మన పంటను వదిలేసి...

ABN , First Publish Date - 2020-04-09T12:14:57+05:30 IST

జిల్లాలో పండిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.

మన పంటను వదిలేసి...

జిల్లాకు భారీగా అరటి దిగుమతి

ఒత్తిడికి గురవుతున్న అధికారులు

మన జిల్లా రైతుల పరిస్థితి ప్రశ్నార్థకం

ఆందోళనలో రైతాంగం


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో పండిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. పొలాల్లోనే నిల్వ ఉండిపోతున్నాయి. ముఖ్యంగా అరటి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటను విక్రయించడానికి రైతులు పడరాని పాట్లు పడుతుంటే...  కడప నుంచి అరటి నిల్వలు మాత్రం భారీగా జిల్లాకు చేరుతున్నాయి. వాటిని విక్రయించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే జిల్లాకు 100 టన్నుల అరటి పంట చేరుకోగా.. బుధవారం మరో 30 టన్నుల సరుకు చేరింది.


  గురువారం ఉదయానికి మరో 30 టన్నులు చేరనున్నట్టు తెలుస్తోంది, వీటిని జిల్లాలోని రైతు బజార్లకు తరలించి విక్రయించనున్నారు. విజయనగరంలోని మూడు రైతుబజార్లకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన ప్రాంగణాలకు స్టాక్‌ చేర్చే పనిలో సిబ్బంది పడ్డారు. ఉన్నతాధికారులు విధించిన లక్ష్యంతో వెలుగు సిబ్బంది. అటు రైతు బజారు నిర్వాహకులు ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే ఒక విడత నిల్వలను రైతుబజారు నిర్వహకులు విక్రయించారు. ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మళ్లీ నిల్వలు వస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అదేశించడంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. బుధవారం వచ్చిన నిల్వలను విజయనగరం మార్కెట్‌ కమిటీ సముదాయం నుంచి చిన్న వాహనాల్లో మండలాలకు తరలించారు.


  అరటి పండ్లు కిలో రూ.13కే విక్రయించాలని అధికారుల నుంచి ఆదేశాలున్నాయి. కానీ వీలైనంత త్వరగా వదిలించుకోవాలన్న నేపంతో కొన్నిచోట్ల రూ.11కే అమ్ముతున్నారు. లాభం లేకపోతే పోనీ అధికారులకు చెల్లించాల్సిన నగదు  వచ్చినా చాలనే ప్రయత్నంలో వెలుగు సిబ్బంది ఉన్నారు.  


ఇక్కడి పరిస్థితి ఏంటి?

జిల్లాలో పండే పంట విషయమై యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జియ్యమ్మవలస, గరుగుబిల్లి, సాలూరు, పాచిపెంట, మక్కువ కొమరాడ, కురుపాం మండలాల్లో అరటి పండించి స్థానికంగా మార్కెట్‌ కోసం ఆధారపడిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది రైతులు ముందుగానే ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల వర్తకులకు అమ్మకాలు చేసిన వారు కాస్తా ఊరట చెందుతున్నారు.


మరికొందరు రైతులు స్థానిక మార్కెట్‌పైనే అధారపడుతున్నారు. ఇటువంటి వారు ఇబ్బందులకు గురవుతున్నారు. కడప అరటి పళ్లతో మార్కెట్లో ధరలేక ఇబ్బందులు పడుతున్నారు. గరుగుబిల్లి మండలంలో ఉద్యోగ విరమణ చేసిన ఓ ఉద్యోగి నాలుగు ఎకరాల్లో అరటి వేశారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలేక ఆవస్థలు పడుతున్నాడు. కడప అరటి తక్కువ ధరకు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతున్న కారణంగా స్థానిక రైతాంగం నాష్టాలను చవిచూస్తున్నారు.

Updated Date - 2020-04-09T12:14:57+05:30 IST