ఐదేళ్లైనా అద్దె భవనంలోనే..!

ABN , First Publish Date - 2021-05-08T05:40:43+05:30 IST

ఐదేళ్లైనా అద్దె భవనంలోనే..!

ఐదేళ్లైనా అద్దె భవనంలోనే..!
అద్దె భవనంలో కొనసాగుతున్న కడ్తాల మండల పరిషత్‌ కార్యాలయం

  •  సొంత భవనానికి నోచుకోని కడ్తాల మండల పరిషత్‌ కార్యాలయం
  •  అసౌకర్యాల అద్దె భవనంతో అధికారులు, ప్రజల ఇబ్బందులు
  •  నిర్మాణానికి చొరవ చూపని ప్రజాప్రతినిధులు, అధికారులు 

కడ్తాల : మండల పరిషత్‌ కార్యాలయానికి సొంత భవనం లేక ఐదేళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. సొంత భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు. శ్రీశైలం-హైద్రాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న కడ్తాల మండల పరిషత్‌కు సొంత భవనం లేక ఇబ్బందిగా మారింది. ప్రజాప్రతినిధులపై మండల ప్రజలు ఒత్తిడి తెస్తున్నా పట్టించుకోవడం లేదు. కార్యాలయానికి అనుగుణంగా లేని భవనంతో అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలనా సౌలభ్యం కోసం 2016 అక్టోబర్‌ 11న ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి ఆమనగల్లు మండలంలో ఉన్న కర్కల్‌పహాడ్‌, మైసిగండి, వాసుదేవ్‌ పూర్‌, కడ్తాల, ఎక్వాయిపల్లి, ముద్విన్‌, చరికొండ, తలకొండపల్లి మండలంలోని చల్లంపల్లి, మక్తమాదారం, రావిచెడ్‌, సాలార్‌పూర్‌, న్యామతాపూర్‌ గ్రామ పంచాయతీలను కలిపి కడ్తాలను నూతన మండల కేంద్రంగా ఏర్పాటైంది. కాగా 11 పాత పంచాయతీలతోపాటు 2018లో కొత్తగా 13 పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కడ్తాల కేంద్రం మొత్తం 24 పంచాయతీకు చేరింది. కాగా మండలానికి ప్రధాన కేంద్రమైన మండల పరిషత్‌కు సొంత భవనం లేకపోవడం సమస్యగా మారింది. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. భవనానికి అనువైన స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఎవరూ పట్టించుకోవడం లేదు

కడ్తాలను మండల కేంద్రంగా ఏర్పాటు చేసి ఐదేళ్లు గడిచినా నేటికీ ఆశించిన అభివృద్దికి నోచుకోలేదు. మండల కేంద్రంగా ఏర్పాటు చేయడమే తప్ప మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కేటాయింపు, సదుపాయాల కల్పనలో మండలం నిర్లక్ష్యానికి గురౌతోంది. మండల పరిషత్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు కేటాయించి భవనాలు నిర్మించాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలి.

- చేగూరి వెంకటేశ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌, కడ్తాల్‌ 

భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం

నూతన కార్యాలయానికి స్థలం కేటాయింపు, భవన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి వినతిపత్రం అందజేశాం. మండల పరిషత్‌తో పాటు అన్ని కార్యాలయాలకు వీలైనంత త్వరగా నూతన భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాం.

- కమ్లీమోత్యనాయక్‌, ఎంపీపీ, కడ్తాల్‌

Updated Date - 2021-05-08T05:40:43+05:30 IST