ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా సీటీస్కాన్‌

ABN , First Publish Date - 2021-04-19T05:09:24+05:30 IST

కరోనా నిర్ధారణలో సిటీ స్కాన్‌ (కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ) పరీక్ష కీలకం. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న దశలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిటీస్కాన్‌ పరికరం మూలనపడింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా సీటీస్కాన్‌

- ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు పరుగులు

-  స్కానింగ్‌కు రూ.5,500 వసూలు 

- రిపోర్ట్‌కే రోజుకు రూ.55 లక్షలు వెచ్చిస్తున్న ప్రజలు 

- పేద, మధ్య తరగతి ప్రజల జేబులు ఖాళీ

- ఇద్దరు మంత్రులున్నా సమకూరని స్కానర్‌ 

(ఆంధ్రఽజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా నిర్ధారణలో సిటీ స్కాన్‌ (కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ) పరీక్ష కీలకం. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న దశలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిటీస్కాన్‌ పరికరం మూలనపడింది. దీంతో రోగులు ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రోగులను అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు దండుకొంటున్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చొరవచూపి ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీస్కాన్‌ పరికరాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

జిల్లాకు ఇద్దరు మంత్రులు. ఒకరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాగా, మరొకరు సాక్ష్యాత్తు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. ఈ ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహించే కరీంనగర్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రి ఐదు జిల్లాలకు రెఫరల్‌ ఆసుపత్రిగా పనిచేస్తున్నది. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందిన పేద, మధ్యతరగతి ప్రజలు అత్యవసర వైద్య సేవలకు ఈ ఆసుపత్రికే వస్తారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ జిల్లాల ప్రజలకు ఈ ఆసుపత్రే ప్రధాన దిక్కుగా మారింది. అలాంటి ఈ ఆసుపత్రిలో మూడేళ్ళుగా సీటీస్కాన్‌ మిషన్‌ మూలనపడి ఉంది. ఈ మిషన్‌ పనిచేయక పోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు వెళ్ళాల్సిన దుస్థితి నెలకొన్నది. కరోనా వ్యాధి నిర్ధారణలో సీటీస్కాన్‌ పరీక్షనే కీలకం. రోగి ఊపిరితిత్తులు ఏ మేరకు వ్యాధిబారినపడ్డాయి అన్నది నిర్ధారించడానికి సీటీస్కాన్‌ చేయిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పొందాల్సిన సీటీస్కాన్‌ పరీక్షకు ప్రైవేట్‌కు వెళ్ళాల్సి రావడంతో ఒకసారి స్కానింగ్‌ చేయించుకుంటే రూ.5,500 వెచ్చించాల్సి వస్తున్నది. ఒక్కో రోగి రెండేసి సార్లు కూడా సీటీస్కాన్‌ చేయించుకోవలసి రావడంతో రూ.11 వేలు ఖర్చు చేయాల్సిరావడంతో లబోదిబోమంటున్నారు. ఏడాది కాలంగా సుమారు 2,500 మంది ఇక్కడ కొవిడ్‌ చికిత్స పొందగా ప్రస్తుతం 100 మంది వరకు చికిత్స తీసుకుంటున్నారు. 

కరీంనగర్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 180 పడకలతో కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేశారు. 20 పడకలతో ఐసీయూను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 36 వెంటిలేటర్లను  సమకూర్చింది. 174 పడకలకు ప్రస్తుతం ఆక్సిజన్‌ సౌకర్యం ఉండగా మరో 30 పడకలకు  విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌లో రోజురోజుకు వ్యాధిగ్రస్తుల సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతున్నందున మరో 109 కొత్త పడకలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం 289 పడకల ద్వారా కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. కొవిడ్‌ చికిత్సకోసం అవసరమయ్యే మందులను అందుబాటులో ఉంచేందుకు కలెక్టర్‌ కె.శశాంక, ఆసుపత్రి సూపరింటెండెంట్‌, జిల్లా వైద్యాధికారి తరచూ సమీక్ష నిర్వహిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నా అత్యవసరమైన సీటీస్కాన్‌ మిషన్‌ లేకపోవడం పెద్ద లోటుగా పరిణమించింది. కదిలించడానికి వీలులేని రోగులకు స్కానింగ్‌ చేయకుండానే చికిత్సను అందించాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 2008లో సీటీస్కాన్‌ మిషన్‌ను నెలకొల్పారు. ఐదు సంవత్సరాలపాటు మిషన్‌ బాగానే పనిచేసింది. ఆ తర్వాత మరో ఐదేళ్ళు చిన్నపాటి రిపేర్లతో నెట్టుకు వచ్చారు. మూడేళ్ళుగా సీటీస్కాన్‌ మిషన్‌ పూర్తిగా పనికిరాకుండా పోయింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన టెక్నీషియన్లు పనికిరాదని తేల్చిచెప్పారు. అప్పటి నుంచి ఆసుపత్రి వర్గాలు పలుమార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి సీటీస్కాన్‌ మిషన్‌ సరఫరా కాలేదు. ఐదు జిల్లాలకు రెఫరల్‌ ఆసుపత్రిగా ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో కూడా సీటీస్కాన్‌ అవసరం ఎంతగానో ఉంటుంది. అలాంటి రోగులు కూడా ప్రైవేట్‌కే వెళ్ళి సీటీస్కాన్‌ చేయించుకోవలసి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో  ముఖ్యమైన పరీక్షల కోసం ప్రైవేట్‌కు వెళ్ళాల్సి రావడంతో వేలాది రూపాయల ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతున్నదని రోగులు వాపోతున్నారు. కొవిడ్‌ వ్యాధి విజృంభణ నేపథ్యంలో అత్యవసరంగా జిల్లా కేంద్ర ఆసుపత్రికి సీటీస్కాన్‌ మిషన్‌ను మంజూరీ చేయడంతోపాటు వెంటనే దానిని ఇన్‌స్టాల్‌ చేసి పనిచేయించాల్సిన అవసరముంది. 

