మాఫియా గుప్పిట్లో

ABN , First Publish Date - 2022-01-22T04:28:39+05:30 IST

పాలమూరులో వాగులను ఇసుక మాఫియా చెరబట్టింది. పట్టా భూముల్లో ఇసుక మేటల తరలింపు పేరుతో అడ్డగోలు తవ్వకాలు చేపడుతోంది. ప్రభుత్వ పనులకు అనుమతులు తెచ్చుకొని అక్రమమార్గంలో నగరాలకు ఇసుకను తరలించి అమ్ముకుంటోంది.

మాఫియా గుప్పిట్లో
సీసీకుంట మండలం కురుమూర్తి వద్ద ఊకచెట్టు వాగులో ఇసుక తవ్వేందుకు వచ్చిన ఎక్స్‌కవేటర్‌

ప్రముఖుల అండతో దుందుభీ నదిని దున్నేస్తున్న ఇసుక మాఫియా

రెండు జిల్లాల సరిహద్దులో అడ్డగోలుగా తవ్వకాలు

వాగులో ఏకంగా ప్రైవేట్‌ రోడ్డు

సిండికేట్‌గా మారి ఊకచెట్టు, పెద్దవాగుల నుంచి ఇసుక తరలిస్తున్న వ్యాపారులు

పట్టించుకోని రెవెన్యూ, పోలీసు యంత్రాంగం


 పాలమూరులో వాగులను ఇసుక మాఫియా చెరబట్టింది. పట్టా భూముల్లో ఇసుక మేటల తరలింపు పేరుతో అడ్డగోలు తవ్వకాలు చేపడుతోంది. ప్రభుత్వ పనులకు అనుమతులు తెచ్చుకొని అక్రమమార్గంలో నగరాలకు ఇసుకను తరలించి అమ్ముకుంటోంది. స్థానిక రాజకీయ నాయకులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల అండదండలతో ఇసుక మాఫియా ఆడిందేఆటగా సాగుతోంది. దుందుభీ, పెద్దవాగు, ఊకచెట్టువాగులే కాకుండా జిల్లాలోని చిన్న, పెద్ద వాగుల్లో ఎక్కడా ఇసుక రేణువు కనబడితే అక్కడ వాలిపోతుండటం జిల్లాలో పాతుకుపోయిన ఇసుక మాఫియా వ్యవహారానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. మహబూ బ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల గుండా ప్రవహించే దుందుభీ నదీలో ఇసుకను అడ్డగోలుగా తవ్వు తోంది. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా సరిహద్దు ప్రాంతమైన తిమ్మాజిపేట మండలం ఆవంచ, మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం కొత్తపల్లి మధ్య వాగులో ఈ దందా జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఇసుక మా ఫియా రాష్ట్ర స్థాయి టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల అండదండలతో ఈ ప్రాంతంలో పాగా వేసి, ఇసుక మేటల అనుమతుల చాటున వాగును తవ్వు తోంది. ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తోంది. ఈ యేడాది సైతం నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని ఆవంచ గ్రామ పరిధిలో సర్వే నెంబర్‌ 827లో 5.30 ఎకరాల పరిధిలో ఇసుక మేటల్లో 1000 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించేందుకు టీఎస్‌ఎండీసీ అనుమతులిచ్చింది. ఈ అనుమతులను అడ్డం పెట్టుకొని వ్యాపారులు ఇక్కడ ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నారు. ఏ కంగా ఇక్కడ క్యాంప్‌నే ఏర్పాటు చేశారు. 1000 క్యూబిక్‌ మీటర్ల ఇసుకనే తవ్వాల్సి ఉండగా, రోజూ 50 టిప్పర్ల ఇసుకను తరలిస్తున్నారు. వాగులో ఏకంగా కిలో మీటర్‌ మేర ప్రైవేట్‌ రోడ్డు నిర్మించుకున్నారు. సరి హద్దు ప్రాంతమైన ఇక్కడ ఒక జిల్లాలో అనుమతులు తెచ్చుకొని మరో జిల్లాలో తవ్వకాలు జరపడమే కాకుండా, పట్టాభూమి పేరుతో పర్మిషన్లు తెచ్చుకొని వాగులో ఇసుక ఉన్నంత మేర తవ్వే స్తున్నారు. పగటి వేళ టిప్పర్లతో సమీపంలోని మిడ్జిల్‌, కొత్తపల్లి ప్రాంతాలకు ఇసుకను తరలించి, రాత్రి వేళ అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మాఫియాను అడ్డుకున్న పాపానికి మిడ్జిల్‌ మండలానికి చెందిన రైతుపై పారలతో దాడి చేసి గాయపరిన సంఘటన కూడా ఇటీవల జరిగింది. కళ్లెదుటే ఈ వ్యవహారమంతా కనిపిస్తున్నా నిరోధిం చాల్సిన పోలీసు, రెవెన్యూ యంత్రాంగం మాత్రం అనుమతులున్నాయనే సాకులు చెబుతూ కనీసం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎగు వన కొత్తపల్లి, జడ్చర్ల మండలం కోడ్గల్‌ ప్రాంతా ల్లోనూ దుందుభీ నదిలో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుగుతున్నా కట్టడి చేసేవారు కరువయ్యారు. 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రవహించే ఊకచెటు ్టవాగు పరిస్థితి కూడా దుందుభీలాగే తయారైంది. కోయిల్‌సాగర్‌ దిగువన ప్రవహించే ఈవాగు వెంట ముచ్చింతల, కురుమూర్తి, వర్ని, ముత్యాలంపల్లి, బలీజపల్లి, మునిగల్‌ఛేడ్‌ ప్రాంతాల్లోనూ ఇసుక మాఫియా ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వ పనులకు అనుమతుల పేరుతో నామ మాత్రపు పర్మిట్లు తీసుకొని, రాత్రి వేళల్లోనే తవ్వ కాలు జరుపుతున్నారు. ప్రభుత్వ పనులకు సంబం ధించి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మాత్రమే తవ్వాల్సి ఉండగా, నిబంధన అమలవడం లేదు. ఇసుక తవ్వకాలు, రవాణా జరిపే వ్యాపారులంతా సిండికేట్‌గా మారి పోలీసు, రెవెన్యూ, మైన్స్‌ శాఖల అధికారులు, ఉద్యోగులను మ్యానేజ్‌ చేయడంతో పాటు, స్థానిక రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకొని అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇసుకను హైదరాబాద్‌ తరలిస్తున్నారు. మూసాపేట మండలం కందూరు వద్ద సైతం ఇదేరీతిలో పెద్దవాగులో తవ్వకాలు జరుపుతున్నా, పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కరువుతో అల్లాడిన ఈ ప్రాంతంలో ఇటీవల చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలతో పాటు, భూగర్భజలాలు పెరి గేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేయకుండా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలనే సూచనలు వస్తున్నాయి.







Updated Date - 2022-01-22T04:28:39+05:30 IST