Abn logo
Apr 30 2021 @ 19:48PM

ప్రాణాలకోసం బిలియనీర్ల పరుగులు.. వ్యాపారాలు వదిలి, జనాలకు దూరంగా..!

బతికుంటే బలిసాకు తినైనా బతకొచ్చనేది ముతక సామెత. అంటే ముందు ప్రాణాలు కాపాడుకుంటే ఆ తర్వాత ఎలాగైనా బతకొచ్చని అర్థమన్నమాట. ప్రస్తుతం మన దేశంలో బిలియనీర్ల పరిస్థితి అలానే ఉంది. వేల కోట్ల వ్యాపార సామ్రజ్యాలున్నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఉంటున్న ఇల్లు, వాకిలి, వ్యాపారాలు అన్నీ వదిలేసి.. జనసమాజానికి దూరంగా బతకడానికి క్యూ కడుతున్నారు. కరోనా దెబ్బకు కనీసం పక్కవారితో మాట్లాడేందుకు కూడా బెదిరిపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నవంతుడైన ముఖేశ్ అంబానీతో పాటు అదానీ సంస్థల చైర్మన్ గౌతం అదానీ, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కోట్లకు పడగలెత్తిన వారంతా ఇప్పుడు ఊరికి దూరంగా ప్రజా సమూహాలకు ఆమడ దూరంలో తలదాచుకుంటున్నారు. 

ముఖేశ్ అంబానీ:

దేశంలో అత్యంత సంపన్న వంతుడు ముఖేశ్ అంబానీ. ప్రపంచ బిలియనీర్లలో టాప్ 5లో ఉన్నాడు.  వందల్లో వ్యాపారాలు. కోట్లలో ఆస్తులు. ఏ క్షణం ఎక్కడుంటారో ఆయనకే తెలియదు. అనుక్షణం దేశదేశాలూ తిరుగుతూ క్షణం తీరిక లేకుండా వ్యపార అభివృద్ధి కోసం ప్రయత్నించే అంబానీ ప్రస్తుంతం ముంబైకి గుడ్ బై చెప్పారట. కుటుంబంతో కలిసి గుజరాత్‌లోని అతితక్కువ జనసాంద్రత గల జామ్‌నగర్ ప్రాంతంలోని తన ఇంటికి చేరుకుని నివశిస్తున్నారట. ఆ చుట్టుపక్కల వారి ద్వారా ఈ సమాచారం తెలుస్తోంది.

గౌతం అదానీ:

దేశంలో ముఖేశ్ అంబానీ తరువాత అంతటి సంపన్నుడు గౌతం అదానీ. ఆయన కూడా కరోనా దెబ్బకు అంబానీ బాటలోనే బయలుదేరారట. ఆయన తనయుడు కరణ్ అదానీతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయారట. అంతేకాదు.. అదానీ కూడా ప్రస్తుతం గుజరాత్‌కే వెళ్లారట. అహ్మదాబాద్‌ శివార్లలోని ఇంటికి షిఫ్ట్ అయిపోయారట. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులే చెబుతున్నారు.

క్రిస్ గోపాలకృష్ణన్, నందన్ నీలేకని:

కరోనా భయంతో బిలియనీర్లంతా ఉన్న ప్రాంతాలను వదిలి వెళ్లిపోతుంటే ఇన్ఫోసిస్ సహ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ మాత్రం మరో ఐడియాను ఆలోచించారు. ఐపీఎల్‌లో ఆటగాళ్లు ఎలాగైతే బయోబబుల్‌లో ఉంటున్నారో.. అలాగే క్రిస్ కూడా తాను, తన కుటుంబం, తన స్టాఫ్ మొత్తాన్ని ఓ బయోబబుల్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబంతో స్టాఫ్ కూడా కేవలం ఇంట్లో వండిన వంటకాలనే తింటూ బయటి ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాలను పూర్తిగా తెంచేసుకున్నారట. ఆయనతో పాటు ఇన్ఫోసిస్ సంస్థకే చెందిన మరో కో ఫౌండర్ నందన్ నీలేకని కూడా బెంగళూరులోని తన ఇంట్లో బయోబబుల్‌లో జీవిస్తున్నట్లు ఓ మెసేజ్‌లో తెలిపారు.

బైజు రవీంద్రన్:

దేశంలోనే అత్యంత విలువైన ఆన్‌లైన్ విద్యా సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బైజు రవీంద్రన్ కూడా ప్రస్తుత కరోనా కాలంలో కుటుంబంతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. బెంగళూరులోని యూనికార్న్ రో అనే ప్రాంతంలోని ఇంట్లోకి మారిపోయాడు. అయితే ఈయన ఇలాంటి పరిస్థితుల్లోనూ తన ఇంటిని 1 బిలియన్‌ డాలర్లకు అద్దెకిచ్చి అసలైన వ్యాపారవేత్త అనిపించుకున్నాడు.

వీరు మాత్రమే కాకుండా కరోనా భయంతో ఇంకా ఎంతో మంది కోటీశ్వరులు ఏకంగా దేశాన్నే వదిలి వెళ్లిపోతున్నారు. వారిలో కొంతమంది సొంత విమానాల్లో వెళ్లిపోతుంటే, మరికొంతమంది జనావాసాలకు దూరంగా నివాసాలు ఏర్పరచుకుంటున్నారు.

బిలియనీర్లంతా హాయిగా బతకేందుకు కరోనాకు దూరంగా పారిపోతుంటే.. సామాన్యులు మాత్రం ఆ మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా షరామామూలయింది. మరి వీరంతా కోట్లకు పడగలెత్తకపోవడం, పేదలు, మధ్యతరగతి వారు కావడమే దీనికి కారణమేమో..! అందుకే అంటారు ‘ధనమూలం ఇదం జగత్’ అని.

Advertisement
Advertisement