ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. కవిత హస్తం!

ABN , First Publish Date - 2022-08-22T08:53:10+05:30 IST

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి ఆదివారం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. కవిత హస్తం!

ఒబెరాయ్‌ హోటల్‌ డీల్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె

అరబిందో శరత్‌చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై

కవిత పీఏ అభిషేక్‌, ఆమె బంధువు శరణ్‌ రెడ్డి పేర్లూ వెలుగులోకి!


కేజ్రీ, సిసోడియాలకు కవిత నుంచి 4.5 కోట్లు.. దాంట్లో కోటిన్నర క్రెడిట్‌నోట్‌

దక్షిణాది నుంచి మద్యం వ్యాపారులను ఢిల్లీకి తెచ్చింది ఆమే: బీజేపీ నేత సిర్సా

కేసీఆర్‌కు తెలిసే ఇదంతా జరిగిందని అనుమానిస్తున్న బీజేపీ వర్గాలు

కేసీఆర్‌ కుటుంబసభ్యుల సలహా మేరకేఢిల్లీలో మద్యం విధానానికి రూపకల్పన

ఒబెరాయ్‌ హోటల్‌లో 6 నెలలు చర్చలు

కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఒక ప్రైవేటు విమానంలో దేశ రాజధానికి వచ్చేవారు

తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన ఒక వ్యక్తి ఆ విమానాన్ని ఏర్పాటు చేశారు

బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ తీవ్ర ఆరోపణలు

పిళ్లై సహా 8 మందిపై లుకౌట్‌ సర్క్యులర్‌

కేసు ఫైళ్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు?


కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందింది. ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలకు వారు కూడా హాజరయ్యారు. తెలంగాణలోనూ అచ్చం ఇలాంటి మద్యం విధానమే ఉంది. పశ్చిమబెంగాల్‌లోనూ దీన్నే అమలుచేశారు.

- పర్వేశ్‌ వర్మ

మద్యం మాఫియాను దక్షిణాది నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది కవితే. ఢిల్లీలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో మద్యం పాలసీపై జరిగిన చర్చల్లో ఆమె పాల్గొన్నారు. గోవా, పంజాబ్‌ ఎన్నికలకు సంబంధించి అడ్వాన్సుగా డబ్బు కూడా చెల్లించారు.

- మంజీందర్‌ సింగ్‌ సిర్సా


న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం పాలసీ  కుంభకోణానికి  సంబంధించి ఆదివారం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ నాయకులు టీఆర్‌ఎ్‌సపైన, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితపైన నేరుగా ఆరోపణలు చేశారు. ఇందులో కవిత భర్త తరఫు బంధువుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మరికొన్ని వివరాలను బయటపెట్టాయి. ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని.. మద్యం వ్యాపారంలో కమీషన్ల కోసమే ఆమె ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నారని బీజేపీ ఽనేతలు ధ్వజమెత్తారు. ఈ మేరకు.. ఢిల్లీ (వెస్ట్‌) ఎంపీ, బీజేపీ నేత పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మద్యం కుంభకోణంపై మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని.. ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలకు వారు కూడా హాజరయ్యారని.. తొలుత మాట్లాడిన పర్వేశ్‌ వర్మ ఆరోపించారు.


తెలంగాణలోనూ అచ్చం ఇలాంటి మద్యం విధానమే ఉందని.. పశ్చిమబెంగాల్‌లోనూ దీన్నే అమలుచేశారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని మద్యం మాఫియాకు చెందిన ఒక వ్యక్తి.. ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌ ఒక సూట్‌ రూమ్‌ను ఆరు నెలలుగా బుక్‌ చేసి ఉంచాడని.. ఆ వ్యక్తే ప్రైవేటు విమానం ఏర్పాటు చేసి మరీ కేసీఆర్‌ కుటుంబసభ్యులను ఢిల్లీకి తీసుకొచ్చేవాడని మండిపడ్డారు. అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ అరవి గోపీ కృష్ణ, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఎక్సైజ్‌ అధికారులతో పాటు లిక్కర్‌ మాఫియా, కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఆ గదిలో జరిగిన చర్చల్లోనే డీల్‌ కుదుర్చుకున్నారని ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఇలాంటి విధానాన్నే పంజాబ్‌లో అమలు చేయించారు. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియాతో కలిసి ఢిల్లీకి కూడా ఒక  ప్రణాళిక రూపొందించారు. మద్యం మాఫియా కమీషన్‌ను 10ు మేర పెంచడానికి చేసుకున్న రూ.150 కోట్ల ఒప్పందంలో తొలి విడత చెల్లింపు మనీశ్‌ సిసోడియాకు అందింది.’’ అని ఆగ్రహం వెలిబుచ్చారు. తెలంగాణ సీఎం కుటుంబసభ్యులను సిసోడియా కలిశారా లేదా అనే విషయాన్ని ఆయనే చెప్పాలని.. నిజాలు ఒప్పుకోవాలని, ఆ వాస్తవాలను కోర్టు ముందు వెల్లడించాలని అన్నారు. 


