ఏపీ ఫైబర్‌నెట్‌ వ్యవహారంలో..

ABN , First Publish Date - 2020-09-21T08:06:17+05:30 IST

ఏపీ ఫైబర్‌నెట్‌లో భారీ స్కాం జరిగిందంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఏపీ ప్రభుత్వ ఐటీ మాజీ సలహాదారు, నెట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ వేమూరి హరిప్రసాద్‌ ఖండించారు.

ఏపీ ఫైబర్‌నెట్‌ వ్యవహారంలో..

నాపై ఆరోపణలు అవాస్తవం

ఏ విచారణకైనా సిద్ధం: వేమూరి హరిప్రసాద్‌ 


పంజాగుట్ట, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఫైబర్‌నెట్‌లో భారీ స్కాం జరిగిందంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఏపీ ప్రభుత్వ ఐటీ మాజీ సలహాదారు, నెట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ వేమూరి హరిప్రసాద్‌ ఖండించారు. సంస్థ, అధికారులు, ప్రభుత్వం వారి చేతుల్లోనే ఉన్నాయని.. తాను ఏ విచారణకైనా సిద్ధమని.. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఐటీ శాఖ మాజీ మంత్రి లోకేశ్‌కు ఈ ఫైబర్‌నెట్‌ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని.. ఇది ఐటీ శాఖ పరిధిలోది కాదని.. విద్యుత్‌ శాఖ కిందకు వస్తుందన్నారు.


రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని.. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం రూ.770 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, అలాంటప్పుడు రూ.2 వేల కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తాను సాంకేతిక సలహాదారుగానే అప్పట్లో పనిచేశానని.. జీతభత్యాలు లేకుండా పనిచేశానని.. టెండర్లకు సంబంధించి తనకు ఎలాంటి అధికారం లేదని చెప్పారు.

అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని.. బాధపెట్టేలా మాట్లాడడం మంచిది కాదని.. ఎలాంటి విచారణైనా చేసుకోవచ్చని.. రికార్డులు చూసుకోవచ్చని హరిప్రసాద్‌ అన్నారు.


Updated Date - 2020-09-21T08:06:17+05:30 IST