విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి
త్రిదండి చినజీయర్ స్వామి
నెల్లిమర్ల, జనవరి 15: రామతీర్థం రామస్వామి ఆలయం ప్రాచీనమైనదని.. సుదీర్ఘ చరిత్ర ఉన్న దేవస్థానంలో వసతులు మెరుగుపరచాల్సిన అవసరముందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. గురువారం కోదండ రాముని ఆలయాన్ని సందర్శించారు. ఆలయం లోపలి భాగంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అర్చకులు, దేవస్థానం అధికారులు, పోలీసులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. భద్రతను మరింతగా పెంచాలన్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలు దురదృష్టకరమన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. రామతీర్థం ఆలయంలో వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. ద్వారాలు సరిగాలేవని, నీటి వసతి మెరుగుపరచాలని, గర్భాలయ భాగం కూడా బాగోలేదన్నారు. వీటన్నింటినీ మెరుగుపరచాలని కోరారు. ఆయన వెంట దేవదాయ శాఖ ఆర్‌జేసీ డి.భ్రమరాంబ, విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, ఎస్పీ బి.రాజకుమారి, డీఎస్పీ అనీల్‌కుమార్, సీఐ సత్యమంగవేణి ఉన్నారు.