గిల్గిట్‌-బాల్టిస్థాన్‌లో..పాక్‌ దురాగతాలు

ABN , First Publish Date - 2020-09-23T06:53:27+05:30 IST

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లో పాకిస్థాన్‌ సాగిస్తున్న అరాచకాలపై స్థానిక ప్రజలు పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇదసలు భారత భూభాగం..

గిల్గిట్‌-బాల్టిస్థాన్‌లో..పాక్‌ దురాగతాలు

ఏళ్ల తరబడి హత్యలు, అణచివేతలు

1947 నుంచి పాక్‌ దురాక్రమణలోనే!

నేడు ఇమ్రాన్‌ పర్యటన.. ప్రావిన్సుగా ప్రకటన?


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లో పాకిస్థాన్‌ సాగిస్తున్న అరాచకాలపై స్థానిక ప్రజలు పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇదసలు భారత భూభాగం.. జమ్మూకశ్మీరులో అంతర్భాగం.. కానీ 1947 నుంచీ ఇది పాకిస్థాన్‌ దురాక్రమణలో ఉంది. అక్కడి ప్రజలపై పాక్‌ దశాబ్దాలుగా సాగిస్తున్న దమనకాండపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్గ హింసలు, హత్యలతో తమను భయభ్రాంతుల్ని చేస్తోందని.. మానవ హక్కుల ఉల్లంఘన సాగిస్తోందని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆసియా, ఐరోపా, అమెరికా మానవ హక్కుల కార్యకర్తలు కూడా ఇక్కడి అకృత్యాలను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు.


గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రజలంతా తమ పౌరులేనని పాక్‌ పాలకులు చెబుతున్నా.. నిజానికి వారికి ఎలాంటి రాజ్యాంగబద్ధమైన హక్కులూ ఇవ్వలేదు. స్థానికంగా పాలనా యంత్రాంగం ఉన్నా.. పాక్‌ ప్రధాని మాటే ఇక్కడ చెల్లుబాటవుతుంది. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లో అపార ఖనిజ సంపద, నీటి వనరులు ఉన్నాయి. సింధు నది ఈ ప్రాంతం నుంచే ప్రవహిస్తుంది. దీనిపై నిర్మించిన జలవిద్యుత్‌ ప్రాజెక్టులే పాక్‌ మొత్తానికీ వెలుగులు అందిస్తున్నాయి. విద్యుత్‌ అవసరాలు తీర్చుతున్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజల కోసం పాక్‌ పాలకులు చేసింది శూన్యం. వారు దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్నారు. యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాల్లేవు.


1963లో ఇక్కడి హంజా వ్యాలీని పాక్‌ తన మిత్రదేశమైన చైనాకు కట్టబెట్టింది. గిల్గిట్‌-బాల్టిస్థాన్‌లో 1970ల వరకు షియాలు, సున్నీలు, అహ్మదీలు శాంతిసామరస్యాలతో జీవించారు. షియాల సంఖ్య ఇక్కడ అధికం. పాక్‌ పాలకులు ఇతర ప్రావిన్సుల నుంచి సున్నీలను ఇక్కడకు తరలించి.. స్థానికుల జనాభాను తగ్గించారు. తర్వాత వర్గ వైషమ్యాలు సృష్టించారు. సున్నీ ఉగ్రవాద సంస్థలు షియాలు, అహ్మదీలను ఊచకోత కోయడం మొదలుపెట్టాయి.


చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక కారిడార్‌ (సీపీఈసీ) నిర్మాణం మొదలయ్యాక స్థానికులను సొంతిళ్లు, స్వస్థలాల నుంచి బలవంతంగా తరిమివేస్తున్నారు. ఈ కారిడార్‌ వల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం లేదు సరికదా.. స్థానిక ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయి. దీంతో యువత దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత్‌లో కలిసిపోతామని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్‌ పాలకులు సైన్యాన్ని రంగంలోకి దించి బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తూ నిర్మాణ పనులు సాగిస్తున్నారు. వేల మంది యువకులను, సామాజిక, రాజకీయ కార్యకర్తలను నిర్బంధిస్తున్నారు. ఎదురుతిరిగినవారిపై కాల్పులు జరిపి హత్యలు చేయడానికీ వెనుకాడడం లేదు.


ఇంకోవైపు.. జమ్మూకశ్మీరును భారత్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంతో.. పాకిస్థాన్‌ పాలకులు కూడా చైనా సలహాతో గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ను పాక్‌ భూభాగంలో విలీనం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బుధవారం అక్కడకు వెళ్లి ఈ ప్రాంతాన్ని ఐదో పాక్‌ ప్రావిన్సుగా ప్రకటించనున్నారు. ఈ చర్యను వ్యతిరేకిస్తున్న గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రజలు.. తమ పోరాటానికి మద్దతివ్వాలని ప్రపంచ దేశాలన్నిటినీ కోరారు.


Updated Date - 2020-09-23T06:53:27+05:30 IST