Abn logo
Apr 9 2020 @ 00:34AM

ఆపద వేళ, కొన్ని అనుబంధ దృశ్యాలు!

భారతీయుల రోగనిరోధక శక్తి ఏమంత చెప్పుకోదగింది కాదు. బహుశా కొన్ని జీవశాస్త్ర కారణాల వల్ల, ఇంకా నిరూపణ కాని నిరోధాల వల్ల – కరోనాకు మనదేశంలో పెద్ద సంఖ్యలో ఆహారం దొరకలేదు. అందులో మన ఘనత ఏమీ లేదు. నిజంగా కరోనా విజృంభిస్తే అందుకు తగిన సన్నద్ధత లేకపోవడం మాత్రం మన ఘనతే. గత డెబ్భై సంవత్సరాల పాలకుల ఘనతే.


నిజంగా యుద్ధం చేయకుండానే, ఒక యుద్ధవాతావరణాన్ని కల్పించింది కరోనా ముప్పు. ఇందులో ప్రజలకు ఉద్వేగపరిచే సాంప్రదాయిక బాహ్య శత్రువు లేకపోయినా, ఆత్మరక్షణ, సామూహిక దీక్ష వంటి గుణాలు యుద్ధకాలం నాటి మానసిక స్థితిని దేశపౌరులలో తీసుకువచ్చాయి. ఒక ‘ఇతరుడు’ కూడా సమకూరాడు. దేశమంతటికీ ఒకే విపత్తు. ఒకరే నాయకుడు. అనుసంధానం పూర్తయింది. ఈ సన్నివేశం రేపు ‘సాధారణ’ పరిస్థితులు నెలకొన్న తరువాత, ఎందుకు ఉపయోగ పడుతుంది? బహుశా, రాజ్యాంగం, రాజ్య వ్యవస్థ అన్నీ రూపు మార్చుకుంటాయి. అదునులో ఎవరైనా ఎందుకు వదులుకుంటారు?


లాక్‌డౌన్‌కు అందరూ వన్స్‌మోర్‌ కొడుతున్నారు. మరో మార్గం లేదు మరి. మరొక్క విడత, వారమో, రెండువారాలో, ఏకంగా నెలరోజులో–– ఈ స్థితి తప్పకపోవచ్చు. ఎవరో విధించడమో ఎత్తివేయడమో కాదు, నమ్మకం కలిగితేనే నిజంగా సందడి పెరిగేది. పాజిటివ్‌లు తగ్గిపోతుంటే, కరోనా తగ్గుముఖం పడుతుంటే, సొరంగం చివర వెలుతురు కనిపించవచ్చు. తగ్గిపోతుంది. కనిపిస్తుంది. అది ఖాయం. ఆశ కాదు. కేవలం ఊహ కాదు. అనాది నుంచి లక్షలకోట్ల సమాధులను మోస్తున్న భూదేవి సాక్షిగా, ఈ గండం గట్టెక్కుతాం. అందరూ కాకపోయినా చాలామంది కరోనానంతర భవిష్యత్తు చూస్తారు. అది ఎట్లా ఉంటుంది? కరోనా ముందున్నట్టే ఉంటుందా? తరువాత ప్రపంచం ఏమిటి? ఎట్లా? 


అందరూ ఇళ్లలోనో, గూళ్లల్లోనో, శిబిరాల్లోనో కాళ్లు కట్టేసుకుని కూర్చున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, చాలా ప్రపంచం నడుస్తూనే ఉన్నది. స్థాణువై పోయి నిలబడింది కానీ, దాని ఇరుసుల శబ్దం వినిపిస్తూనే ఉన్నది. లోకపు రీతీ రూపమూ అన్నీ కొనసాగుతున్నాయి, లోలోపల మారుతూనూ ఉన్నాయి. ఒక నిశ్చల ఛాయాచిత్రం అడుగున వెలుగునీడలు కదులుతూనే ఉన్నాయి. నిశ్చేష్టమైన రంగస్థలం మీద పాత్రలు మనకు వినపడని సంభాషణలేవో సాగిస్తున్నాయి. ఒక్కసారి వెలుతురు రాగానే, ఒక్కసారి కదలిక తేగానే మార్పు మిరిమిట్లు గొలుపుతుంది. మనుగడకు కొత్త వ్యాకరణం కావాలి. భాషలన్నిటికీ కొత్త నిఘంటువులు కావాలి. వల్లె వేసిన మాటలన్నీ ఇప్పుడు రద్దు. కరెన్సీ రద్దు చేసినప్పటి వలె, నీ దగ్గర చెల్లని డబ్బు చాలా మిగులుతుంది. ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలు కాకపోవచ్చు. ఏమో, కొత్త సవారీ నేర్చుకున్నవారి గుర్రం ఎగరావచ్చు.


