కరోనాపై పోరులో.. ప్రపంచానికే భారత్‌ ఆదర్శం

ABN , First Publish Date - 2021-01-17T07:32:12+05:30 IST

‘‘భారత్‌లో కరోనా వస్తే నియంత్రించడం సాధ్యం కాదని ప్రపంచ దేశాలు అన్నాయి. కానీ, కరోనాపై పోరులో ప్రపంచానికే భారత్‌ ఆదర్శంగా నిలిచింది. భారత్‌లో తొలి కేసు గత ఏడాది జనవరి 30న

కరోనాపై పోరులో.. ప్రపంచానికే భారత్‌ ఆదర్శం

     టీకా తయారీలో శాస్త్రవేత్తల కృషి అమోఘం: మోదీ

  గురజాడ స్మరణ  


వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ సందర్భంగా ప్రధాని మోదీ విఖ్యాత తెలుగు సాహితీవేత్త, మహాకవి గురజాడ అప్పారావును గుర్తుచేసుకున్నారు. ఆయన రాసిన ‘దేశభక్తి’ గేయంలోని చరణాలను వినిపించారు. ‘‘సొంత లాభం కొంత మానుకు.. పొరుగు వారికి తోడు పడవోయ్‌..! దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’’ అన్న చరణాన్ని గుర్తు చేశారు. గురజాడ సిద్ధాంతాన్ని దేశం ఆచరించిందని.. టీకా వచ్చిందని అన్నారు. గురజాడ చెప్పినట్లు పరుల కోసం మనందరం పాటుపడాలని వ్యాఖ్యానించారు.


 న్యూఢిల్లీ, జనవరి 16: ‘‘భారత్‌లో కరోనా వస్తే నియంత్రించడం సాధ్యం కాదని ప్రపంచ దేశాలు అన్నాయి. కానీ, కరోనాపై పోరులో ప్రపంచానికే భారత్‌ ఆదర్శంగా నిలిచింది. భారత్‌లో తొలి కేసు గత ఏడాది జనవరి 30న నమోదైనా.. అంతకు రెండు వారాల ముందే(జనవరి 17న) మనం హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేశాం. విమానాశ్రయాల్లో స్ర్కీనింగ్‌ను ప్రారంభించాం. చైనాలో చిక్కుకుపోయిన తమ పౌరులను వెనక్కి తీసుకువచ్చేందుకు చాలా దేశాలు వెనుకంజ వేశాయి.

ఆ సమయంలో మనం మన పౌరులతోపాటు.. పలువురు విదేశీయులను కూడా వెనక్కి తీసుకువచ్చాం. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన 35 లక్షల మందిని వందే భారత్‌ విమానాల ద్వారా వెనక్కి రప్పించాం. జనతా కర్ఫ్యూతో లాక్‌డౌన్‌కు ప్రజలను సన్నద్ధం చేశాం. ప్రపంచంలో తయారవుతున్న పలు కొవిడ్‌ టీకాల వెనక మనవారి కృషి ఉంది. కరోనాపై భారత్‌ విజయంలో ఇప్పుడు దేశీయ టీకాలు దోహదపడుతున్నాయి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగంగా అన్నారు.


శనివారం ఉదయం 10.30 గంటలకు ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్‌ను.. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 3,006 సెషన్‌ సైట్స్‌లో వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ కోసం శ్రమించిన శాస్త్రవేత్తలు, సంస్థలకు అభినందనలు తెలిపారు. ‘‘వ్యాక్సినేషన్‌ తొలి దశలో నర్సులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు తొలి హక్కుదారులు. వీరందరికీ ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తుంది’’ అని ప్రకటించారు.


దవాయీ భీ.. కడాయీ భీ..

కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసులుగా తీసుకోవాలని ప్రధాని చెప్పారు. ఒక డోసు తీసుకున్నాక.. రెండో డోసును విస్మరించకూడదన్నారు. ‘‘రెండో డోసు తర్వాతే.. కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. టీకాలు తీసుకున్నా.. మాస్కుల ధారణ, భౌతిక దూరం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి’’ అని వ్యాఖ్యానించారు.


దవాయీభీ.. కడాయీభీ(మందులతోపాటు.. క్రమశిక్షణ అవసరం).. మన కొత్త మంత్రం ఇదే అని పిలుపునిచ్చారు. తొలి దశ టీకా కార్యక్రమంలో మొత్తం 3 కోట్ల మందికి, రెండో దశలో 30 కోట్ల మందికి ప్రాధాన్య క్రమంలో టీకాలు ఇస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వయోవృద్ధులు రెండో దశ ప్రాధాన్య క్రమంలో ఉంటారని వివరించారు.


‘‘భారత్‌ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ల పట్ల ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం ఉంది. ప్రపంచంలో 60ు మంది పిల్లలకు ఇస్తున్న పలు టీకాలు భారత్‌లో తయారైనవే. ఇతర దేశాల్లో తయారయ్యే టీకా(సుమారు రూ.5వేలు)తో పోలిస్తే.. మన వ్యాక్సిన్ల ధర చాలా తక్కువ. వినియోగం సులభం. ఇప్పుడు అందిస్తున్న రెండు టీకాలను కూడా భద్రత, ప్రజారోగ్యం, ప్రతికూల ప్రభావాలపై అన్ని విధాలుగా అధ్యయనం చేశాకే.. ఆమోదించాం. కాబట్టి.. ఈ టీకాల విషయంలో ఎలాంటి అపోహలు వద్దు’’ అని ప్రజలకు సూచించారు. ఒకప్పుడు మాస్కులు, పీపీఈ కిట్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి నేడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరామని ఆయన అన్నారు.




కంటతడి పెట్టిన మోదీ

కరోనా సృష్టించిన ప్రాణ నష్టాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ‘‘కరోనా సమయంలో హెల్త్‌ వర్కర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు తమ కుటుంబాలను వదిలి ప్రజలకోసం పనిచేశారు. కొందరైతే పనిచేస్తునే మహమ్మారి బారిన పడి, చనిపోయారు. ప్రజల ప్రాణాలకోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు.

ఈ మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆస్పత్రుల్లో చేరిన వృద్ధులను వారి కుటుంబ సభ్యులు కలుసుకోలేకపోయారు. చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు కడసారి చూసుకోలేకపోయారు’ అంటూ ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజల సహకారం వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టగలిగామన్నారు.


Updated Date - 2021-01-17T07:32:12+05:30 IST