ఆమె చేసిన పనికి ఎవరికీ ముఖం చూపించలేకపోతున్నా.. న్యాయం చేయండి: క్యాబ్ డ్రైవర్

ABN , First Publish Date - 2021-08-05T22:06:50+05:30 IST

యువతి చేతిలో చెంప దెబ్బలు తిన్న ట్యాక్సీ డ్రైవర్ తనకు న్యాయం చేయాలని పోలీసులను తాజగా డిమాండ్ చేశాడు.

ఆమె చేసిన పనికి ఎవరికీ ముఖం చూపించలేకపోతున్నా.. న్యాయం చేయండి: క్యాబ్ డ్రైవర్

లక్నో: యువతి చేతిలో పలుమార్లు చెంప దెబ్బలు తిన్న ట్యాక్సీ డ్రైవర్ తనకు న్యాయం చేయాలని పోలీసులను తాజగా డిమాండ్ చేశాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో క్యాబ్ డ్రైవర్‌ సాదత్ అలీపై  ప్రియదర్శినీ నారాయణ్ యాదవ్ అనే యువతి చేయిచేసుకున్న వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. కారుతో తనను ఢీకొనబోయాడని, తృటిలో ప్రమాదం తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి.. డ్రైవర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నడిరోడ్డులో నిలబట్టి చెడామడా చెంపలు వాయించేసింది. ఈ కమ్రంలో పోలీసులు యువతి ఫిర్యాదుపై  డ్రైవర్‌ 28 గంటల పాటు పోలీసు స్టేషన్‌లో పెట్టి తాజాగా విడుదల చేశారు. 


ఇక ట్యాక్సీ డ్రైవర్ కూడా యువతిపై ఫిర్యాదు చేశాడు. కానీ.. పోలీసులు ఇంకా ఆమెను అదుపులోకి తీసుకోలేదు. దీంతో.. ప్రయదర్శినిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలంటూ క్యాబ్ డ్రైవర్ డిమాండ్ చేశాడు. ‘‘ఏకంగా 22 సార్లు నా చెంప పగలగొట్టింది. నా ఆత్మగౌరవాన్ని కోల్పోయాను. ఎవరికీ ముఖం చూపెట్టలేకపోతున్నారు. వాళ్లందరూ నన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పటివరకూ నేను ఇంటి గడపదాటలేదు. నేను ఓలా డ్రైవర్‌‌ని. ఇంటి ఖర్చుల విషయంలో ఎలా నెట్టుకొస్తున్నానో నాకు మాత్రమే తెలుసు’’ అని అతడు మీడియాతో వాపోయాడు. తన జేబులో ఉన్న రూ. 600ను కూడా యువతి లాక్కుందని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించలేదన్న విషయం వీడియో ఫుటేజీ చూస్తే.. రుజువవుతుందని చెబుతున్నాడు. 


కాగా..సాదత్ అలీ ఆరోపణల్ని ప్రియదర్శిని కొట్టిపారేసింది. స్వీయ రక్షణ కోసమే అలా చేశానని తేల్చి చెప్పింది. ‘‘ఇంకా నాలుగు దెబ్బలు పడాల్సింది. పోలీసులు తమ పని తాము చేసి ఉంటే నేను ఇలా చేయాల్సి వచ్చేదే కాదు. వాళ్లు ఢీకొట్టి పారిపోతారు. నేను స్వీయరక్షణ చర్యకు దిగకూడదా..? నా జీవితానికి విలువే లేదా..? పోలీసులు శవానికి పోస్ట్ మార్టం చేయించి..మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. మరి చివరికి నష్టపోయేది ఎవరు’ అంటూ ఆమె ఓ జాతీయ చానల్ విలేకరిని ప్రశ్నించింది. మరోవైపు.. ప్రియదర్శినిపై గతంలో ఈ తరహా ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే తనను అరెస్టు చేసిన పోలీసులు.. తన ఫిర్యాదుపై ఆమెను ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. 

Updated Date - 2021-08-05T22:06:50+05:30 IST