Abn logo
Sep 19 2021 @ 15:12PM

అమెరికాకు మద్దతిచ్చి పాక్ దెబ్బతింది : ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్థాన్‌ ఆక్రమణకు అమెరికాకు మద్దతిచ్చి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకుందని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల అవమానకర ఉపసంహరణపై అమెరికన్ రాజకీయ నేతలు పాకిస్థాన్‌ను నిందించడం బాధాకరమని చెప్పారు. ఓ రష్యన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఇటీవల అమెరికన్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ విచారణల నేపథ్యంలో ఇమ్రాన్ ఘాటుగా స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా వైఫల్యాలకు పాకిస్థాన్‌ను నిందిస్తున్న అమెరికన్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సెనేటర్లు చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని చెప్పారు. ఓ పాకిస్థానీగా తాను ఈ విషయాన్ని చెప్తున్నానన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో వైఫల్యాలకు తమను నిందించడం అత్యంత బాధాకరమన్నారు. 


అమెరికాలో 9/11  ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళింది. అప్పట్లో పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన ప్రభుత్వానికి అమెరికా మద్దతు కోరారు. దీనిపై ఇమ్రాన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌పై దాడికి అమెరికాకు పాకిస్థాన్ మద్దతివ్వడం వల్ల అమెరికా సైనిక సాయం అందిందని, అయినప్పటికీ ఈ నిర్ణయం తప్పేనని అన్నారు. దీనివల్ల ముజాహిదీన్ దళాలు పరాయివారయ్యారన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో సోవియెట్ వ్యతిరేక అమెరికా కార్యకలాపాల్లో భాగంగా రెండు దశాబ్దాల క్రితం ముజాహిదీన్ దళాలకు పాకిస్థానీ ఇంటెలిజెన్స్ సహాయపడిందన్నారు. విదేశీ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడేందుకు వారికి తాము శిక్షణ ఇచ్చామన్నారు. ఇది పవిత్ర యుద్ధమని, జీహాద్ అని అన్నారు. అమెరికన్లు దండయాత్ర చేయడంతో వారికి పాకిస్థాన్ ఓ విషయాన్ని చెప్తోందన్నారు. ‘‘అమెరికన్లకు వ్యతిరేకంగా పోరాడటం ఉగ్రవాదం అవుతోంది. కాబట్టి వారు మాకు వ్యతిరేకులయ్యారు. మమ్మల్ని సహభాగస్వాములంటున్నారు’’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption