ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు

ABN , First Publish Date - 2020-06-28T06:36:41+05:30 IST

దేవాలయ భూముల్లోని అక్రమకట్టడాలను శనివారం దేవాదాయ శాఖ అధికారులు తొలిగించే ప్రయత్నం చేయగా గ్రామస్థులు అడ్డుకోవడంతో

ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు

కూల్చేందుకు దేవాదాయ అధికారుల యత్నం

అడ్డుకున్న తీర్థల గ్రామస్థులు.. స్వల్ప ఉద్రిక్తత

పురుగుల మందుతాగి ఇద్దరు ఆత్మహత్యాయత్నం

 

ఖమ్మం రూరల్‌, జూన్‌ 27: దేవాలయ భూముల్లోని అక్రమకట్టడాలను శనివారం దేవాదాయ శాఖ అధికారులు తొలిగించే ప్రయత్నం చేయగా గ్రామస్థులు అడ్డుకోవడంతో ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం తీర్థాలలో స్వల్ప ఉద్రిక్తత  ఏర్పడింది. ఖమ్మం రూరల్‌ మండలం తీర్థాల సంఘమేశ్వర స్వామి ఆలయం పేరి సుమారు 134 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూముల్లో తీర్థాల గ్రామానికి చెందిన గిరిజనులు సుమారు 50 మంది వరకు ఇళ్ల నిర్మించుకుని ఉంటున్నారు. దాంతో ఆలయ భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమనిర్మాణాలపై అధికారులు, గిరిజనులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. అయితే దేవాదాయ శాఖ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలతో ఆలయ భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు  శనివారం ఉదయం ఎక్స్‌కవటర్లతో గ్రామానికి చేరుకున్నారు. ముదుగా ఆలయ భూమిలో ఉన్న సర్పంచ్‌ బాలునాయక్‌కు చెందిన ఇంటిని కూల్చే ప్రయత్నం చేశారు. దాంతో గ్రామస్థులు అధికారులను అడ్డుకున్కారు.


ఈ సమయంలో పోలీసుల సహకారంతో ఆ ఇంటిని కూల్చేయాలని అదికారులు ప్రయత్నించగా  సర్పంచ్‌ భార్య తేజావత్‌ భద్రకాళి పురుగుమందు తాగేందుకు ప్రయత్నించగా, సర్పంచ్‌ సోదరుడు తేజావత్‌ రవి తన వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వారిని వారించారు. ఈ క్రమంలో గ్రామస్థులు అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి నిర్మాణాలను కూల్చకుండా  అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్వల్ప ఉదిృక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. దాంతో దేవాదాయశాఖ అధికారులు నిర్మాణాలను కూల్చకుండానే వెళ్లిపోయారు.


ఈ వివాదంపై గ్రామస్థులు మాట్లాడుతూ ఆలయ భూములను మొత్తం సర్వేచేసి హద్దులు ఏర్పాటు చేసిన తరువాతే ఆక్రమణలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చి ఆక్రమణలు తొలగించాలన్నారు. దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ గౌరీ శంకర్‌ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వచ్చిన తమపై గ్రామ సర్పంచ్‌ బాలునాయక్‌ ఆధ్వర్యంలో పలువురు దౌర్జన్యం చేసి ఆటవికంగా దాడిచేశారన్నారు. పోలీసుల సమక్షంలోనే తమపై దాడి జరిగిందన్నారు. తీర్దాల గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ నిబందనలు ఇరువర్గాలు ఉల్లంఘించారు. 

Updated Date - 2020-06-28T06:36:41+05:30 IST