Abn logo
Sep 22 2021 @ 23:07PM

ఆసిఫాబాద్‌ కలెక్టర్‌, ఎస్పీ, మరోముగ్గురు అధికారులకు జైలుశిక్ష

వివాదాస్పద భూమిలో నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ భవనం

- కోర్టు ధిక్కరణ కేసులో శిక్షఖరారు చేసిన హైకోర్టు

చింతలమానేపల్లి, సెప్టెంబరు 22: కోర్టు ధిక్కరణ కేసులో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌తోపాటు అప్పటి జిల్లాఇన్‌చార్జి ఎస్పీ సత్యనారా యణ, కాగజ్‌నగర్‌ ఆర్డీవో సిడాం చిత్రు, తహసీల్దార్‌ బికర్ణదాస్‌తో పాటు అప్పటి స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌కు రెండు నెలల చొప్పున జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు జడ్జి కెలక్ష్మణ్‌ ఈనెల17న ఉత్తర్వులు జారీచేశారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో 1.32 ఎకరాల భూమిని పోలీసుస్టేషన్‌ భవన నిర్మాణానికి కేటాయిస్తూ అప్పటికలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఉత్తర్వులు జారీచేశారు. అయితే పోలీసు స్టేషన్‌ నిర్మించే స్థలం తమదంటూ మండల కేంద్రానికి చెందిన రౌతు సైదాబాయి, రేణు బాయి కలెక్టర్‌, ఆర్డీవోలతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో హైకోర్టులో కేసు వేశారు. వివాదం సాగుతున్న సమయంలో కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు స్థానికంగా విచారణ చేసి పంచనామా చేశారు. పట్టాదారు చెప్పిన భూమిలో ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదని ఫిటిషనర్‌ భూమికి ఎటువంటి నష్టంలేదని కాగజ్‌నగర్‌ ఆర్డీవో చిత్రు కోర్టుకు రిపోర్టు అందజేశారు. రెవెన్యూ అధికారుల పంచనామా కాపీ కోర్టుకు సమర్పించిన దానికి, కేసు వేసిన పట్టాదారుకు ఇచ్చిన పత్రాలు వేర్వేరుగా ఉండడంతో బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. 

అధికారులు ఉద్దేశపూర్వకంగా తమకు నష్టం చేయడమే కాకుండా కోర్టును తప్పుదోవపట్టిస్తున్నారని పిటీషన్‌లో పేర్కొ న్నారు. దీంతో కంటెమ్ట్‌ ఆఫ్‌ కోర్టు కింద బాధితులు ఫిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి అధికారులకు కోర్టు ధిక్కారం కింద రెండు నెలల జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీని అమలుకు నాలుగు వారాల గడువు ఇచ్చినట్లు తీర్పులో పేర్కొన్నారు.