విరిసిన వసంతం

ABN , First Publish Date - 2021-04-12T05:32:05+05:30 IST

కాలానికి సాగిపోవడం ఒకటే తెలుసు. శిశిరం వెళ్లిపోయి వసంతం వచ్చేసింది. కొత్త ఉగాది ప్లవ సంవత్సరాదిగా విచ్చేసింది. వసంత రాగంతో మొదలయ్యే నూతన తెలుగు సంవత్సరం..

విరిసిన వసంతం

కాలానికి సాగిపోవడం ఒకటే తెలుసు.  శిశిరం వెళ్లిపోయి వసంతం వచ్చేసింది. కొత్త ఉగాది ప్లవ సంవత్సరాదిగా విచ్చేసింది. వసంత రాగంతో మొదలయ్యే నూతన తెలుగు సంవత్సరం.. ఆసాంతం సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుకుందాం. ఈ సువిశాల సృష్టిని విధాత చైత్ర శుక్ల పాడ్యమి రోజు ప్రారంభించాడు. అందుకే ఇది యుగాది- ఉగాది.


‘‘ప్రత్యాయాంతి గతాః పునర్నదివసాః కాలోజగద్భక్షకః’’ అని ఆది శంకరుల సందేశం. కాలం జీవితాన్ని నడుపుతుంది. శుభాశుభాల కలయికే కాలం. అది జగత్తును గ్రహిస్తుంది. గతించిన కాలం మానవులకు మాత్రమే జ్ఞానాన్నిస్తుంది. జగత్తును ఆధారంగా చేసుకొన్న మానవులు ఏడాదిగా పొందిన జ్ఞానం ద్వారా ‘‘హేవళంబి’’ సంవత్సరాన్ని సత్సంకల్పంతో, సదాలోచనతో స్వాగతిస్తే అంతా ‘సుముఖమై’ సద్విజయాన్నిస్తుంది. ఖగోళంపై గల జీవులపై ఖగోళంలో ఉన్న గ్రహాదుల ప్రభావం ఉంటుంది. ‘ఖం’ అంటే సంస్కృతంలో ‘ఆకాశం’ అని అర్థం. ఆకాశంలో సంచరించే ఆదిత్యుని వల్లనే ఇతర గ్రహాల శక్తులు భూమిని చేరుతాయి. జీవులకు ప్రధాన ప్రాణశక్తి ఆదిత్యుడే. ఆయనే కాలస్వరూపుడు. ‘ప్రభవ’ నుంచి ‘అక్షయ’ వరకు ఉన్న అరవై సంవత్సరాల పేర్లన్నీ ఆదిత్యుని విశేషాలే.


వసంత సోయగం

ప్రకృతి శోభను వికసింపజేసి సర్వ జీవులనూ ఉత్తేజపరుస్తూ, ఒక ప్రత్యేక పరమార్థాన్ని కలిగింది ఈ వసంత సోయగం. ‘‘వసంత సుఖం యథాతథా అస్నిన్నితి వసంతః’’ వసంతంలో సర్వజనులు సుఖంగా ఉంటారు. ‘‘పుష్పాణాం సమయః పుష్ప సమయః’’ పుష్పాలు వికసించే కాలం వసంతం. ఈ మాసంలో ‘‘చిత్రామౌక్తి కమేకమ్‌’’- చిత్తా నక్షత్రం ముత్యపు కాంతిని పోలిన తెల్లని కాంతిలో మనసుసు చల్లబరుస్తుంది. ‘‘సరత్యా కరే ఇతి సూర్యః’’ విశ్వాంతరాళంలో సంచరించే సూర్య కిరణాల చైతన్యం, షోడశకళా ప్రపూర్ణుడైన చంద్రుని వెన్నెల, ప్రకృతి శోభను మరింత శోభాయమానంగా మార్చేస్తుంది. అందుకే దీన్ని ‘‘మధుమాసం’’ అన్నారు.


చిత్రా పౌర్ణమి

వసంత రుతువుతో ప్రారంభమైన ఈ మాసం ఒక ప్రత్యేకతను, పరమార్థాన్ని సంతరించుకొంది. ఆహ్లాదకరమైన ప్రకృతి శోభ పరిపూర్ణంగా ప్రకాశించేది ఈ చైత్ర పౌర్ణమి నాడే. అందుకే దీనిని ‘‘మహాచైత్రి’’ అన్నారు. చాంద్రమానంలో తొలి పౌర్ణమి. మహర్షి సత్తముడైన వాల్మీకి ‘‘చైత్రః శ్రీమానయం మాసః’’ అని ఈ మాసాన్ని శ్రీమంతమైనదని వర్ణించారు.