విడియో కాన్ఫరెన్స్‌ అంటే మొదట చంద్రబాబే గుర్తొస్తాడు. జిల్లా స్థాయి అధికారులందరూ పొద్దున్నే లేచి, ముస్తాబు చేసుకుని మరీ విడియో మీటింగుకు వెళ్లాల్సివచ్చేది. పాలన కేంద్రీకరణ అంతగా అవసరమా, డేష్‌బోర్డు మీద ఉద్యోగుల అటెండెన్స్‌ ముఖ్యమంత్రి తెలుసుకోవడం అవసరమా? అన్న సందేహాలుండేవి. డిజిటల్‌ సాధనాలకు, ప్రజాస్వామ్యానికి పొంతన కుదురుతుందా, నాయకుడికి, ఎగ్జిక్యూటివ్‌కు ఉండవలసిన తేడాలు, సమాన లక్షణాలు ఏమిటి– అనే చర్చ కూడా ఒక కాలంలో జరిగేది. ఒక రాష్ట్రస్థాయి నాయకుడు మొత్తం పరిపాలనపై తన శ్రద్ధను, పట్టును చూపించ డానికి ఆస్కారమిచ్చే ఆ విడియో సమావేశం ఇప్పుడు జాతీయస్థాయికి ఎదిగింది. నరేంద్ర మోదీ రాజధానిలో కూర్చుని యావత్‌ భారతదేశ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని విడియో కెమెరాల ముందుకు రప్పించి, ఒక విపత్కరపరిస్థితి గురించిన సమీక్ష చేస్తున్నారు. సూచనలు చేస్తున్నారు, వింటున్నారు కూడా. లోలోపల అంచనాలు, మార్కులు వేస్తున్నారు కూడా. ముఖ్యమంత్రులు కూడా తమ పనితీరు ద్వారా ప్రధానిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రేప్పొద్దున్న ఆర్థిక సహాయం కావాలంటే కేంద్రం మీదనే ఆధారపడాలి కదా, సరైన పనితీరు లేకపోతే సహాయమూ రాదు, కేంద్రజోక్యమూ పెరిగిపోవచ్చు. ఒక పరిస్థితి మీద యావత్‌ దేశానికి ఒకే సందేశాన్ని, ఒకే కార్యక్రమాన్ని, ఒకే సమీక్షను చేయగలిగే అవకాశం మునుపు భారతదేశంలో ఎప్పుడూ రాలేదు. అది భారతదేశపు వైవిధ్యం కావచ్చు, అభివృద్ధిలోను, రాజకీయ స్థితిగతులలోను ఉన్న తారతమ్యాలు కావచ్చు, అందరికీ ఒకే విపత్తో, సందర్భమో ఒకేసారి రాకపోవచ్చు. ముఖ్యమంత్రులతో పాలనాపరమైన అంశాల గురించి మాట్లాడటమొక్కటే కాదు, దేశప్రజలతో ముఖాముఖి ఉద్వేగపరమైన అంశాలను పంచుకుంటూ, సూచనలు సందేశాలు ఇస్తూ, ఒక కార్యక్రమాన్నో లేదా హోమ్‌వర్క్‌నో ఇస్తున్నారు కూడా. ఇప్పుడంటే సరే, విపత్తు పరిస్థితి. మరి, కరోనా వెళ్లిపోయిన తరువాత కూడా ఈ నూతన ప్రక్రియ కొనసాగుతుందా? కొనసాగితే, అందులో ఏదో ఒక అవాంఛనీయత కనిపించదా? ఫెడరలిజం పలచబడినట్టు అనిపించే అవకాశం లేదా? ప్రధానమంత్రికి ప్రజలకు నేరుగా ఏర్పడే ఒక సంభాషణ, మన ఎన్నికల వ్యవస్థలో మార్పుతెచ్చే అవకాశం ఉందా? అటువంటి ఆలోచనలు ఎవరికైనా వస్తున్నాయా? అధ్యక్షపాలనా వ్యవస్థ దిశగా వెళ్లాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనుకుంటే అందుకు ఒక అనుకూల పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తున్నది.