ముమ్మాటికీ ఆమే..

ర్వేష్‌ వర్మ తర్వాత మాట్లాడిన బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సింగ్‌ సిర్సా మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు. సాక్షాత్తూ కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈ డీల్‌లో భాగస్వామిగా ఉన్నారని.. హైదరాబాద్‌ కోకాపేటకు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైను ఢిల్లీకి ఆమే తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. ‘‘మద్యం మాఫియాను దక్షిణాది నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది ఆమే (కవిత). ఢిల్లీలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో మద్యం పాలసీపై జరిగిన చర్చల్లో కవిత పాల్గొన్నారు. గోవా, పంజాబ్‌ ఎన్నికలకు సంబంధించి అడ్వాన్సుగా డబ్బు కూడా చెల్లించారు’’ అని ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లోనే కాక.. చండీగఢ్‌లోని హయత్‌ హోటల్‌లో కూడా ఈ మద్యం మాఫియా సమావేశాలు జరిగాయని ఆయన చెప్పారు. ఈ సమావేశాల తర్వాతే.. పంజాబ్‌, తెలంగాణలో అప్పటికే అనుసరిస్తున్న మద్యం విధానాలను ఆప్‌ నేతలు ఢిల్లీలో కూడా అమలు చేశారని, మద్యం వ్యాపారుల కమీషన్‌ను 2 నుంచి 12 శాతానికి పెంచారని, ఆక్షన్‌ లేకుండా హోల్‌సేల్‌ లైసెన్స్‌లు మంజూరు చేశారని మండిపడ్డారు. నిజానికి పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం రాకముందు మహదేవ్‌ లిక్కర్స్‌ సంస్థ పూర్తి వ్యాపారం నిర్వహించేదని.. కానీ కవిత వచ్చాక ఈ సంస్థను పంజాబ్‌ నుంచి తప్పించి, వారి దుకాణాలను మూసివేయించారని ఆయన తెలిపారు. ఇందుకోసం కవిత కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియాలకు ఇతరుల ద్వారా రూ. 4.5 కోట్లు ఇప్పించారని.. అందులో కోటిన్నర క్రెడిట్‌ నోట్‌ రూపంలో ఇచ్చారని సిర్సా తెలిపారు. ఆ తర్వాత పంజాబ్‌లో మద్యం అమ్మకానికి ఎల్‌ -1 లైసెన్స్‌ అమన్‌ దీప్‌ ధల్‌కు చెందిన బ్రిండ్కోకు దక్కిందని వెల్లడించారు.


మనీశ్‌ సిసోడియాకు కుడిభుజమైన దినేశ్‌ అరోరా, అమిత్‌ అరోరాల ద్వారా డబ్బు చేతులు మారిందని ఆరోపించారు. ఇక.. కవిత, అరుణ్‌ రామచంద్రపిళ్లైతో పాటు అరబిందో గ్రూప్‌నకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి, కవిత భాగస్వామిగా ఉన్న అనూస్‌ బ్యూటీ పార్లర్‌ డైరెక్టర్‌, ఆమె పీఏ బోయినపల్లి అభిషేక్‌, కవిత భర్త అనిల్‌ సోదరికి అల్లుడైన శరణ్‌ రెడ్డి తరచూ ఢిల్లీ వచ్చి ఈ డీల్స్‌ నడిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అరబిందో శరత్‌చంద్రారెడ్డికి చెందిన చెందిన ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌.. ఢిల్లీలో మద్యం వ్యాపారానికి సంబంధిచి ఐదు చిన్న కంపెనీలకు ఈఎండీ (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌- బిడ్‌ వేసేటప్పుడు చెల్లించే సొమ్ము) చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ కంపెనీలకు ఈఎండీలు ఎందుకు చెల్లించారనేది ప్రశ్నగా మారింది. ఈ ఐదు కంపెనీల పేర్లనూ సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది. 


లుకౌట్‌ సర్క్యులర్‌..

