జిల్లాలో జోరుగా అధికార జూదం

ABN , First Publish Date - 2021-07-26T05:37:05+05:30 IST

జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. క్లబ్బులు మూసివేశామని, ఆన్‌లైన్‌లో రమ్మీ ఆట కట్టించామని ప్రభుత్వం గొప్పులు చెప్పుకుంటుండగా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అవకాశాన్ని ఆసరా చేసుకొని వైసీపీ నేతలు పేకాట కేంద్రాలను నడుపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో లాడ్జిలు, అపార్ట్‌మెంట్లలో జూదం నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు, కోళ్ల ఫారాలు, పారిశ్రామిక భవనాలను డెన్‌లుగా మార్చారు. ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలతో పోలీసులు లాలూచీ పడి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.

జిల్లాలో జోరుగా  అధికార జూదం

పట్టణాల్లో లాడ్జిలు, 

అపార్ట్‌మెంట్లలో నిర్వహణ

పల్లెల్లో అడ్డాలుగా కొండప్రాంతాలు, 

పొలాలు, కోళ్ల ఫారాలు

పారిశ్రామిక భవనాల్లోనూ స్థావరాలు

సెలవు రోజుల్లో రూ.కోట్లలో ఆట

అనేక చోట్ల నిర్వాహకులుగా 

వైసీపీ నాయకులు 

పోలీసుల కనుసన్నల్లో సాగుతున్న వైనం 

అడపాదడపా దాడులతో మమ 

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

జిల్లాలో జూదం జూలు విదుల్చుతోంది. రోజుకు రూ.కోట్లలో చేతులు మారుతోంది. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో అది తారస్థాయిలో ఉంటోంది. కొన్ని చోట్ల ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ ఆట కొనసాగుతోంది. అన్ని ప్రాతాల్లోనూ పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. వీటిలో అత్యధిక చోట్ల వైసీపీ నేతల ప్రత్యక్ష ప్రమేయం ఉండగా, మరికొన్ని చోట్ల వారి అండదండలతో కొందరు నిర్వహిస్తున్నారు. పోలీసుల లాలూచీ వ్యవహారం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనుమానం రాకుండా అడపాదడపా దాడులతో చేతులు దులుపుకుంటున్నారు. క్లబ్బులు మూసేశాం, జూదప్రియులను అరికట్టామని ప్రభుత్వం మాటలు చెప్పుకోటానికే తప్ప ఆచరణలో గతానికి మించిన స్థాయిలో పేకాట సాగుతోంది. జూద గృహాలు, శిబిరాలు నిర్వహిస్తూ వైసీపీ నేతలు రూ.లక్షలు గడిస్తుండగా పేకముక్కల్లో చిక్కి రాజు, రాణి, ఆసులతో సహవాసం చేస్తూ అనేక మంది జోకర్లుగా మారుతున్నారు. ఆర్థికంగా చితికిపోయి పచ్చని కాపురాలను గుల్ల చేసుకుంటున్నారు.  


జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. క్లబ్బులు మూసివేశామని, ఆన్‌లైన్‌లో రమ్మీ ఆట కట్టించామని ప్రభుత్వం గొప్పులు చెప్పుకుంటుండగా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అవకాశాన్ని ఆసరా చేసుకొని వైసీపీ నేతలు పేకాట కేంద్రాలను నడుపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో లాడ్జిలు, అపార్ట్‌మెంట్లలో జూదం నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు, కోళ్ల ఫారాలు, పారిశ్రామిక భవనాలను డెన్‌లుగా మార్చారు. ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలతో పోలీసులు లాలూచీ పడి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆంధ్రజ్యోతి బృందం ఒక పరిశీలన చేయగా ఈ విషయం తేటతెల్లమైంది. ఆదివారం వస్తే కోట్ల రూపాయలు చేతులుమారుతున్నాయి. మిగిలిన రోజుల్లో వారానికి రెండు రోజులు అత్యధిక మండలాల్లో జూదకేంద్రాలు నడుస్తున్నాయి. అడపాదడపా పోలీసులు కొన్ని కేంద్రాల మీద దాడులు చేసి మిన్నకుంటున్నారు. గత కొంతకాలంగా జిల్లాలో అధికారపార్టీ నేతల సహకారం  ఉండి నడుస్తున్న పెద్ద కేంద్రాలలో ఒకటి రెండు మాత్రమే పట్టుబడిన దాఖలాలున్నాయి. భారీస్థాయిలో కోతముక్క ఆడుతున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులున్న కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు న్నాయి. జూద కేంద్రాల నిర్వహణ, సహకారం ద్వారా అధికార పార్టీ నేతల జేబులు పుష్కలంగా నిండుతున్నట్లే పోలీసులకు కూడా భారీ మొత్తంలోనే ముడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

సరిహద్దు ప్రాంతాల్లో జోరుగా నిర్వహణ

జిల్లాకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న అన్నివైపులా పేకాట కేంద్రాలు జోరుగా  నడుస్తున్నాయి. ఇటు నెల్లూరు, అటు కర్నూలు, మరోవైపు రెండు ప్రాంతాలకు సరిహద్దు ఉన్న గుంటూరు జిల్లా బోర్డర్‌లలో ఉన్న పేకాట కేంద్రాలకు డిమాండ్‌ అధికంగా ఉంది. మూడు జిల్లాలకు చెందిన జూదరులు ఈ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రకాశం జిల్లా పరిధిలో ఆట ఆపేసిన రోజున వీరికి అటు పక్క జిల్లాల పరిధిలో నిర్వహణకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. యద్దనపూడి, చీరాల, కురిచేడు, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల పరిధిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలకు మనజిల్లాతోపాటు గుంటూరు జిల్లా జూదరులు,  గిద్దలూరు ప్రాంతంలో కర్నూలు జిల్లాలోని నంద్యాల ప్రాంతం వారు, ఉలవపాడు, గుడ్లూరు, పామూరు ప్రాంతాలకు నెల్లూరు జిల్లాకు చెందిన వారు వచ్చి పేకాట ఆడుతున్నారు. ఆ ప్రాంతాల్లో రెండు జిల్లాలకు చెందిన అధికార పార్టీ నేతలు ఐక్యంగా పోలీసులను లోబర్చుకొని కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల యద్దనపూడి పోలీసులు పట్టుకున్నట్లు చెబుతున్న పేకాట కేంద్రం నిర్వహణ లోను ఇటు మన జిల్లా, అటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నాయకులు ప్రధాన పాత్రదారులు కావటం, జూదరుల్లోనూ రెండు జిల్లాలవారు ఉండటం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.  

పట్టణాల్లో లాడ్జిలు, అపార్ట్‌మెంట్లు  

జిల్లాలోని ఒంగోలు నగరంతోపాటు, పట్టణాల్లో లాడ్జిలు, కొన్ని అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు పేకాట డెన్‌లుగా మారిపోయాయి. లాడ్జిలు ఉన్న ప్రతి పట్టణంలోనూ రెండు మూడింటిలో మూడు నాలుగు  గదుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. ఒంగోలులో అయితే కొన్ని లాడ్జిలలో ప్రత్యేక నిఘాతో జూదకేంద్రాలు నిర్వహిస్తున్నారు. పలు అపార్ట్‌మెంట్లలో ఆయా సంస్థల పేరుతో ఆఫీసులు, అతిథి గృహాల కోసం తీసుకున్న ప్లాట్లను జూదగృహాలుగా మార్చారు. చీరాలలో వైసీపీతో సంబంధం ఉన్న యజమానులకు చెందిన మూడు లాడ్జిలలో భారీ పందేలతో పేకాట నడుస్తోంది. మార్కాపురం, కందుకూరు, కనిగిరి ఇలా అన్ని పట్టణ  ప్రాంతాల్లోనూ అధికార పార్టీ నేతల అండదండలతో పేకాట కేంద్రాలు  నడుస్తున్నాయి. మార్కాపురం,  పొదిలిల్లోన్ని లాడ్జిల్లోనూ పేకాట నిర్వహణ శృతిమించిపోయింది. 

కొండప్రాంతాలు, పొలాల్లో స్థావరాలు 

జిల్లాలోని గ్రామీణ  ప్రాంతాల విషయానికొస్తే కొండప్రాంతాలు, పొలాల్లో పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. ప్రాంతాలవారీగా చూస్తే గిద్దలూరు నియోజకవర్గంలో కొందరు వైసీపీ స్థానిక నాయకుల సహకారంతో రోజుకో ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పేకాట కేంద్రాలు నడుపుతున్నారు. ఒక్కో మండలంలో రెండు మూడు రోజులు ప్రకారం దాదాపు అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నారు. 

కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలంలో జూదకేంద్రాల నిర్వహణ  అధికంగా కనిపిస్తోంది. పామూరు, కనిగిరిలలో కొన్ని లాడ్జిలలోనూ అదే పరిస్థితి ఉంది. దర్శి నియోజకవర్గంలో కొండప్రాంతాలు, నదీతీర ప్రాంతాల్లో అధికంగా పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 

దర్శి మండలం చందలూరులోని కొండప్రాంతంలో ఎర్రఓబినేనిపల్లి సమీపంలోని ముసినది వద్ద కేంద్రాలు నడుస్తున్నాయి. ముండ్లమూరు మండలంలోని ముండ్లమూరు, పెదఉల్లగల్లు, మారెళ్ల, కెల్లంపల్లి తదితర ప్రాంతాలలో జరిగే జూదకేంద్రాలకు స్థానికులతోపాటు అద్దంకి, వినుకొండ ప్రాంతవాసులు తరలివస్తున్నారు. తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, శివరాంపురం, కురిచేడు మండలం చెన్నారెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లోనూ పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 

సంతనూతలపాడు నియోజకవర్గంలో పారిశ్రామిక వాడల్లోని కొన్ని భవనాల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటుచేసి  జూదం నిర్వహిస్తున్నారు. చీమకుర్తి, మద్దిపాడు మండలాల్లో పెద్దసంఖ్యలో పేకాట కేంద్రాలు ఉండగా భారీ మొత్తంలో పందేలు జరుగుతున్నట్లు సమాచారం. 

కొండపి నియోజకవర్గంలోనూ రెండు మండలాల్లో పెద్దస్థాయి పందేలతో కూడిన పేకాట ఆడుతున్నారు.  జరుగుమల్లి మండలంలో ఇటు నేతలు, పోలీసుల సహకారంతో ఒక కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.  వైసీపీకి చెందిన కొందరు ఒక గ్రామ పరిధిలో వారానికి రెండు రోజులు పేకాట కేంద్రాన్ని నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. జరుగుమల్లి మండలంలో, నియోజకవర్గంలో మరో ఒకటి రెండు చోట్ల అధికార పార్టీ నాయకుల తోడ్పాటుతో జరుగుతున్న పేకాట కేంద్రాల వైపు అయితే పోలీసులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణ లున్నాయి.

పర్చూరు నియోజకవర్గంలో యద్దనపూడి, మార్టూరు మండలాల పరిధిలోని కొన్ని పరిశ్రమల భవనాల్లోనూ ఈ కేంద్రాల నిర్వహణ  జోరుగా ఉంది. కారంచేడు మండలంలోని ఒక గ్రామంలో కోతముక్క బహిరంగంగానే ఆడిస్తున్నారు. పర్చూరు, చీరాల నియోజకవర్గాలకు సంబంధించి సముద్రతీర ప్రాంతంలోని అతిథిగృహాల్లోని  ముప్పై శాతం రూముల్లో వారాంతపు రోజుల్లో పేకాట జోరుగా సాగుతోంది.


Updated Date - 2021-07-26T05:37:05+05:30 IST