మహాచైత్రి.. ప్రకృతి వైచిత్రి..

చిత్రాచంద్రుల సంయోగం, సూర్య చైతన్యం వసంతశోభను రెట్టిస్తాయి. ఈ విశేషాన్ని ‘‘కావ్యాభిఖ్యాతయో రాశీచ్ఛిత్రా చంద్రమసోరివా...’’ అని మహాకవి కాళిదాసు తన ‘‘రఘువంశ’’ కావ్యంలో వర్ణించారు. ఈ మహాచైత్రి పర్వదినాన్ని ప్రకృతి వనరులు ప్రసాదించే ఇంద్రాది దేవతలు.. ఈశ్వర ప్రీతికై ‘దమన పూజను’ నిర్వహిస్తారు. శైవాగమంలోని శివునికి ఏకవీరాదేవి, భైరవ ఆరాధనలు చేస్తారు. ఈ దమన పూజ తర్వాత బహువర్ణ రంజితమైన చిత్రవస్త్రం దానం చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు,  కలుగుతాయని విశ్వసిస్తారు.


చిత్రగుప్తునికి పూజలు...

యమలోకంలో పాపుల చిట్టాలను రాసే చిత్రగుప్తుడు సూర్యవంశంలో చిత్తా నక్షత్రంలో జన్మించాడు. సూర్యారాధనతో సర్వజ్ఞత్వాన్ని వరంగా పొంది చిత్రాదిత్యునిగా ప్రసిద్ధి చెందాడు. సశరీరంతో యమలోకంలో, జీవుల గుప్తకర్మలను గుర్తించే యోగ్యతను పొందాడని అంటారు. తమిళనాట చిత్రగుప్తుని ఆరాధన, నోములు చైత్రమాసంలో విశేషంగా చేస్తుంటారు. వీటివల్ల గుప్తమైన పాపకర్మల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. మహారాష్ట్ర ప్రాంతీయులు ఈ చైత్రినాడు హనుమదారాధన చేస్తారు. శనిదోష నివారణ కోసం ఈ పూజలు ఆచరిస్తారు.


అన్ని ప్రాంతాలకూ పర్వమే...

చాంద్రమాన పద్ధతిలో వసంత రుతువు, కొత్త సంవత్సరం ఒకే రోజు ప్రారంభమవుతాయి. ఈ సంప్రదాయాన్ని దక్షిణ భారతీయులైన తెలుగువారు, కన్నడిగులు, మహారాష్ట్ర ప్రజలు పాటిస్తున్నారు. ఈ పద్ధతినే మానస సరోవరం, కైలాస పర్వతం నెలకొని ఉన్న సుదూర ఉత్తర ప్రాంతమైన ‘త్రివిష్టపం’లోనూ పాటిస్తుండటం విశేషం. త్రివిష్టపం, టిబెట్‌ దాదాపు రెండువేల ఏళ్లకు పూర్వం భారతంలో భాగంగానే ఉండేవట! 

ఉత్తరభారతంలో అనేక ప్రాంతాల్లో ‘బృహస్పతి’ గ్రహం రాశి మారినపుడు కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. అంటే వారిది- బార్హస్పత్య మానం. అందువల్ల వారి ఉగాది, కొత్త సంవత్సరం వసంత రుతువులో ప్రారంభం కావు. పంజాబ్‌ తదితర ప్రాంతాల్లో వైశాఖ మాసంలో నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. గుజరాతీయులకు దీపావళి నుంచి నూతన సంవత్సరం. ఇది సౌరమాన విక్రమ శకం! ఇలా కొత్త సంవత్సరం వివిధ కాలాల్లో ఆరంభం అవుతుండటం భారతీయుల వైవిధ్యం. కానీ, వసంత రుతువు మాత్రం దేశమంతటా చైత్ర మాసంతోనే ప్రవేశిస్తుంది. ఇది భారతీయుల సమన్వయం. వసంత నవరాత్రులు కూడా దేశవ్యాప్తంగా ఒకేరోజు మొదలవుతాయి.


ఆ రోజు ఏం చేయాలి?

‘‘వత్సరాదౌ వసంతాదౌ మంగళస్నానమాచరేత్‌’’ అని పెద్దలమాట. అంటే ఉగాది రోజు నలుగు పెట్టుకొని స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రతి ఇంటా ధ్వజాన్ని ఎగరవేయాలి. ప్రతి గృహం ధ్వజారోహణంతో పాటు వేపపువ్వు పచ్చడి తినాలని (నింబకుసుమ భక్షణం) శాస్త్రం నిర్దేశించింది.