ఈ కుంభకోణానికి సంబంధించి దేశ వ్యాప్తంగా 31 స్థావరాలపై దాడులు జరిపి 16మందిపై ఎఫ్‌ఐర్‌ దాఖలు చేసిన సీబీఐ.. వారిలో 8 మందిపై ఆదివారం లుకౌట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ) జారీ చేసింది. ఇప్పటికే అయిదుగురిని విచారించిన సీబీఐ ఈ 8 మందిని కూడా విచారించే అవకాశాలున్నాయి. అందుకే, వీరు దేశం విడిచిపోకుండా అన్ని విమానాశ్రయాలు, రేవుల్లో అధికారులను అప్రమత్తం చేసేందుకు ఈ ఎల్‌వోసీలను జారీ చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. ఏడాది వరకూ ఈ ఎల్‌వోసీ అమలులో ఉంటుంది. కాగా.. ఈ 8 మందీ ప్రైవేట్‌ వ్యక్తులేనని సీబీఐ స్పష్టం చేసింది. సిసోడియా, గోపీ కృష్ణ, ఆనంద్‌ తివారీ, పంకజ్‌ భట్నాగర్‌ ప్రభుత్వ హోదా ల్లో ఉన్నందువల్ల వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేయలేదని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రైవేట్‌ వ్యక్తు ల్లో ఒకరైన పెర్నాడ్‌ రికార్డ్‌ కంపెనీ మాజీ ఉద్యోగి మనోజ్‌రాయ్‌పైనా ఎల్‌వోసీ జారీ చేయలేదని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న మిగతా వ్యక్తుల్లో ‘ఓన్లీ మచ్‌ లౌడర్‌’ మాజీ సీఈవో విజయ్‌ నాయర్‌, ‘బ్రిండ్‌ కో సేల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అమన్‌ దీప్‌ ధల్‌, ‘ఇండో స్పిరిట్‌ గ్రూప్‌’ ఎండీ సమీర్‌ మహేంద్రు, ‘బడ్డీ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ డైరెక్టర్‌ అమిత్‌ అరోరా, ఢిల్లీకి చెందిన దినేశ్‌ అరోరా, మహదేవ్‌ లిక్కర్స్‌ ప్రతినిధి సన్నీ మార్వా, అరుణ్‌ రామచంద్ర పిళ్లై, గురుగ్రామ్‌కు చెందిన అర్జున్‌ పాండే ఉన్నారు. వీరు దేశం విడిచి పారిపోకుండా సీబీఐ అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులను అప్రమత్తం చేసింది. 


అక్కడి నుంచే దందా..

కవిత, శరత్‌ తదితరులు ఢిల్లీలోని తుగ్లక్‌ రోడ్‌లో ఉన్న కేసిఆర్‌ నివాసం నుంచి కాక.. దక్షిణ ఢిల్లీ గ్రేటర్‌ కైలాశ్‌లోని గెస్ట్‌హౌ్‌సల నుంచి బేరసారాలు నిర్వహించినట్లు సమాచారం. కవితకు సన్నిహితుడెనౖ అరుణ్‌ రామచంద్ర పిళ్లై.. సమీర్‌ మహేంద్రు నుంచి డబ్బులు తీసుకుని విజయ్‌ నాయర్‌ ద్వారా మనీశ్‌ సిసోడియా తదితరులకు పంపిణీ చేసినట్టు సీబీఐ అనుమానిస్తోంది. విజయ్‌ నాయర్‌ తరఫున సమీర్‌ మహేంద్రు నుంచి అర్జున్‌ పాండే రూ.2 నుంచి 4 కోట్లు వసూలు చేశారని సీబీఐ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. కాగా.. ఒబెరాయ్‌ హోటల్‌లో సూట్‌ రూమ్‌ను బుక్‌ చేసింది అరుణ్‌ రామచంద్ర పిళ్లై అని.. సిసోడియా, అరవి గోపీ కృష్ణ, ఇతర అధికారులు, మద్యంవ్యాపారులు బడ్డీ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అమిత్‌ అరోరా, దినేశ్‌ అరోరా, బ్రిండ్కో సేల్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అమన్‌ ధీప్‌ ధల్‌, విజయ్‌ నాయర్‌, ఇండో స్పిరిట్‌ కంపెనీ యజమాని సమీర్‌ మహేంద్రు, అర్జున్‌ పాండే తదితరులు కవిత బృందంతో అందులోనే మంతనాలు జరిపారని తెలుస్తోంది.


కేసిఆర్‌కు తెలిసే జరిగిందా?

మద్యం కుంభకోణంలో కవిత పాత్ర గురించి కేసీఆర్‌కు తెలిసే ఉంటుందని.. ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. కవిత డీల్‌ కుదుర్చుకున్న తర్వాతే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కేసిఆర్‌ కలుసుకోవడం, పంజాబ్‌కు వెళ్లి రైతులకు డబ్బులు పంచిపెట్టడం జరిగిందని బీజేపీ నేత ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. కవిత గురించి కేసిఆర్‌ కంటే ఎవరికీ ఎక్కువ తెలియదని, ఆమె ఒక వేళ సొంతంగా డీల్స్‌ కుదుర్చుకున్నా కేసిఆర్‌కు ఆ విషయం తెలియకుండా ఎలా ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు.

Updated Date - 2022-08-22T08:53:10+05:30 IST