Abn logo
Jul 9 2020 @ 23:36PM

ఇంద్రధనస్సు లాంటి నటుడు!

‘మేరా నామ్‌ సూర్మా భోపాలి.. ఐసే హీ నహీ హై’.. కల్ట్‌ ఫిల్మ్‌ ‘షోలే’లో ఈ డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయిందో... ఆ డైలాగ్‌ చెప్పిన నటుడు జగదీప్‌ కూడా అంతే ఫేమస్‌ అయ్యారు. టైమింగ్‌ ఉన్న కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన డైలాగ్‌ డెలివరీలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. ఇప్పుడా గొంతు మూగబోయింది. ‘షోలే’లో సూర్మా భోపాలి పాత్రధారి, ప్రముఖ హాస్యనటుడు జగదీప్‌(81) మృతి చెందారు. ఆయన పూర్తి పేరు అలియాస్‌ సయ్యద్‌ ఇష్తియాక్‌ అహ్మద్‌ జాఫ్రీ. వయసుతోపాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి కన్నుముశారు. బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ఆరు దశాబ్ధాలకు పైగా చిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా కొనసాగారు. 400లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశారు. ఆయన పోషించిన ‘సూర్మా భోపాలి’ టైటిల్‌తోనే సినిమా తీసి దర్శకుడయ్యారు. ఆయన మరణంతో బాలీవుడ్‌ శోకసంద్రంలో నిండిపోయింది. ముంబైలోని షియా ఖబర్‌స్తాన్‌లో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  


‘‘జగదీప్‌తో ఎన్నో సినిమాల్లో నటించా. వినోదం పంచడంలో ఆయనకు యునీక్‌ స్టైల్‌ ఉంది. ఎంతోమంది హాస్యనటులు ఉన్నా ఆ శైలి ఎవరికీ రాదు. జగదీప్‌ డైలాగ్‌ డిక్షన్‌ కూడా బావుంటుంది. అరుదైన హాస్యనటుడాయన.’’ 

- అమితాబ్‌ బచ్చన్‌ 


‘‘జగదీప్‌ ఇంద్రధనస్సు లాంటి నటుడు’’

- మహేశ్‌భట్‌


‘‘నువ్వు కూడా వెళ్లిపోయావా? బాధలో బాధని మిగిల్చావు మిత్రమా! జగదీప్‌ హాస్యనటుడే కాదు. ప్రతిభ గల ఆర్టిస్ట్‌. అలాంటి ఆర్టిస్ట్‌ని ఎప్పటికీ మరచిపోలేం. చాలా బాధగా ఉంది. మీకు స్వర్గలోక ప్రాప్తి కలగాలి’’

- ధరేంద్ర


‘‘తన హాస్యంతో కొన్ని తరాలను అలరించారు. ఆయన సినిమాలు చూసి నేనెంతగా నువ్వుకున్నానో బాగా గుర్తుంది’’

- సంజయ్‌దత్‌

Advertisement
Advertisement
Advertisement