చిత్తా నక్షత్రం... చైత్ర మాసం

తెలుగు ప్రజలకు, కన్నడిగులకు, మరాఠీలకు నూతన సంవత్సరం రోజు పంచాంగ శ్రవణం తప్పనిసరి. దేశంలో ఏ కాలమానాన్ని ఆచరించే వారైనప్పటికీ చంద్రునికీ, నక్షత్రాలకీ పౌర్ణమితో ముడిపడిన చైత్రాది నామాలతోనే నెలలను పిలుస్తుటారు. చిత్తా నక్షత్రం మిగిలిన అన్ని నక్షత్రాల కంటే కూడా శుభకరమైనది. వివాహాది శుభకార్యాలకు చిత్తా నక్షత్రానికి విశేష ప్రాధాన్యం ఇస్తుండటం గమనించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం కాలగణనకు శుభారంభమైనది.


పచ్చదనం... పులిహోర

ప్రకృతి మొత్తం పచ్చదనంతో పరవశించే వేళ.. చైత్ర లక్ష్మీదేవి సహితుదైన వసంత పురుషుడు పుడమికి వస్తున్నాడు. మన ఇంటికి వస్తున్నాడు. కొత్త చిగురులు మెక్కి స్వాగత గీతాలు పాడుతున్న కోకిలల గొంతులతో వసంత శుభసౌరభం గుబాళిస్తుంది. వసంతం పసుపు పచ్చదనం, ఆకుపచ్చనిదనం కూడా! పసుపు పరమ శుభకరం. ఆరోగ్యప్రదం. ఉగాది రోజున పులిహోర తప్పనిసరి. దీనికి చిత్రాన్నమన్న పేరూ ఉంది. ప్రతి పండుగ రోజు చిత్రాన్నం చేయడం ‘చిత్తా’ నక్షత్రపు ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. చిత్రాన్నంతో పాటు భక్ష్యాలను, హోలిగలను, బొబ్బట్లను, పూర్ణం బూరెలను దేవునికి నివేదించడం ప్రకృతితో ముడిపడిన సంప్రదాయం. మన అస్తిత్వం, ప్రగతి, సుగతి సమస్తం పుడమితల్లితో, ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. ఫాల్గుణం వరకు చెరకును గానుగలలో పిండిన రసాన్ని చైత్రం వచ్చేనాటికి ఉడికించి బెల్లం చేస్తుంటారు.  అలాంటి తియ్యటి బెల్లంతో తయారయ్యే అప్పచ్చులు, భక్ష్యాలు నివేదించడం సంవత్సరం పొడుగునా సాగే శుభ పరంపరకు చిహ్నం. చెరకు విల్లు ధరించి మన్మథుడు వసంత ప్రారంభం నుంచి రతీదేవితో కలిసి వినూత్న సృష్టికి పూనుకుంటాడు. ఇదీ ఉగాది.




పంచాంగం అంటే...?

ఉగాది రోజు తప్పకుండా ఉండాల్సినవి మామిడి తోరణాలు, ఉగాది పచ్చడి. వీటితో పాటు పంచాంగం తప్పనిసరి. పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ ఐదింటి గురించి పంచాంగం వివరిస్తుంది. మనకు 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు, 11 కరణాలు ఉన్నాయి. వీటన్నిటినీ పంచాంగం వివరిస్తుంది. వీటితో పాటు నవ గ్రహాల సంచారం, నిత్య లగ్న చక్రాలు, లగ్న ఆద్యంత కాలాలు, వివాహాది శుభకార్యాల ముహూర్తాలు, ధర్మసింధు, నిర్ణయసింధు వంటి గ్రంథాలలో పేర్కొన్న ధార్మిక ఆచరణకు  యోగ్యమైన విషయాలను పంచాంగాలలో ప్రస్తావిస్తారు.


ఈ ప్లవ సంవత్సరాది నాటికి కలియుగంలో గతాబ్దాల సంఖ్య 5,122. అంటే కలియుగం ప్రారంభమై 5,122 సంవత్సరాలు గడిచాయి. ఈ ప్లవ నామ సంవత్సర ఉగాది రోజున 5,123వ సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఉగాది నుంచి ‘కలియుగే నవదశోత్తర శతాధిక పంచ సహస్రతమ- 5,123 వర్షే’ అని చెప్పుకొంటూ నిత్య విధులను సంకల్పించాలి.

Updated Date - 2021-04-12T05:32:05+05:30 IST