులు నిర్వహించిన సర్వేలో మేడ్చల్‌ జిల్లాలో అధ్వాన మండలంగా కీసర నిలిచింది. మండ లంలో మొత్తం 10 గ్రామపంచాయతీలు ఉండగా, అందులో ఒక గ్రామ పంచా యతీ తప్ప మిగతా గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని సర్వేలో తేల్చారు. 

వెనుకబాటుకు కారణాలు

- కీసర, చీర్యాల్‌, భోగారంలలో డంపింగ్‌ యార్డు, పారిశుద్ధ్య నిర్వహణ, ఎరువు తయారీ కేంద్రాలు లేకపోవడం.

- ఎవెన్యూ ప్లాంటేషన్‌ సరిగ్గా నిర్వహించకపోవడం.

- పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం.

-------------------------------------------------------------------------------------

నిర్వహణ లోపం.. ప్రగతికి శాపం

కేశంపేట: కేశంపేట మండలం బైర్కాన్‌పల్లి పంచాయతీ అభివృద్ధికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. అభివృద్ధి పనులు జరగక పోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

వెనుకబాటుకు కారణాలు

- పంచాయతీ పాలకవర్గం నిర్వహణ లోపం.

- చిన్న పంచాయతీ కావడంతో నిధులు సరిపోవడం లేదు.

- పంచాయతీకి ఆదాయ వనరులు తక్కువగా ఉండడం.

- ఉన్న కొద్దిపాటి నిధులు జీతాలకే సరిపోవడం.

------------------------------------------------------------------------------

నిధులున్నా జరగని పనులు

తలకొండపల్లి : తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌, గట్టి ఇప్పలపల్లి గ్రామాల్లో నిధులున్నా అభివృద్ధి పనులు జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పంచాయతీ పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

వెనుకబాటుకు కారణం

- చాలా గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తయినా ఇక్కడ పునాదులకే పరిమితమైంది.

- నిర్మాణానికి నిధులు డ్రా చేసినా పనులు మాత్రం జరగలేదు.

- డంపింగ్‌యార్డు నిర్మాణం కూడా ముందుకు సాగడం లేదు. 

- అభివృద్ధి పనులకు అవసరమయ్యే డబ్బులు డ్రా చేసుకున్నా పనులను పూర్తిచేయడంలో పంచాయతీ పాలకవర్గం, అధికారులు అలసత్వం.

- గట్టిప్పలపల్లిలో నిలిచిన నిర్మాణాలు.

--------------------------------------------------------------------------------

ప్రగతి వెలుగులకు దూరం

చౌదరిగూడ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చౌదరిగూడ గ్రామం మండల కేంద్రంగా ఏర్పడింది. కానీ మండల అభివృద్ధికి సరిపడా నిధులు, అధికారులను కేటాయింపులు జరుగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వెనుకబాటుకు కారణాలు

- అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగడం. 

- మండలానికి పూర్తిస్థాయిలో అధికారులను నియమించకపోవడం. 

- నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం

- సరిపోను నిధులు విడుదల కాకపోవడం.

-----------------------------------------------------

నిర్లక్ష్యంతో..

తలకొండపల్లి : తలకొండపల్లి మండలం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వెనుకబడింది. చాలా పంచాయతీలు అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

వెనుకబాటుకు కారణాలు

- ప్రభుత్వం నిధులు సమకూర్చినా సర్పంచుల నిర్లక్ష్యం.

- అధికారుల పర్యవేక్షణ కొరవడడం.

- గ్రామాల్లో ప్రభుత్వ భూములు లేకపోవడంతో నిర్మాణాలు జరగలేదు.

----------------------------------------------------


Updated Date - 2021-06-18T04:57:22+05:30 IST