తక్కువ స్థలంలో ఆకట్టుకునేలా గార్డెనింగ్‌

ABN , First Publish Date - 2022-01-19T05:30:00+05:30 IST

మొక్కలు పెంపకంపై చాలా మంది ఆసక్తి ఉంటుంది. కానీ స్థలం

తక్కువ స్థలంలో ఆకట్టుకునేలా గార్డెనింగ్‌

మొక్కలు పెంపకంపై చాలా మంది ఆసక్తి ఉంటుంది. కానీ స్థలం లేకపోవడం వల్ల ఆసక్తిని పక్కన పెట్టేస్తుంటారు. అయితే కాస్త మనసు పెడితే ఉన్న స్థలంలోనే ఆకట్టుకునే విధంగా మొక్కలు పెంచుకోవచ్చు.  


 ముందుగా మొక్కల ఎంపిక చాలా కీలకం. ఎలాంటి మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నారో ఒక నిర్ణయానికి రావాలి. పూలు పూసేవా? ఇంట్లోకి ఉపయోగపడే విధంగా కూరగాయల మొక్కలా? గాలిని శుభ్రపరిచేవా? ఏ రకమైన మొక్కలు కావాలో ముందే నిర్ణయించుకోవాలి.


 మొక్కల్లో అవుట్‌డోర్‌, ఇండోర్‌ లో పెరిగేవి ఉంటాయి. మీ ఇంట్లో సూర్యరశ్మి పడుతుందా? పడితే ఎంత సమయం ఉంటుంది. మొక్కలు పెంచుకోవడానికి సూర్యరశ్మి పడే చోటు అనువుగా ఉందా? ఈ విషయాలను పరిశీలించాలి. సూర్యరశ్మి ఉంటే అందుకు అనువైన మొక్కలు ఎంచుకోవాలి. బాల్కనీ ఉన్నా చుట్టూ ఎత్తైన భవనాలుంటే ఎండ పడకపోవచ్చు. అలాంటప్పుడు ఇండోర్‌ ప్లాంట్స్‌ను ఎంపిక చేసుకోవాలి.


 తక్కువ స్థలం ఉన్న వారు వర్టికల్‌ గార్డెన్‌ను ఎంచుకోవాలి. గోడకు కాకుండా చెక్కను నిలువుగా అమర్చి, వాటికి మొక్కలు పెట్టిన ప్లాస్టిక్‌ కంటెయినర్స్‌, బాస్కెట్స్‌ను వేలాడదీయడం ద్వారా వర్టికల్‌ గార్డెన్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో పుదీనా, కొత్తిమీర వంటి వాటిని కూడా పెంచుకోవచ్చు. 




 బాల్కనీ రెయిలింగ్‌కు హ్యాంగింగ్‌ బాక్స్‌లు ఏర్పాటు చేసుకుని కూడా మొక్కలు పెంచుకోవచ్చు. ఇది చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బాల్కనీ స్థలం తక్కువగా ఉంటే మీరు కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బాల్కనీ కాస్త విశాలంగా ఉన్నట్లయితే కుండీల్లో మొక్కలు పెంచుకోవచ్చు.


 మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే నిర్వహణ చాలా ముఖ్యం. ఇండోర్‌ ప్లాంట్స్‌కు నీటి అవసరం తక్కువగా ఉంటుంది. అవుట్‌డోర్‌ ప్లాంట్స్‌కు మాత్రం రెగ్యులర్‌గా నీళ్లు అందించాలి. ఎప్పటికప్పుడు పాదుల దగ్గర శుభ్రం చేయడం, ఎండిన ఆకులు తొలగించడం చేయాలి. 


Updated Date - 2022-01-19T05:30:00+05:30 IST