Pandora Papersలో మంత్రులు, అధికారులు.. విచారణకు ప్రధాని ఆదేశం

ABN , First Publish Date - 2021-10-04T22:30:27+05:30 IST

2016వ సంవత్సరంలో ప్రకంపనలు సృష్టించిన ‘పనామా పేపర్స్’ మాదిరిగానే తాజాగా ‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బహిర్గతం చేసింది..

Pandora Papersలో మంత్రులు, అధికారులు.. విచారణకు ప్రధాని ఆదేశం

ఇస్లామాబాద్: పన్ను ఎగవేతదారుల వివరాలతో బయటికి వచ్చిన వ్యవహారంలో పాకిస్తాన్‌కు చెందిన మంత్రులు, ప్రధాని కార్యాలయంలోని అధికారుల పేర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ‘పండోరా పేపర్స్’ పేరుతో వచ్చిన ఈ లీక్‌లో పేర్లున్న ప్రతి ఒక్కరిపై విచారణ చేపడతామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఈ విషయమై అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశామని సోమవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.


‘‘పన్ను ఎగవేస్తు అవినీతికి పాల్పడుతూ అడ్డంగ దొరికిపోయిన ఉన్నత వర్గాల అక్రమ సంపాదనను బహిర్గతం చేసిన పండోరా పేపర్స్‌ను మేము స్వాగతిస్తున్నాం. మొత్తం అక్రమ సంపాదన ఏడు ట్రిలియన్ డాలర్లని ఐక్యరాజ్యసమితి ప్యానెల్ అయిన ఫ్యాక్టీ వెల్లడించింది. ఏ దేశం పేద దేశం కాదని, కానీ ప్రజల డబ్బు, పెట్టుబడులు దారి మళ్లించడం వల్ల ప్రజలు పేదరికంలోకి వెళ్తున్నారని నేను రెండు దశాబ్దాలకు పైగా చేస్తున్న పోరాటంపై మరింత విశ్వాసం పెరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాను దోచుకున్నట్లే, అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోని పాలకవర్గాలు అదే చేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ పెద్ద దేశాలు దీనిని నివారించడానికి దృష్టి సారించడం లేదు. మా ప్రభుత్వం దీనిపై విచారణ చేస్తుంది. పండోరా పేపర్స్‌లో వచ్చిన ప్రతి పాకిస్తానీపై విచారణ కొనసాగుతుంది. ఈ తీవ్రమైన అన్యాయాన్ని సంక్షోభంగా పరిగణించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నాను. ఇలాంటివి పట్టించుకోకపోతే పేద, ధనిక మధ్య అసమానతలు మరింత పెరుగుతాయి’’ అని ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు చేశారు.


2016వ సంవత్సరంలో ప్రకంపనలు సృష్టించిన ‘పనామా పేపర్స్’ మాదిరిగానే తాజాగా ‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఈ జాబితాలో 380 మంది భారతీయులతో పాటు 90 దేశాలకు చెందిన సంపన్నులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఉన్నారు. కాగా, పాకిస్తాన్‌కు చెందిన వారు ఈ జాబితాలో 700 మంది ఉన్నారు.

Updated Date - 2021-10-04T22:30:27+05:30 IST