బెయిల్‌ రద్దు కేసులో..కౌంటర్‌ దాఖలుకు జగన్‌కు గడువు

ABN , First Publish Date - 2021-05-08T08:46:44+05:30 IST

అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలనే వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలుకు మరింత సమయమివ్వాలని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు

బెయిల్‌ రద్దు కేసులో..కౌంటర్‌ దాఖలుకు జగన్‌కు గడువు

సీబీఐ కోర్టు విచారణ 17కి వాయిదా


హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలనే వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలుకు మరింత సమయమివ్వాలని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. హెటిరో, అరబిందో సంస్థలకు భూకేటాయింపులో జరిగిన అక్రమాల కేసులో కోర్టు ఇచ్చిన బెయిల్‌ను జగన్‌ దుర్వినియోగం చేస్తున్నారని, ఆయన బెయిల్‌ ను రద్దు చేయాలని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌ దాఖలు చేయడం, దానిని విచారణకు స్వీకరించిన కోర్టు.. జగన్‌, సీబీఐలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.


ఈ వ్యాజ్యం శుక్రవారం న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. కోర్టు నోటీసులు అందాయని, కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలని జగన్‌ తరఫు న్యాయవాది.జి.అశోక్‌రెడ్డి కోరడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ కూడా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా.. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపు అక్రమాలపై సీబీఐ నమోదు చేసిన ప్రధాన కేసు విచారణ జూన్‌ 14కి వాయిదా వేసింది. పెన్నా సిమెంట్స కేసులో శుక్రవారం డిశ్చార్జి పిటిషన్‌పై వాదనలను సీబీఐ కోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది.

Updated Date - 2021-05-08T08:46:44+05:30 IST