- ప్రైవేట్‌లో రోజుకు రూ.55 లక్షలు వెచ్చిస్తున్న కరోనా రోగులు: 

జిల్లాలో కరోనా రోగ నిర్ధారణ చేయడానికి జిల్లా కేంద్ర ఆసుపత్రితోపాటు చల్మెడ వైద్య కళాశాల, విజయ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో మాత్రమే అవకాశమున్నది. ఈ కేంద్రాల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకుంటే 48 నుంచి 72 గంటల వరకు రిపోర్టు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల శాంపిల్స్‌ ఇక్కడ తీసుకున్నా వాటిని చల్మెడలో మినహా మిగతా సెంటర్ల వారు హైదరాబాద్‌కు పంపించి రిపోర్టును తెప్పిస్తున్నారు. దీనితో కరోనా వ్యాధి సోకిందని అనుమానమున్న వారు త్వరితగతిన రోగ నిర్ధారణ చేయించుకోవడానికి సీటీస్కాన్‌ను చేయించుకుంటున్నారు. దీంతో సీటీస్కాన్‌ కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. జిల్లాలో కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులతోపాటు 13 కేంద్రాలలో సీటీస్కాన్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ స్కానింగ్‌ సెంటర్లలో సగటున ఒక్కొక్క దానిలో రోజుకు 100 మంది స్కానింగ్‌ చేయించుకుంటున్నారని అనధికారిక సమాచారం. 13 సెంటర్లతో కలిపి సెంటర్‌కు వంద చొప్పున రోజుకు  1300 మంది పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిసింది. సగటున కనీసం రోజుకు వేయి మంది స్కానింగ్‌ చేయించుకున్నా రూ.5,500 చొప్పున 55 లక్షల రూపాయలు ప్రజలు ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు చెల్లిస్తున్నారు. గడిచిన నెలరోజులుగా జిల్లాలో సుమారు 20 కోట్ల రూపాయలు సీటీస్కాన్‌ పరీక్షల కోసం ప్రజలు వెచ్చించాల్సి వచ్చిందని లెక్కలు వేస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ జిల్లా వైద్యాధికారులు, ప్రైవేట్‌ ఆసుపత్రుల యజమాన్యాలు, ఐఎంఎ ప్రతినిధులతో సమావేశం నిర్వహించగా ఐఎంఎ ప్రతినిధులు సీటీస్కాన్‌ పరీక్షను 3వేల రూపాయలకే చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించడం గమనార్హం. సీటీస్కాన్‌ చేయించుకున్న సమయంలో స్కానింగ్‌ సెంటర్లు కేవలం రిపోర్టు మాత్రమే ఇస్తూ అందుకు సంబంధించిన ఫిల్మ్‌ను కూడా ఇవ్వడం లేదు. సీటీస్కాన్‌ పరీక్షలకు 2వేల రూపాయలకు మించి ఖర్చు కాదని, అయినా ఐఎంఎ సూచించిన విధంగా కనీసం 3వేల రూపాయలకైనా పరీక్షలు నిర్వహించేలా కలెక్టర్‌ ఆదేశాలిచ్చి పేద, మధ్య తరగతి ప్రజలను అప్పులపాలు కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.  

Updated Date - 2021-04-19T05:09:24+05:30 IST