Abn logo
Apr 17 2021 @ 01:04AM

రెచ్చిపోతే కుదరదంతే!

తెగబడితే సీఈసీ చూసుకుంటుంది

స్థానిక తరహా  అక్రమాలు ఉపపోరులో అసాథ్యం

ఎదురొడ్డనున్న టీడీపీ, బీజేపీ

ఆందోళనలో వైసీపీ

సహకరిస్తే ఇరుక్కుంటామని భయపడుతున్న ఉద్యోగులు, పోలీసులు

 తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం చరిత్రలోనే బహుశా ఇంత తీవ్రమైన ఒత్తిళ్ల నడుమ ఎన్నికలు ఎన్నడూ జరిగి ఉండవు. తమ పార్టీ ఎంపీ మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పట్ల నిజానికి అధికారపార్టీ నిమ్మళంగానే ఉండాలి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకే ఉప ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కూడా. సానుభూతికి తోడు అధికారం, ఆర్ధికబలం, దేనికైనా తెగించగల అనుచరగణం ఉన్న వైసీపీకి మాత్రం ఈ ఎన్నికలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  అయిదు లక్షల ఆధిక్యతతో ప్రజలకు పేరైనా తెలియని అభ్యర్ధిని గెలిపించి సీఎం జగన్‌తో శభాష్‌ అనిపించుకుని తమ పదవులు పదిలపరచుకోవాలని ఆశపడుతున్న నాయకులు పోలింగ్‌ దగ్గరయ్యే కొద్దీ టెన్షన్‌ టెన్షన్‌గా గడుపుతున్నారు. 

తిరుపతి-ఆంధ్రజ్యోతి:

రాష్ట్రాన్ని ఫ్యాను గాలి సునామీలా ముంచెత్తిన గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి  వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్‌ 2.27 లక్షల బంపర్‌  మెజారిటీతో గెలిచారు. ఆయన మరణం తర్వాత జరుగుతున్న  ఉప ఎన్నికల్లో దాదాపు రెట్టింపు మెజారిటీ సాధించవచ్చని వైసీపీ ధీమాతో ఇంతకాలం ఉండేది. ఒకరు 3లక్షలని, ఇంకొకరు నాలుగని, కాదు 5 సాధిస్తామని వైసీపీ నాయకులు ఢంకా భజాయించి మరీ పార్టీ అధినేత ముందు చెప్పేశారని కూడా ప్రచారం. కానీ మారిన పరిస్థితులు వైసీపీకి మింగుడు పడడం లేదు. చివరికి వద్దనుకున్న జగన్‌నే రంగంలోకి దించాలనుకున్నా, అనుకున్న మెజారిటీ దక్కకపోతే అభాసుపాలవుతామనే ఆందోళనతో కరోనా నెపంతో రద్దు చేసుకున్నారు. అయితే  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎనిమిది రోజుల పాటు ఇక్కడే ఉండి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్నీ సుడిలా చుట్టేశారు. ఆయన మాటల ధాటికి జనం నుంచి స్పందన, రోడ్‌షోల్లో వెల్లువెత్తిన ప్రజలు, లోకేష్‌ సహా టీడీపీ ముఖ్య నాయకులంతా రోజుల తరబడి మకాం వేసి సాగించిన ప్రచార వ్యూహాలు..ఇవన్నీ వైసీపీ నేతల ధీమాను దెబ్బతీశాయి. ప్రభుత్వంపై పవన్‌కళ్యాణ్‌ దాడి, బీజేపీ ఘాటు విమర్శలు, ఎస్సీలు దగాకు గురయ్యారంటూ చింతామోహన్‌ చేసిన ఆరోపణలు జనంలోకి బాగానే చొచ్చుకుపోయాయి. నవరత్నాలు సునాయాసంగా గెలిపిస్తాయనుకున్న వైసీపీ నేతలు, ఇప్పుడిక తమ సహజ శైలి ఎన్నికలకు తెగబడాల్సిందే అని నిర్ణయించుకున్నారని ప్రచారం అవుతోంది. స్థానిక ఎన్నికల్లో సాగించిన తీరులోనే దబాయింపుతో పోలింగ్‌ పూర్తి చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే 2017 నాటి జగన్‌ హోరు ఇప్పుడు లేదని, స్థానిక ఎన్నికల పరిస్థితులు ఉప ఎన్నికల్లో సాధ్యం కాదని అర్థం కావడంతో తీవ్ర ఆందోళనతో వైసీపీ నేతలున్నారని తెలుస్తోంది. 

