కేరళ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2021-04-16T20:22:08+05:30 IST

ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వానికి శుక్రవారం

కేరళ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

తిరువనంతపురం : ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఒత్తిడి చేసినట్లు నమోదైన రెండు కేసులను హైకోర్టు రద్దు చేసింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నేరాన్ని అంగీకరించాలని అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. 


తమ శాఖ అధికారులపై నమోదైన కేసులను రద్దు చేయాలని, లేదా, సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) చేత దర్యాప్తు చేయించాలని ఈడీ కోరింది. కేరళ పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తు ఓ ప్రహసనమని ఆరోపించింది. 


కేరళ పోలీసులు గత నెలలో ఈడీ అధికారులపై రెండు కేసులను నమోదు చేశారు. బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ మాట్లాడినట్లు చెప్తున్న ఓ ఆడియో క్లిప్ ఆధారంగా ఓ కేసును, మరొక నిందితుడు జిల్లా కోర్టుకు రాసిన లేఖ ఆధారంగా మరొక కేసును నమోదు చేశారు. స్వప్న సురేశ్‌ను ఈడీ అధికారులు 2020 ఆగస్టు 12, 13 తేదీల్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమెపై ఈడీ అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు ఈ ఆడియో క్లిప్‌లో వినిపించింది.


ముఖ్యమంత్రి విజయన్ వద్ద గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన ఎం శివశంకర్‌తో కలిసి తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళినట్లు అంగీకరించాలని తనను ఈడీ అధికారులు ఒత్తిడి చేశారని స్వప్న ఆరోపించారు. ముఖ్యమంత్రి కోసం ఆర్థిక చర్చలు జరిపేందుకు శివశంకర్‌తో కలిసి తాను యూఏఈ వెళ్ళినట్లు అంగీకరించాలని, సీఎం విజయన్‌తోపాటు మరికొందరు మంత్రుల పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.  శివశంకర్ కూడా బంగారం అక్రమ రవాణా కేసులో నిందితుడే. 


మరొక నిందితుడు సందీప్ నాయర్ ఎర్నాకుళం జిల్లా కోర్టుకు లేఖ రాశారు. బంగారం అక్రమ రవాణా కేసులో ముఖ్యమంత్రి విజయన్ పేరు చెప్పాలని తనపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. 


వీరిద్దరి ఆరోపణలపైనా కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర),  167 (హాని చేయాలనే ఉద్దేశంతో సరైనది కానటువంటి పత్రాన్ని ప్రభుత్వాధికారి రూపొందించడం), 192 (తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం), 195-ఏ (తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని ఏ వ్యక్తినైనా బెదిరించడం) ప్రకారం ఈడీ అధికారులపై కేసులు నమోదు చేశారు. 


స్వప్న సురేశ్ కేరళలోని యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగిని. 30 కేజీల బంగారం అక్రమ రవాణా కేసులో ఆమె నిందితురాలు. ఈ బంగారం విలువ రూ.14.82 కోట్లు ఉంటుంది. ఆమె ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసుపై ఈడీ, కస్టమ్స్, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్నాయి. 



Updated Date - 2021-04-16T20:22:08+05:30 IST