తాను మరణించి ఆరుగురి ప్రాణాలను కాపాడిన మహిళ

ABN , First Publish Date - 2021-01-13T16:53:36+05:30 IST

యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చి కుటుంబంతో ఆనందంగా గడపాలని అనుకుంది. కానీ విధి ఆడిన నాటకంలో తిరిగి రాని లోకాలకు

తాను మరణించి ఆరుగురి ప్రాణాలను కాపాడిన మహిళ

న్యూఢిల్లీ: యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చి కుటుంబంతో ఆనందంగా గడపాలని అనుకుంది. కానీ విధి ఆడిన నాటకంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూఏఈలో టీచర్‌గా పనిచేసిన సయ్యద్ రఫత్ పర్వీన్(41) సెలవులు అని డిసెంబర్‌లో తన ఇద్దరి పిల్లలతో న్యూఢిల్లీ వచ్చింది. ఇక్కడ తన కుటుంబంతో ఆనందంగా గడిపి తిరిగి యూఏఈకి వెళ్లాలని అనుకుంది. కానీ.. డిసెంబర్ 19న ఆమెకు ఒక్కసారిగా తలనొప్పి రావడంతో సీటీ స్కాన్‌కు వెళ్లింది. అప్పుడే తెలిసింది ఆమె బ్రెయిన్ అన్యూరిజం అనే వ్యాధితో బాధపడుతున్న విషయం. 


అప్పటి నుంచి ఆస్పతిలోనే చికిత్స పొందుతూ వచ్చిన పర్వీన్ డిసెంబర్ 24న బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆమె పిల్లలకు తల్లి గురించి ఏం చెప్పాలో తెలియక కుటుంబసభ్యులు, భర్త ఆవేదన చెందారు. తమ కూతురు చనిపోయినా వేరొకరి రూపంలో బతికే ఉండాలని అనుకున్న కుటుంబ సభ్యులు, భర్త ఆమె అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా పర్వీన్ అవయవాలు ఆరుగురి ప్రాణాలను నిలబెట్టాయి. ఇద్దరికి కంటి చూపు రావడానికి పర్వీన్ కారణమైంది. తన భార్య తమకు దూరమైందనే బాధ ఒకవైపు ఉన్నా.. ఆమె అవయవాల వల్ల ఆరుగురి ప్రాణాలు నిలబడటం ఆనందంగా ఉందని పర్వీన్ భర్త తెలిపాడు.

Updated Date - 2021-01-13T16:53:36+05:30 IST