వెంటాడుతున్న సీఈసీ భయం

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్థానిక ఎన్నికలకూ, ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతున్న ఉప ఎన్నికలకూ అసలు పోలికే ఉండదని వైసీపీ నేతలకు అర్థం అయింది. ప్రత్యర్ధులే బరిలోకి దిగకుండా చేసే దౌర్జన్యాలకు ఇక్కడ సాధ్యం కాదు. ఇక మిగిలింది పోలింగ్‌కి ప్రజల్ని పెద్ద సంఖ్యలో రాకుండా చేసి తాము గుద్దేసుకోవచ్చనే భరోసాను కొందరు ఇచ్చినా నాయకులకు సీఈసీ వల్ల గుండెలు చిక్కబడడం లేదంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మనుషుల్ని దించడం, రిగ్గింగ్‌లకు తెగించడం వంటివి మీడియాలో వెలుగు చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరహాలో హెచ్చరికలు, బదిలీలకే పరిమితం కాక తీవ్ర చర్యలు ఉండే అవకాశం ఉంది. అందుకే స్థానిక ఎన్నికల్లో చూసీ చూడనట్టు ఉండిపోయిన పోలింగ్‌ ఉద్యోగులు, తప్పనిసరై సహకరించిన పోలీసులు ఉప ఎన్నికల్లో గట్టిగా ఉండే అవకాశం ఉంది. చోటా మోటా నేతల బెదిరింపులు, బరితెగింపులను చూస్తూ ఊరుకుంటే, మీడియా బట్టబయలు చేస్తే తమ ఉద్యోగాలకే ముప్పు వస్తుందన్న భయం వారిలో ఉంది. ఇందుకు తగ్గట్టే హైదరాబాద్‌, నుంచి అమరావతి నుంచి పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు మొహరించారు. రయ్‌రయ్‌న రోడ్ల మీద తిరుగుతున్న లైవ్‌ వాహనాలు వైసీపీ గుండెల్లో రైళ్ల పరుగులా మారుతున్నాయంటున్నారు. 

సై అంటున్న టీడీపీ

అధికారం చేజారిన తర్వాత నీరసపడ్డ టీడీపీ కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. సై అంటే సై అంటోంది. ప్రతి మండలంలోనూ ముఖ్య నాయకులు మకాం వేసి పరిస్థితులను పరిశీలించి వ్యూహరచన చేశారు. స్థానిక నాయకులకు ధైర్యం కలిగించారు. భవిష్యత్తు మీద ఆశ కల్పించారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ వైఫల్యాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం, అసంతృప్తిలను గమనిస్తున్న స్థానిక నాయకులు జనం వెంట నిలబడితే, వైసీపీకి ఎదురొడ్డితే మళ్లీ అధికారం తమదే అనే విశ్వాసం వారిలో పెరిగింది. దీంతో స్థానిక ఎన్నికల్లో లాగా భయపడో, ఎందుకొచ్చిందిలే అని తప్పుకుతిరగడమో చేయకుండా గట్టిగా నిలబడి ప్రచారాలు చేశారు.  ఈ స్ఫూర్తిని, తెగువను పోలింగ్‌ రోజుకూడా ప్రదర్శించడానికి వారు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు. ఎక్కడ ఏ బూత్‌లో వైసీపీ దౌర్జన్యాలకు దిగినా మరుక్షణం ఎదుర్కోవాలని, మీడియా దృష్టికి తీసుకువచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారు భావిస్తున్నారు. ఈ పరిణామాలను సీఈసీ తీవ్రంగా పరిగణిస్తుంది అనే నమ్మకం కూడా టీడీపీలో బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో  వైసీపీ స్థానిక తరహా తెగింపులకు దిగలేదని అంచనా వేస్తున్నారు. 

