బోనులో భల్లూకం!

ABN , First Publish Date - 2020-06-05T10:01:33+05:30 IST

సోంపేట మండలం ఎర్రముక్కాంలో గురువారం ఓ ఎలుగుబంటి బోనులో చిక్కింది.

బోనులో భల్లూకం!

ఎర్రముక్కాంలో చిక్కిన ఎలుగు


సోంపేట రూరల్‌ : సోంపేట మండలం ఎర్రముక్కాంలో గురువారం ఓ ఎలుగుబంటి బోనులో చిక్కింది.  గత ఏడాది ఎలుగు దాడిలో ఇదే గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యలకే పరిమితం కాగా.. అప్పటి నుంచి గ్రామస్థులు ఆందోళనతో బతుకుతున్నారు. ఎప్పటికప్పుడు ఎలుగుల సంచారంతో చీకటిపడితే చాలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఎలుగులను నియంత్రించాలని అటవీ శాఖ అధికారులను కోరినా వారు తిరిగి జాగ్రత్తగా ఉండమని చెప్పారే తప్ప... ఎటువంటి చర్యలు చేపట్టలేదు.


దీంతో గ్రామానికి చెందిన నేతాజీ యువజన సంఘం ప్రతినిధులు గ్రామంలో చందాల రూపంలో రూ.35 వేలు పోగు చేశారు. ఈ డబ్బుతో బోనును కొనుగోలు చేసి ఊరికి సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి గ్రామంలో సంచరించిన ఎలుగుబంటి ఈ బోనులో చిక్కింది. ఎలుగు అరుపులతో ఆందోళనకు గురైన గ్రామస్థులు వచ్చి చూసేసరికి బోనులో కనిపించింది.  వెంటనే  అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. డీఎఫ్‌వో ఎస్‌.కృపాకరరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బోనులో చిక్కిన ఎలుగును విశాఖపట్నంలోని జంతు ప్రదర్శన శాలకు తరలించారు. దీంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. ఎలుగుల నుంచి రక్షణ కోసం ఉద్దానంలో బోనులు ఏర్పాటు చేస్తే..  ఫలితముంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  

Updated Date - 2020-06-05T10:01:33+05:30 IST