రెండవ దఫా ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చీ రాగానే చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోసాగింది. కీలకనిర్ణయాల తరువాత, జమిలి ఎన్నికల ఆలోచనను ముందుకు తోయాలని కూడా అనుకున్నారు. 2023లోనో, ఆ మరుసంవత్సరమో కీలకమయిన మార్పులకు ఆస్కారమిచ్చే మరో ఘనవిజయాన్ని సాధించాలన్నది కేంద్ర అధికారపార్టీ వ్యూహకర్తల ఆలోచనగా వింటూ వచ్చాము. కానీ, మరోవైపు ఆర్థికరంగంలో వైఫల్యం పెరిగిపోతున్నది. కొన్ని రాష్ట్రాలలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. పదినెలల కిందట ఘనవిజయం సాధించినప్పటి రేటింగ్‌ తగ్గిపోతున్నది. ఆ సమయంలో కరోనా విపత్తు వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే, ఈ యాదృచ్ఛిక విపత్తులో, జాతీయ అధికారశ్రేణికి అయాచిత లాభం కూడా చేకూరింది. వరుణుడు తమ పార్టీలో ఉన్నాడని వై.ఎస్‌. అనేవారు, ఇప్పుడు కాలచక్రమే బిజెపిలో చేరినట్టు కనిపిస్తున్నది. 1897 నాటి విపత్తుల చట్టమే విశ్వరూపం ధరించి, సమస్తాన్నీ కేంద్రం అధీనంలోకి తెస్తున్నది. 


ఎప్పుడైనా తీవ్రజాతీయవాదానికి అత్యంత అనుకూల పరిస్థితి శత్రుదేశంతో యుద్ధమే. దేశప్రజలందరినీ అది అనివార్యంగా ఒక్కటి చేసి, నాయకత్వానికి గట్టి మద్దతును ఇచ్చేట్టు చేస్తుంది. నిజంగా యుద్ధం చేయకుండానే, ఒక యుద్ధవాతావరణాన్ని కల్పించింది కరోనా ముప్పు. ఇందులో ప్రజలను ఉద్వేగపరిచే సాంప్రదాయిక బాహ్య శత్రువు లేకపోయినా, ఆత్మరక్షణ, సామూహిక దీక్ష వంటి గుణాలు యుద్ధకాలం నాటి మానసిక స్థితిని దేశపౌరులలో తీసుకువచ్చాయి. కీలకనిర్ణయాలు తీసుకోవడం మినహా, ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా చేసేది ఏమీ ఉండదు. క్షేత్రస్థాయిలో చేయవలసిందంతా రాష్ట్ర ప్రభుత్వాల నేతలూ, సిబ్బందే. అయినప్పటికీ, తానే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్టు జనంలో ఒక అభిప్రాయాన్ని నరేంద్రమోదీ కల్పించగలిగారు. చప్పుళ్లు చేయడం, దీపాలు వెలిగించడం కొత్తవీ కాదు, అభ్యంతరపెట్టవలసినవీ కావు కానీ, ముఖ్యమంత్రులందరూ వినయంగా ఆ కార్యక్రమాలను పాటించడం ఏదో కొత్త పరిస్థితిని స్ఫురింపచేశాయి.


హైడ్రాక్సి క్లోరోక్విన్‌ విషయంలో ప్రపంచానికి మనం దాతలు కాగలగడంతో భారతీయులు అరుదైన గర్వభావాన్ని పొందగలిగారు. ఎంతగా నైరూప్య శత్రువుతో పోరాటమని చెప్పినా, భౌతిక శత్రువు ఒకరుంటే, జాతీయవాదానికి లభించే ఊతమే వేరు. ఎటువంటి ప్రయత్నం లేకుండా, ఏ నాయకుడూ కుట్ర చేయకుండా, మర్కజి సమావేశం రూపంలో ఒక సంకేతాత్మక ‘ప్రతి నాయకుడు’ ఈ కథనానికి లభించారు. పాపం, ఇందులో జాతీయ అధికార పార్టీ ప్రమేయం ఏమీ లేదు. అగ్రనేతలు ఎక్కడా, ఒక మతవర్గాన్ని నిందించడం కానీ, వ్యాధి వ్యాప్తికి వారిని బాధ్యులు చేయడంగానీ చేయలేదు. వారంతా నిగ్రహంగానే ఉన్నారు. కానీ, కాగల కార్యం ఢిల్లీ కార్యక్రమం రూపంలో జరిగిపోయింది. ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నవారి నేరం ఏమీ లేకపోయినా, వారే వ్యాధికీ బాధితులయ్యారు, వ్యాప్తికీ విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ విమర్శలను తీవ్రస్థాయికి తీసుకువెళ్లడానికి సోషల్‌మీడియా ఉండనే ఉన్నది. అప్రయత్నంగానే కరోనాలో వచ్చి చేరిన ద్వేషం, కొందరి ప్రయత్నంతో పెనుజ్వాలై రకరకాల ప్రతిఫలనాలను ఇస్తున్నది. ఏమైతేనేం, ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఒక ‘ఇతరుడు’ కూడా సమకూరాడు. దేశమంతటికీ ఒకే విపత్తు. ఒకరే నాయకుడు. అనుసంధానం పూర్తయింది. ఈ సన్నివేశం రేపు ‘సాధారణ’ పరిస్థితులు నెలకొన్న తరువాత, ఎందుకు ఉపయోగపడుతుంది? బహుశా, రాజ్యాంగం, రాజ్యవ్యవస్థ అన్నీ రూపుమార్చుకుంటాయి. అదునులో ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? 


మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా, కొత్త దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. మళ్లీ దేశాల మధ్య రాకపోకలు అంత సులువుగా మొదలుకావు. విదేశీయులపై ఆంక్షలు ప్రతిదేశంలోనూ పెరిగిపోతాయి. ప్రపంచీకరణ విలోమీకరణ చెంది, సరిహద్దులు, కంచెలు పెరిగిపోతాయి. మొదటి రెండు ప్రపంచయుద్ధాలు రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని కూల్చివేసి, అమెరికా–సోవియెట్‌ యూనియన్‌ అనే జంట అగ్రరాజ్యాలను సృష్టించాయి. కరోనా పూర్తిగా సద్దుమణిగే సమయానికి చైనా స్థాయి మునుపటి కంటె చాలా పెరిగిపోతుంది. బహుశా, భారత్‌ కూడా చైనాతో కలసి ఉంటేనే మెరుగని నిర్ణయానికి వచ్చి, రష్యా–చైనా కూటమిలో చేరిపోవచ్చు. అతి తక్కువ ప్రాణనష్టంతోనే భారత్‌ ఈ గండం నుంచి బయటపడితే, అది దేశవాసులలో గొప్ప ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది. మన పురాతన సంస్కృతీ, ఆచారాలు, జీవనవిధానమే మనకు రక్ష అంటూ మీడియాలో ఊదరగొడుతున్నవారు, ఈ విజయాన్ని తమఖాతాలో వేసుకుంటారు. నిజానికి భారతదేశంలో అతిసారం, విషజ్వరాలతో వేలాదిమంది ఏటా చనిపోతున్నారు. భారతీయుల రోగనిరోధక శక్తి ఏమంత చెప్పుకోదగింది కాదు. బహుశా కొన్ని జీవశాస్త్ర కారణాల వల్ల, ఇంకా నిరూపణ కాని నిరోధాల వల్ల – కరోనాకు మనదేశంలో పెద్ద సంఖ్యలో ఆహారం దొరకలేదు. అందులో మన ఘనత ఏమీ లేదు. నిజంగా కరోనా విజృంభిస్తే అందుకు తగిన సన్నద్ధత లేకపోవడం మాత్రం మన ఘనతే. గత డెబ్భై సంవత్సరాల పాలకుల ఘనతే.


కె. శ్రీనివాస్