బెడిసికొడుతున్న వలంటీర్‌ల మీద ఆశలు

వలంటీర్ల వ్యవస్థ మీద ఆశలు పెట్టుకున్న వైసీపీకి ఇది కూడా ఇబ్బదికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మీడియాలో ఫోటోలు సహా ప్రచురితమైన వలంటీర్ల ప్రచారాలు సీఈసీ దృష్టికి వెళ్లాయి. వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ రెండు జిల్లాల కలెక్టర్లను సీఈసీ హెచ్చరించింది కూడా. డబ్బులు పంచడం, వెంట తీసుకువచ్చి ఓట్లు వేయించడం వంటి పనులు వలంటీర్లతో చేయించుకోవడానికి చేసుకున్న ప్లాన్‌ కూడా వైసీపీకి బెడిసి కొట్టేట్టే ఉందంటున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వలంటీర్‌లు చేస్తున్న పనులు గనుక బయటపడితే ఉద్యోగానికే కాదు, ఏకంగా చట్టపరమైన చర్యలకూ బలవుతామనే భయం వారిలో కనిపిస్తోంది. అయితే స్థానిక నాయకులను కాదనలేక, ఎదురు చెప్పలేక వారు సతమతం అవుతున్నారు. స్థానిక ఎన్నికల తరహాలో సంపూర్ణ సహకారం మాత్రం వారి నుంచి లభించే అవకాశం లేదంటున్నారు. 

బీజేపీతో ముప్పే

ఇక బీజేపీ కూడా బరిలో ఉండడం, ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు ఆ పార్టీ నాయకులు చేయడం, జనసేన అండగా నిలబడడం వంటి పరిణామాలు సైతం వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. బీజేపీ అభ్యర్ధి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా రిటైరైనవారు కావడంతో వైసీపీ దౌర్జన్యాలకు దిగితే వెంటనే సీఈసీ దృష్టికి తీసుకువెళ్తారని, అధికారంలో ఉన్నది ఆ పార్టీయే కావడంతో చర్యలూ తీవ్రంగా ఉంటాయని వైసీపీ నేతలు భయపడుతున్నారని చెబుతున్నారు. స్థానిక తరహా దౌర్జన్యాలకు పోలింగ్‌ రోజున తెగబడితే గట్టిగా ఎదిరించాలనే ఆలోచనతో బీజేపీ నేతలున్నారంటున్నారు. విజయం మాట ఎలా ఉన్నా ఓట్ల శాతం గణనీయంగా పెంచుకుంటే రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని ఆ పార్టీ జాతీయ నేతల్లోనూ ఉన్నందున వైసీపీ అక్రమాలను అడ్డుకుంటారని భావిస్తున్నారు. ఇక దూకుడుగా ఉండే జనసేన కూడా వీరికి అండగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడబడితే అక్కడ, ఎట్లబడితే అట్లా వ్యవహరించడం కుదరదని వైసీపీ నేతలకు అర్థం అవుతోందంటున్నారు. 


అధికార పార్టీ నేతలపై తీవ్ర ఒత్తిడి

తాము ధీమాగా చెప్పుకున్న మెజారిటీ తగ్గితే ఏం చేయాలా అనే ఆందోళన వైసీపీ జిల్లా నేతల్లో మొదలైందంటున్నారు. మెజారిటీ తగ్గితే చాలు వైసీపీ గెలిచినా ఓడినట్లే అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తాయనే భయం వారిలో పెరుగుతోంది. ఇదే జరిగితే జగన్‌ తమ పట్ల ఎలా వ్యవహరిస్తారో అనే టెన్షన్‌ వారిలో ఉందంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో అధికారం చెలాయిస్తున్న ఒక నాయకుడిని ఈ పరిస్థితులు తీవ్రంగా కలవరపెడుతున్నాయంటున్నారు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి పదవుల్లో మార్పు ఉంటుందనే సూచన కొందరిలో ఆశను పెంచుతుండగా, మరి కొందరిలో భయం పెంచుతోందని చెప్పుకుంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement