Abn logo
Sep 22 2021 @ 23:25PM

హడావుడి చేసి.. వదిలేశారు!

పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద షాపులు తొలగించిన దృశ్యం, రోడ్డుపైకి చేరిన మురుగునీరు

- మూడు నెలలవుతున్నా అతీగతి లేని పనులు

- రోడ్డుపైనే మురుగు నీరు

- ఇబ్బందిపడుతున్న వ్యాపారులు

- ఇదీ కేటీ రోడ్డు విస్తరణ పరిస్థితి


(పలాస)

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని కేటీ రోడ్డులో రెండు కిలోమీటర్ల పొడవునా కాలువలు, ఫుట్‌పాత్‌, రహదారి విస్తరణకు మూడునెలల కిందట అధికారులు హడావుడి చేశారు. వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా ప్రజా అవసరాల కోసమని అధికారులు నచ్చజెప్పడంతో విస్తరణకు అంగీకరించారు. ఈ క్రమంలో విస్తరణకు అవసరమైన మేర దుకాణాలు, ఇళ్లను తొలగింపు పనులు చేపట్టారు. నెల రోజుల కిందట మంత్రి సీదిరి అప్పలరాజు శంకుస్థాపన చేశారే తప్ప నేటివరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు ధ్వంసం కావడంతో మురుగునీరంతా రోడ్లకి వచ్చేస్తోంది. వర్షం కురిస్తే వ్యాపారులు బిక్కుబిక్కుమని కాలం వెల్లబుచ్చుతున్నారు. మూడు నెలలవుతున్నా ఈ విస్తరణ పనుల్లో అతీగతీలేదని పలువురు వాపోతున్నారు.


కళావిహీనంగా కేటీ రోడ్డు

విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయామన్న బాధకన్నా మురుగు నీటితోనే ఇబ్బంది పడుతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేటీ రోడ్డంతా శిథిలమైన భవనాలతో కళావిహీనంగా మారింది. కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు నిర్వహించాల్సిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం మురుగునీరు, భవనాల శిథిలాల  నిలయంగా మారింది.


పనులపై నీలినీడలు

పట్టణ సుందరీకరణలో భాగంగా ఫుట్‌పాత్‌ నిర్మాణానికి మునిసిపాలిటీ రూ.3కోట్లు  కేటాయించింది. 66 అడుగుల వెడల్పు ఉన్న రహదారిని 80 అడుగులకు పొడిగించారు. అక్కడక్కడ నిబంధనలు ఉల్లంఘించి కొలతల్లో కొంత తేడా ప్రదర్శించారు. అయితే విస్తరణ అనంతరం పది రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని అంతా భావించారు. పనుల కోసం  మంత్రి  అప్పలరాజు సైతం కొబ్బరికాయ కొట్టారు. టెండరు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో పనులపై నీలినీడలు అలముకున్నాయి. టెండర్లు పూర్తవడానికి ఇంకా 20రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉండడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న కొలతల మేరకే తాము షాపులు పునర్మిర్నించు కోవ డంపై అధికారులను ప్రశ్నిస్తున్నారు. షాపులు కూలగొట్టడంతో ఇంకా శిథిలాల మధ్యే వ్యాపారాలు కొనసాగుతున్నాయి.


రెండురోజుల్లో పనులు...

రెండు రోజుల్లో పనులు చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీచేశామని మునిసిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు.