ఆసుపత్రిలో అధికారుల ఎదుటే.. జడ్పీటీసీ , ఎంపీపీ భర్త వాగ్వాదం..!

ABN , First Publish Date - 2021-06-12T05:28:43+05:30 IST

ఆసుపత్రిలో అధికారుల ఎదుటే.. జడ్పీటీసీ , ఎంపీపీ భర్త వాగ్వాదం..!

ఆసుపత్రిలో అధికారుల ఎదుటే..  జడ్పీటీసీ , ఎంపీపీ భర్త వాగ్వాదం..!
మైసిగండి ఆసుపత్రి ఎదుట వాగ్వాదానికి దిగిన జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌, ఎంపీపీ కమ్లీ భర్త మోత్యనాయక్‌

  • మైసిగండి ప్రభుత్వ ఆసుపత్రిలో సంఘటన 
  • ఇరువర్గాలపై కేసులు నమోదు 


ఆమనగల్లు : కడ్తాల మండలం మైసిగండి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌, ఎంపీపీ కమ్లీ భర్త మోత్యనాయక్‌లు వాగ్వాదానికి దిగారు. అధికారుల ఎదుటే బాహాబాహి తలపడ్డారు. ఒక దశలో ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడికి దిగారు. కాగా ఇద్దరి నేతల మధ్య కొంతకాలంగా ఉన్న ఆధిపత్య, వర్గపోరు బయటపడింది. దీంతో ఈ ఘటనపై ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మైసిగండి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ కమ్లీ అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌, కందుకూరు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ దీనదయాల్‌, మైసిగండి సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, డాక్టర్‌ అజీం, ఎంపీడీవో రామకృష్ణలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరైన నిధుల వ్యయం, కరోనా నియంత్రణ చర్యలపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ మండలంలో కరోనా ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు వివరిస్తుండగా, ఎంపీపీ కమ్లీ భర్త మోత్యనాయక్‌ కలుగజేసుకొని ప్రభుత్వం ద్వారా వస్తున్న కరోనా ఐసోలేషన్‌ కిట్లను ‘నీ బొమ్మ వేసుకొని పంచుతున్నావు’ అంటూ అభ్యంతరం చెప్పడంతో తాను ప్రైవేట్‌లో మందులను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నానని దశరథ్‌ నాయక్‌ చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఇదే సమయంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ అధికారిక సమావేశానికి బయటి వ్యక్తులను ఎలా అనుమతించారని అధికారులను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒక దశలో కోపోద్రిక్తులైన ఇరువురు, వారి మద్దతుదారులు కుర్చీలు విసురుకున్నారు. ఘటనలో దశరథ్‌నాయక్‌, ఎంపీపీ భర్త మోత్యనాయక్‌ బట్టలు చిరగడంతో పాటు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలియడంతో ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్‌ సిబ్బందితో కలిసి మైసిగండి ఆసుపత్రి వద్దకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ లోపు సమావేశానికి హజరైన డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో దీన్‌దయాల్‌, ఆసుపత్రి సిబ్బంది అక్కడి పరిస్థితి చూసి సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. కాగా దశరథ్‌ నాయక్‌, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ ఉపేందర్‌ తెలిపారు. స్వల్పంగా గాయపడ్డ దశరథ్‌నాయక్‌, మోత్యనాయక్‌లను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

Updated Date - 2021-06-12T05:28:43+05:30 IST